Nifa virus: ‘నిఫా’ను అడ్డుకునేందుకు చర్యలు..
ABN , First Publish Date - 2023-09-16T09:12:20+05:30 IST
రాష్ట్రంలో ‘నిఫా’ వైరస్ను అడ్డుకొనేలా ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నగరంలోని మూడు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు

- మూడు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో ‘నిఫా’ వైరస్ను అడ్డుకొనేలా ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నగరంలోని మూడు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశారు. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రి, కీల్పాక్కం వైద్యకళాశాల ఆసుపత్రి, స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రి, కోయంబత్తూర్, తేని, కన్నియాకుమారి(Coimbatore, Theni, Kanniyakumari) ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశారు. ఆ వార్డుల్లో వైద్య ఉపకరణాలు, వైద్య సిబ్బందిని నియమించారు. ఒకవేళ నిఫా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. కేరళలో ప్రస్తుతం నిఫా బాధితులున్నారని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ వైరస్ ప్రభావం లేదన్నారు. అదే సమయంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, వైద్యులు, సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బాధితులకు వైద్యచికిత్సలందించేందుకు మందులు, వైద్య ఉపకరణాలు, బాధితులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక దుస్తులు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.