Vikram Lander 20 minutes of terror': సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. ఎంత క్లిష్టమో!

ABN , First Publish Date - 2023-08-23T02:33:54+05:30 IST

అది.. 2019, సెప్టెంబరు 7! సమయం అర్ధరాత్రి దాటింది. చంద్రయాన్‌-2(Chandrayaan-2) మిషన్‌లో భాగంగా భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ప్రవేశించిన ల్యాండర్‌ విక్రమ్‌.. సరిగ్గా చంద్రుడి దక్షిణ ధ్రువం పైభాగానికి చేరుకుంది.

Vikram Lander 20 minutes of terror': సాఫ్ట్‌ ల్యాండింగ్‌..   ఎంత క్లిష్టమో!

చంద్రయాన్‌-3లో అత్యంత కీలకమైన దశ అదే

‘20 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’గా పేర్కొంటున్న శాస్త్రజ్ఞులు

అది.. 2019, సెప్టెంబరు 7! సమయం అర్ధరాత్రి దాటింది. చంద్రయాన్‌-2(Chandrayaan-2) మిషన్‌లో భాగంగా భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ప్రవేశించిన ల్యాండర్‌ విక్రమ్‌.. సరిగ్గా చంద్రుడి దక్షిణ ధ్రువం పైభాగానికి చేరుకుంది. సరిగ్గా ఆ సమయంలో చంద్రుడిపై సూర్యోదయం ప్రారంభమైంది. అరుణుడి లేత కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా.. ఆ లేలేత వెలుగులో విక్రమ్‌.. లిక్విడ్‌ థ్రస్టర్‌ ఇంజన్లను మండించుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటూ కిందికి దిగడం ప్రారంభించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. దాన్నుంచి సంకేతాలు ఆగిపోయాయి. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఏమయింది? విక్రమ్‌ సజావుగా ల్యాండయిందా? లేక కుప్పకూలిపోయిందా? అనే భయం! ఆ భయమే నిజమైంది. జాబిలిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో విఫలమైన విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander).. చివరి క్షణాల్లో తలకిందులుగా పడిపోయింది.

...ఒక్క మన విక్రమ్‌ ల్యాండరే కాదు. అభివృద్ధి చెందిన దేశాలు చేపట్టిన పలు మూన్‌ మిషన్లు కూడా ఈ చివరి దశను అధిగమించలేక చతికిలపడ్డాయి. ఎందుకిలా? సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో ఎందుకివన్నీ విఫలమయ్యాయి? ఇంతకీ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటే ఏమిటి? ఆ దశను ‘భయానక 20 నిమిషాలు (20 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌)’గా ఎందుకు అభివర్ణిస్తారు? అంటే.. అది నిజంగానే అత్యంత క్లిష్టమైన దశ. ఎందుకంటే.. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి (భూమితో పోలిస్తే చాలా తక్కువగా) ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్‌ ల్యాండర్‌.. మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ల్యాండర్‌ నెమ్మదిగా వెళ్లి అక్కడ దిగితే దాన్ని సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటారు. ల్యాండర్‌ అలా నెమ్మదిగా దిగడానికి దాదాపు 19 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయంలో ఏ దశలో ఏం జరుగుతుందంటే..

రఫ్‌ బ్రేకింగ్‌ దశ

లక్ష్యం: ల్యాండర్‌ వేగాన్ని తగ్గించడం

సమయం: 690 సెకన్లు

ఈ దశలో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్‌ 7.4 కిలోమీటర్ల ఎత్తుకు, ల్యాండింగ్‌ ప్రదేశానికి 32 కిలోమీటర్ల దూరానికి (సమాంతరంగా) చేరుకుంటుంది. ల్యాండర్‌ వేగం గంటకు 6 వేల కిలోమీటర్ల నుంచి గంటకు 1,288.8 కిలోమీటర్లకు తగ్గుతుంది.

