Delhi High Court : మసాలా దినుసులపై దుష్ప్రచారం.. వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశం..
ABN , First Publish Date - 2023-05-05T17:44:48+05:30 IST
భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల్లో ఆవు పేడ, ఆవు మూత్రం కలుపుతారని దుష్ప్రచారం చేస్తున్న వీడియోలను యూట్యూబ్ నుంచి
న్యూఢిల్లీ : భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల్లో ఆవు పేడ, ఆవు మూత్రం కలుపుతారని దుష్ప్రచారం చేస్తున్న వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని గూగుల్ ఎల్ఎల్‌సీ (Google LLC)ని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. ప్రతివాదులు ఇటువంటి వీడియోలను ఉద్దేశపూర్వకంగానే చిత్రీకరించి, అప్‌లోడ్ చేస్తున్నారని నమ్ముతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. 'Catch' మార్క్ బ్రాండెడ్ మసాలా దినుసులను అపఖ్యాతిపాలు చేయడానికి ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారని విశ్వసిస్తున్నట్లు తెలిపింది.
పిటిషనర్ ధరంపాల్ సత్యపాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Dharampal Satyapal Sons Pvt Ltd) విక్రయిస్తున్న 'Catch' మార్క్ మసాలా దినుసులపై ఇటువంటి వీడియోల వల్ల దుష్ప్రభావం పడుతున్నట్లు తెలిపింది. ఈ విషయం ఈ యూట్యూబ్ వీడియోలకు వచ్చే కామెంట్లనుబట్టి అర్థమవుతోందని తెలిపింది. యూట్యూబ్ వీడియోలను సులువుగా చూడటానికి వీలవుతుంది కాబట్టి, ఇటువంటి వీడియోలను ప్రజలు పెద్ద ఎత్తున చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రతివాదులకు పిటిషనర్ ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ వీడియోలను వారు యూట్యూబ్ నుంచి తొలగించకపోవడాన్నిబట్టి వారి దురుద్దేశం అర్థమవుతోందని హైకోర్టు తెలిపింది.
ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన ఇద్దరు ప్రతివాదులు (టీవైఆర్, వ్యూస్ఎన్‌న్యూస్ చానళ్లు) విచారణలో పాల్గొనలేదు. దీంతో హైకోర్టు ఏకపక్ష తీర్పును ఇచ్చింది. గూగుల్ తరపున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన ఆదేశాలను తాము పాటించామని, ఈ మూడు వీడియోలు యూట్యూబ్‌లో కనిపించవని కోర్టుకు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
EWS quota : ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు.. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ..
SCO Meeting : పాక్ మంత్రి ఎదుటే ఉగ్రవాదంపై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి జైశంకర్