Ashok Gehlot Vs Modi: ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదంటూ గెహ్లాట్ మండిపాటు

ABN , First Publish Date - 2023-07-22T14:59:32+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్‌, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన మోదీ మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు.

Ashok Gehlot Vs Modi: ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదంటూ గెహ్లాట్ మండిపాటు

జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) విమర్శలు గుప్పించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ (Manipur)లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్‌, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన మోదీ మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని తాను చూడటం ఇదే మొదటిసారని అన్నారు.


జైపూర్‌లోని తన నివాసంలో శనివారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ, మణిపూర్‌లో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. అదే మణిపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆయన (మోదీ) ఏమనేవారో ఊహించుకోవచ్చన్నారు.


మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్టు వెలుగుచూసిన వీడియోపై మోదీ ఇటీవల తన స్పందన తెలియజేస్తూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ పేర్లు ప్రస్తావించారని, ఆ రాష్ట్రాల్లో శాంతిభద్రతల విషయంలో సీఎంలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ మాట్లాడారని, మోదీ వ్యాఖ్యలతో రాజస్థాన్ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయని గెహ్లాట్ అన్నారు. మణిపూర్‌‌లో మోదీ పర్యటించలేకపోతే కనీసం ఒక సమావేశమైనా ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.


మోదీ ఏమన్నారు?

మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులను మోదీ గత గురువారంనాడు ప్రస్తావిస్తూ, సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని అన్నారు. ''ఎవరు దీనికి బాధ్యులనేది పక్కనపెడితే ఇలాంటి ఘటనలు దేశానికి తలవంపులు తెస్తాయి. శాంతి భద్రతలను పటిష్టం చేయాలని సీఎంలందరికీ నేను కోరుతున్నారు. అది రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్‌గఢ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు. రాజకీయాలకు అతీతంగా మహిళలను గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుంది'' అని అన్నారు.

Updated Date - 2023-07-22T14:59:32+05:30 IST