Rail Roko Protest: తొమ్మిదేళ్ల కిందటి కేసులో కేంద్ర మంత్రికి విముక్తి
ABN , First Publish Date - 2023-03-26T13:27:50+05:30 IST
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తొమ్మిదేళ్ల క్రితం నాటి కేసు నుంచి విముక్తి లభించింది. కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ..
ముజఫర్‌పూర్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh)కు తొమ్మిదేళ్ల క్రితం నాటి కేసు నుంచి విముక్తి లభించింది. కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు నిరాకరించడంతో బీహార్ వ్యాప్తంగా 2014లో నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా రైల్ రోకో (Rail Roko) చేపట్టిన గిరిరాజ్, మరో 22 మందిపై కేసు నమోదైంది. గిరిరాజ్, ఎల్‌జేపీ ఎంపీ వీణా దేవి, బీజేపీ నేతలు రామ్ సూరత్ రాయ్, సురేష్ శర్మ తదితరులు ఆదివారంనాడు ముజఫర్‌పూర్‌లోని ఎంపీ/ఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుకాగా, కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.
''తొలుత సోనేపూర్‌లోని రైల్వే కోర్టులో కేసు నమోదైంది. ఆ తరువాత ఎంపీ/ఎంఎల్ఓ కోర్టుకు కేసు బదిలీ అయింది. మొత్తం 27 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొనగా, 23 మందిపై ఛార్జిషీటు నమోదైంది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ వారికి విముక్తి కల్పించింది'' అని న్యాయవాది అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆసక్తికరంగా బీహార్‌కు ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్య విపక్ష కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడిస్తే బీహార్‌తో పాటు అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నితీష్ చెబుతున్నారు. ఆ దిశగా విపక్షాల ఐక్య కూటమికి ఆయన పావులు కదుపుతున్నారు.