RSS rally: ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి పోలీసులు విధించిన ఆంక్షలు ఇవే..
ABN , First Publish Date - 2023-04-15T09:18:20+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారీ ర్యాలీ జరుపనుంది. ఆ ర్యాలీకి సంబంధించి
అడయార్(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారీ ర్యాలీ జరుపనుంది. ఆ ర్యాలీకి సంబంధించి రాష్ట్ర పోలీసులు 12 రకాల ఆంక్షలు విధించారు. ఊరేగింపులో పాల్గొనే ఆర్‌ఎస్ఎస్(RSS) కార్యకర్తలు చేతిలో కర్రలు పట్టుకోరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్‌ఎ్‌సఎస్ ఊరేగింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో డీఎంకే ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌పై మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆర్‌ఎస్ఎస్ ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. దీంతో వచ్చే ఆదివారం చెన్నై(Chennai)తో పాటు 45 చోట్ల ఆర్‌ఎస్ఎస్(RSS) ర్యాలీలు నిర్వహించనుంది. ఇందుకోసం ఆ సంస్థ నేతలు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్క చెన్నైలోనే రెండు చోట్ల ర్యాలీ జరుగనుంది. కొరట్టూరు వివేకానంద పాఠశాల, ఊరప్పాక్కం శంకరపల్లి వద్ద ఈ ఊరేగింపులు జరుగనున్నాయి. ర్యాలీ తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు 12 రకాల ఆంక్షలు (నిబంధనలు) విధించారు.
- ఊరేగింపు సమయంలో కుల మతాల గురించి ప్రసంగించరాదు.
- భారత ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు మద్దతుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు. దేశ సమగ్రత, సమైక్యతలకు విఘాతం కలిగించేలా నడుచుకోరాదు.
- ప్రజలకు, వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఊరేగింపు లేదా ర్యాలీ నిర్వహించరాదు.
- ర్యాలీలో పాల్గొనేవారు ఇతరులకు గాయం కలిగించేటువంటి కర్రలు లేదా ఇతర ఆయుధాలు చేతపట్టుకోరాదు.
- ఊరేగింపునకు ఏర్పాట్లు చేసిన వారే తాగు నీరు, ఫస్ట్‌ఎయిడ్ వసతి, మొబైల్ టాయిలెట్ వాహనాలు, కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు వంటివి సమకూర్చుకునేందుకు స్థానిక యంత్రాంగాలతో కలిసి చర్చించుకోవాలి.
- ఊరేగింపునకు అనుమతించిన మార్గంలో ఆర్‌ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎడమ వైపున మాత్రమే వెళ్ళాలి. అనుమతించిన రహదారిలో నాలుగో వంతు మాత్రమే ర్యాలీకి ఉపయోగించుకోవాలి.
- ఊరేగింపు సమయంలో వాహనాల క్రమబద్ధీకరణ కోసం ఆర్‌ఎ్‌సఎస్ నిర్వాహకులు పోలీసులతో కలిసి పనిచేసేలా వలంటీర్లను నియమించాలి.
- పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే ర్యాలీ సాగుతుందని నిర్వాహకులు హామీ ఇవ్వాలి
- బాక్స్ టైప్ సౌండ్ సిస్టమ్స్‌ను మాత్రమే ఊరేగింపులో ఉపయోగించాలి. శబ్ధ వినికిడి 15 వాట్స్‌కు పెరగకుండా చూసుకోవాలి. లౌడ్‌స్పీకర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు.
- ఊరేగింపులో వెళ్ళేవారు మతం, భాష, సంస్కృతి, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించరాదు
- ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన పక్షంలో వాటికి నష్టపరిహారం చెల్లించేలా హామీ ఇవ్వాలి.
- ఆంక్షలు ఉల్లంఘించిన పక్షంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు
రాష్ట్ర పోలీస్ శాఖ పంపించిన ఈ సర్క్యులర్‌లోని నిబంధనలను మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు రూపొందించి ఖరారు చేసినట్టు సమాచారం.