Share News

Gaza-Israel conflict: మరుభూమిగా గాజా.. ఇజ్రాయెల్‌ బాంబింగ్‌.. కూలుతున్న భవనాలు

ABN , First Publish Date - 2023-10-30T03:42:04+05:30 IST

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజా మరుభూమిగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) గ్రౌండ్‌ వార్‌కు దిగడం..

Gaza-Israel conflict: మరుభూమిగా గాజా.. ఇజ్రాయెల్‌ బాంబింగ్‌.. కూలుతున్న భవనాలు

10 వేల మందికి పైగా మృతి!

ఇజ్రాయెల్‌ బాంబింగ్‌.. కూలుతున్న భవనాలు

పెరుగుతున్న మరణాలు.. శిథిలాల కింద పౌరులు

అల్‌-షిఫా, అల్‌-ఖుద్స్‌ ఆస్పత్రుల సమీపంలో

బాంబులు.. అర్ధరాత్రి గాజావాసుల ఉక్కిరిబిక్కిరి

జెరూసలేం/డెయిర్‌-అల్‌-బలా, అక్టోబరు 29: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజా మరుభూమిగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) గ్రౌండ్‌ వార్‌కు దిగడం.. వైమానిక దాడులను ఉధృతం చేయడంతో.. ఒక్కరోజే మూడువేలకు పైగా మరణాలు సంభవించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో గడిచిన మూడు వారాల్లో యుద్ధం వల్ల మరణాల సంఖ్య 10 వేలకు పైగా పెరిగినట్లు చెప్పింది. మూడు వారాలుగా అల్‌-షిఫా, అల్‌-ఖుద్స్‌ ఆస్పత్రుల్ని ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేసిన ఇజ్రాయెల్‌.. శనివారం ఓ ఆస్పత్రిలో హమాస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్నట్లు పలు ఆధారాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం అల్‌-షిఫా ఆస్పత్రి పరిసరాల్లో బాంబుల మోతతో హోరెత్తించగా.. అర్ధరాత్రి అల్‌-ఖుద్స్‌ ఆస్పత్రి పరిసరాల్లో రాకెట్లతో విరుచుకుపడింది. ఈ రెండు ఆస్పత్రుల్లో 2 లక్షలకు పైగా పౌరులు తలదాచుకుంటున్నట్లు స్థానిక మీడియావర్గాలు వెల్లడించాయి. ఆదివారం అర్ధరాత్రి అల్‌-ఖుద్స్‌ ఆస్పత్రి సమీపంలో షెల్లింగ్‌, ఆ పొగలతో లోపల ఉన్న పౌరులు, రోగులు ఉక్కిరిబిక్కిరి అవ్వడం వంటి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి భూతల, గగనతలాల నుంచి ఇజ్రాయెల్‌ సేనలు జరిపిన దాడుల్లో వందల భవనాలు నేలకూలాయి.

సాయంత్రం వరకు 80 ప్రభుత్వ భవనాలు, వందల సంఖ్యలో జనావాసాలు, 47 మసీదులు, 3 చర్చిలు నేలమట్టమైనట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘‘తాల్‌-అల్‌-హవా నగరంలో ఆరంతస్తుల భవనంపై శతఘ్నిదాడులు జరిగాయి. దాంతో ఆ భవనం కుప్పకూలి, 30మంది మరణించారు. జబల్సాలో 110 ఇళ్లు ధ్వంసమై.. 45 మంది మృతిచెందారు. ఖాన్‌యూని్‌స, రఫా ప్రాంతాల్లోనూ 57 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. అల్‌-బలాహ్‌ నగరం నామరూపాల్లేకుండా పోయింది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముంది’’ అని వివరించింది. గాజాలో ఆదివారం సాయంత్రానికి మరణాల సంఖ్య 10 వేలకు పైగా ఉందని తెలిపింది. శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారని పేర్కొంది. ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతమవ్వడంతో ఆదివారం అర్ధరాత్రి సౌదీ రంగంలోకి దిగింది. హుటాహుటిన పలు అరబ్‌ దేశాల అధినేతలతో సమావేశం జరిపింది. అటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ వెంటనే కాల్పులను విరమించాలని ఇజ్రాయెల్‌, హమా్‌సను పదేపదే విజ్ఞప్తి చేశారు. మరోవైపు గాజాలోని తమ గోదాములను ప్రజలు లూటీ చేశారని ఐరాస ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ తెలిపింది.

ఇజ్రాయెల్‌ వర్సెస్‌ తుర్కియే

గాజాపై దాడిని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఖండించడంపై ఇజ్రాయెల్‌ సీరియస్‌ అయింది. ఎర్డోగాన్‌ వ్యాఖ్యలను ఐరాసలోన ఇజ్రాయెల్‌ ప్రతినిధి గిలాద్‌ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్‌ కూడా తుర్కియేలోని తమ దౌత్య ప్రతినిధులను వెనక్కి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రపంచ దేశాలతో సమాచార సంబంధాలు పూర్తిగా తెగిపోయిన గాజాకు తమ ‘స్టార్‌లింక్‌’ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందజేస్తామని ఈలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌-సిసితో ఫోన్‌లో మాట్లాడినట్లు భారత ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

Updated Date - 2023-10-30T08:03:23+05:30 IST