Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..
ABN , First Publish Date - 2023-08-26T11:04:31+05:30 IST
మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మన దేశంలో అత్యుత్తమ స్మార్ట్ సిటీగా, ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి.
న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మన దేశంలో అత్యుత్తమ స్మార్ట్ సిటీగా, ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి. ప్రాజెక్ట్ ఫలితాలు, ప్రాజెక్టుల ప్రగతి, బహుమతుల కోసం ప్రజంటేషన్ ఇచ్చిన తీరు వంటివాటి ఆధారంగా నగరాలు, రాష్ట్రాల్లో ఉత్తమమైనవాటిని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) సెప్టెంబరు 27న ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, వివిధ కేటగిరీలలో 66 పురస్కారాలను ప్రకటించారు. మన దేశంలోని స్మార్ట్ సిటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఇండోర్, సూరత్, ఆగ్రా నిలిచాయి. అదేవిధంగా ఉత్తమ రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాల్లో మధ్య ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ నిలిచాయి. ఈ విజేతలకు పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబరు 27న ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇచ్చిన ట్వీట్‌లో, ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ అవార్డ్స్, 2022లో ఉత్తమ రాష్ట్రం అవార్డు పొందిన మధ్య ప్రదేశ్‌ను అభినందించారు. ఈ రాష్ట్రంలోని ఏడు నగరాల్లో రూ.15,696 కోట్ల విలువైన బహుళ రంగ ప్రాజెక్టులు 779 పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
స్వచ్ఛ భారత్ పథకంలో ఆరు సంవత్సరాల నుంచి ఇండోర్ నగరం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా పురస్కారాలను పొందుతున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛ్ సర్వేక్షణ్ , 2022లో మధ్య ప్రదేశ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్, 2021లో ఇండోర్, సూరత్ ప్రథమ స్థానాన్ని పంచుకున్నాయి.
స్మార్ట్ సిటీస్ అవార్డ్స్, 2022లో బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ కేటగిరీలో కోయంబత్తూరుకు ప్రథమ స్థానం లభించింది. మోడల్ రోడ్ల నిర్మాణం, సరస్సులు, చెరువుల పునరుద్ధరణలో ప్రగతి బాటలో పయనిస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్, 2022లో ఎకనమిక్ కేటగిరీలో జైపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొబిలిటీ, గవర్నెన్స్ విభాగాల్లో చండీగఢ్‌లోని పబ్లిక్ బైక్ షేరింగ్, ఈ-గవర్నమెంట్ సర్వీసెస్ ప్రధమ స్థానంలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో కూడా చండీగఢ్‌కు ప్రథమ స్థానం లభించింది.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..
High Court: నటి చిత్ర కేసును 6 వారాల్లో పూర్తి చేయండి