Madhya pradesh: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సమరోత్సాహం...
ABN , First Publish Date - 2023-06-13T17:31:05+05:30 IST
కాంగ్రెస్ పార్టీ వరుసగా సాధించిన రెండు విజయాలతో ఇప్పుడు 'హ్యాట్రిక్'పై కన్నేసింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాధించిన ఘనవిజయాన్ని మధ్యప్రదేశ్‌లో పునరావృతం చేసేందుకు ఎన్నికల ప్రచారన్ని షురూ చేసింది.
భోపాల్: కాంగ్రెస్ (Congress) పార్టీ వరుసగా సాధించిన రెండు విజయాలతో ఇప్పుడు 'హ్యాట్రిక్'పై కన్నేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ (Himalchal pradesh) ఎన్నికల్లో 40 సీట్లతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇటీవల ముగిసిన కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి.. సోలోగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (Madhya pradesh Assembly polls) మరో నాలుగైదు నెలల్లో జరగనుండటంతో కర్ణాటక తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ముందుగానే శ్రీకారం చుట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లో తరహాలో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ వాద్రా ఈనెల 12న ప్రారంభించారు. నర్మదా నదికి పూజలు చేసిన అనంతరం జబల్‌పూర్ నుంచి ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు.
'మహాకౌషల్' నుంచి గెలిస్తే అధికారం నల్లేరుమీద నడకే...
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. పార్టీ వ్యూహరచనలో కీలక పాత్ర వహిస్తున్న కమల్‌నాథ్ జబల్‌పూర్ నుంచి ప్రియాంకతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా తన రాజకీయ చతురతను చాటుకున్నారు. జబల్‌పూర్‌ను 'మహాకౌషల్'గా పిలుస్తుంటారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మహాకౌషల్, వింద్యాప్రాంతాల్లో గెలుపు కీలకం. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' రోడ్ మ్యాప్‌లో ఈ రెండు ప్రాంతాలు చోటుచేసుకోలేదు. అది దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది. జబల్‌పూర్‌లో గిరిజన జనాభా గణనీయంగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 8 జిల్లా డివిజన్లలోని 13 ఎస్‌టీ రిజర్వ్‌డ్ సీట్లలో 11 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ప్రియాంక గాంధీ జబల్‌పూర్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం వల్ల పొరుగున ఉన్న వింద్య, బుందేల్‌ఖండ్ ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2018 ఎన్నికల్లో బీజేపీ 30 అసెంబ్లీ స్థానాలకు 24 గెలుచుకుంది. దీంతో ఈ ప్రాంతంలో తిరిగి పట్టుసాధించాలని కాంగ్రెస్ వ్యూహరచనగా ఉంది. జబల్‌పూర్ ప్రాంతంలో కీలకంగా 38 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్ 24 సీట్లు గెలుచుకుంది. దీనికి ముందు 2013లో బీజేపీ 24 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 13 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మహాకౌషల్ (జబల్‌పూర్) ప్రాంతంపై పూర్తి పట్టు సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అక్కడి నుంచే ప్రచారాన్ని షురూ చేసింది.
కర్ణాటక తరహాలోనే 5 ప్రధాన హామీలతో...
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణంగా భావిస్తున్న 5 హామీలను మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ అమలు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగానే ప్రియాంక గాంధీ జబల్‌పూర్‌లో ప్రారంభించిన తొలి ర్యాలీలోనే పథకాలు, హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మహిళలకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండరు, 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు.
డిఫెన్స్‌లో బీజేపీ.. ఉచితాలకు సై..!
ఉచితాలను వ్యతిరేకించే బీజేపీ కర్ణాటక ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కొంత సడలింపు తీసుకునేందుకు సిద్ధపడుతోంది. ఇందులో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానంగా మహిళా ఓటర్లను ఉద్దేశించి ఉచితాలకు 'సై' చెప్పారు. మహిళలకు ప్రతినెలా రూ.1,000 సాయం వారి అకౌంట్లలో వేస్తామని ప్రకటించారు. 80 లక్షల రైతు కుటుంబాలకు రూ.2,000 చొప్పున అకౌంట్లలో వేస్తామని, సిలెండర్ రూ.500కే ఇస్తామని ప్రకటించారు. మహిళల కోసం 'లాడ్లీ బెహానా యోజన'ను జబల్‌పూర్ నుంచే ఇటీవల ప్రారంభించారు.
ఎన్నికలెప్పుడు?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి 2024 జనవరి 6వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ లేదా డిసెంబర్ ప్రథమార్థంలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. గత ఎన్నికలు 2018లో జరిగాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్‌నాథ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 2020 మార్చిలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి బీజేపీలో చేరారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎక్కువ మంది ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలవడంతో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీ సాధించింది.