Share News

Mahabalipuram: మహాబలిపురంలో డ్రోన్లపై నిషేధం.. ఎందుకంటే...

ABN , Publish Date - Dec 16 , 2023 | 01:31 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక నగరం మహాబలిపురం(Mahabalipuram)లో పర్యాటకులకు

Mahabalipuram: మహాబలిపురంలో డ్రోన్లపై నిషేధం.. ఎందుకంటే...

- పర్యాటకులకు కొత్త ఆంక్షలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక నగరం మహాబలిపురం(Mahabalipuram)లో పర్యాటకులకు పురావస్తు పరిశోధన శాఖ కొత్త ఆంక్షలు విధించింది. అక్కడి సముద్రతీర దేవాలయం, అర్జున తపస్సు, వెన్నముద్ద బండరాయి తదితర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగుర వేయకూడదని ప్రకటించింది. మహాబలిపురానికి ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వందలాదిమంది పర్యాటకులు విచ్చేస్తున్నారు. సెలవుదినాలలో లక్షలాదిమంది పర్యాటకులు అక్కడి అద్భుత శిల్పకళాఖండాలను సందర్శిస్తుంటారు. అయితే ఇటీవల ఈ చారిత్రక వారసత్వ ప్రదేశాలల్లో పర్యాటకులు హద్దుమీరి వ్యవహరిస్తున్నట్లు పురావస్తు పరిశోధన విభాగం అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సముద్రతీర దేవాలయం వద్ద ప్రేమికుల ప్రవర్తన అధికమైంది. అక్కడి చారిత్రక శిల్పాలపై తమ పేర్లను చెక్కడం, ప్రాచీన శిల్పకలల ప్రహరీపై ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా సాయంత్ర వేళల్లో చారిత్రక శిల్పాలున్న ప్రాంతాల్లో పర్యాటకులు గెంతులేస్తూ వీడియోలు తీయడం, అదే సమయంలో డ్రోన్లు ఎగరవేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరి ఆగడాలు రోజురోజుకూ మీతిమీరడంతో పురావస్తు శాఖ శుక్రవారం నుంచి పర్యాటకులకు కఠిన ఆంక్షలు విధించింది. ఇకపై మహాబలిపురంలోని అర్జున తపస్సు, సముద్ర తీర దేవాలయం, పాండవుల పంచరథాల ప్రాంతం, వెన్నముద్ద బండరాయి తదితర ప్రదేశాల్లో వాణిజ్యపరమైన ఫొటోలు తీయకూడదని, డ్రోన్లు ఎగురవేయకూడదని, శిల్పాలపై పేర్లు చెక్కకూడదని ఆంక్షలు విధించింది. చారిత్రక శిల్పాలున్న ప్రాంతాల వద్ద నూతన వధూవరులు ఫోటోషూట్‌ జరిపేందుకు కూడా అనుమతించే ప్రసక్తి లేదని పేర్కొంది. ఈ ఆంక్షలను అతిక్రమించే పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పురావస్తు పరిశోధన కేంద్రం ఉన్నతాధికారులు హెచ్చరించారు.

nani4.jpg

Updated Date - Dec 16 , 2023 | 01:43 PM