Madhya pradesh: భైరుండగా పేరు మారిన నజ్రుల్లాగంజ్.. శివరాజ్ సర్కార్ నోటిఫికేషన్

ABN , First Publish Date - 2023-04-02T16:40:42+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని మరో పట్టణం పేరు మారుస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని మధ్యప్రదేశ్..

Madhya pradesh: భైరుండగా పేరు మారిన నజ్రుల్లాగంజ్.. శివరాజ్ సర్కార్ నోటిఫికేషన్

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మరో పట్టణం పేరు మారుస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) సారథ్యంలోని మధ్యప్రదేశ్ (Madhya pradesh) ప్రభుత్వం ఆదివారంనాడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీహోరె జిల్లాలోని నజ్రుల్లాగంజ్ (Nasrullaganj) పేరును భైరుండ (Bhairunda)గా మార్చినట్టు తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి 2022 అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2022న డిసెంబర్ 7న ప్రత్యుత్తరమిచ్చిందని, అందుకు అనుగుణంగా నజ్రూల్లాగంజ్ పేరును భైరుండగా మార్చడం జరిగిందని, ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చిందని ఆ నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

శివరాజ్ సింగ్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో భోపాల్‌లోని ఇస్లాం నగర్ గ్రామం పేరును జగ్దీష్‌పూర్‌గా మార్చింది. ఈ పేరు మార్పునకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. భోపాల్‌కు 12 కిలోమీటర్ల దూరంలో జగ్దీష్‌పూర్‌లో ప్రసిద్ధి చెందిన కోటలు ఉన్నాయి. 308 ఏళ్ల క్రితం ఇస్లాం నగర్‌ పేరు జగ్దీష్‌పూర్‌గా ఉండేదని బీజేపీ చెబుతోంది. కాగా, గత ఏడాది హిషంగాబాద్ పేరును నర్మదాపురంగా, నజ్రుల్లాగంజ్‌ పేరును భైరుండాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనూ శివపురిని కుందేశ్వర్ థామ్‌గా, బబయీ పేరును మఖన్ నగర్‌‌గానూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-04-02T16:40:42+05:30 IST