ఆల్టిట్యూడ్‌ హోల్డింగ్‌ ఫేజ్‌

లక్ష్యం: ల్యాండర్‌ వర్టికల్‌ వేగాన్ని తగ్గించడం, సమాంతరంగా ఉన్న ల్యాండర్‌ స్థితిని కొంతమేరకు నిలువుగా మార్చడం

సమయం: 10 సెకన్లుఈ దశలో ల్యాండర్‌ సమాంతర వేగం గంటకు 1,288.8 కిలోమీటర్ల నుంచి 1,209.6 కిలోమీటర్లకు తగ్గుతుంది. వర్టికల్‌ వేగం గంటకు 219.6 కిలోమీటర్ల నుంచి 212.4 కిలోమీటర్లకు తగ్గుతుంది. ల్యాండర్‌ కూడా 7.4 కిలోమీటర్ల ఎత్తు నుంచి 6.8 కిలోమీటర్ల ఎత్తుకు దిగుతుంది. సమాంతరంగా ఉన్న ల్యాండర్‌ నిట్టనిలువు స్థితిలోకి రావడానికి వీలుగా తొలుత 50 డిగ్రీల మేర వంగుతుంది.

2soft-land-Big-size.jpg


ఫైన్‌ బ్రేకింగ్‌ దశ

లక్ష్యం: ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు తేవడం

సమయం: 175 సెకన్లు; 800 మీటర్ల ఎత్తుకు చేరకున్నాక అక్కడే 12 సెకన్లపాటు నిలిచి ఉంటుంది.

ఈ దశలో.. చంద్రుడి ఉపరితలం నుంచి 6.8 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ 800 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. ఆ సమయానికి.. దాని సమాంతర, వర్టికల్‌ వేగాలు సున్నాకు చేరుకుంటాయి. ల్యాండర్‌ 12 సెకన్లపాటు అక్కడే నిలిచి ఉంటుంది. దాని కోణం 50 డిగ్రీల నుంచి 90 డిగ్రీలకు మారుతుంది. ల్యాండర్‌ కాళ్లు చంద్రుడి దిక్కుకు తిరిగి.. దిగడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో ల్యాండర్‌లోని హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ ఎవాయిడెన్స్‌ కెమెరా పనిచేయడం ప్రారంభిస్తుంది. ల్యాండింగ్‌ లొకేషన్‌ను ఫొటో తీసి.. అక్కడ దిగడానికి సురక్షిత వాతావరణం ఉందా లేదా దాంట్లోని కృత్రిమ మేధ విశ్లేషిస్తుంది. మిగతా పరికరాల సమాచారం సాయంతో ల్యాండర్‌.. ల్యాండింగ్‌ సైట్‌ దిశగా కదులుతుంది.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌-1

లక్ష్యం: సురక్షిత ల్యాండింగ్‌సైట్‌ను గుర్తించడం

సమయం: కిందికి దిగడానికి 131 సెకన్లు; చంద్రుడి ఉపరితలానికి 150 మీటర్ల ఎత్తుకు చేరాక అక్కడే 22 సెకన్లపాటు నిలిచి ఉంటుంది.

ఈ దశలో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తు నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరాల్సి ఉంటుంది. చంద్రుడి గురుత్వబలం ల్యాండర్‌ను కిందకి లాగుతుంటే.. ల్యాండర్‌లోని గ్రౌండ్‌ ఫేసింగ్‌ రాకెట్లు అది వేగంగా కిందికి జారిపోకుండా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దాన్ని కిందికి దింపుతుంటాయి. 131 సెకన్ల తర్వాత ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలం నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుతుంది. అక్కడ 22 సెకన్లపాటు నిలిచి ఉండగా.. దాంట్లోని పరికరాలు ల్యాండింగ్‌ ప్రదేశాన్ని గుర్తిస్తాయి.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌ 2

లక్ష్యం: ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలం నుంచి 60 మీటర్ల ఎత్తుకు చేరుకోవడం సమయం: 52 సెకన్లు

చంద్రుడి ఉపరితలానికి 150 మీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్‌.. ఈ దశలో 60 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. దాంట్లోని కృత్రిమ మేధ పరికరాలు సురక్షితమైన ల్యాండింగ్‌ ప్రదేశాన్ని నిర్ధారిస్తాయి. అక్కడికి చేరుకోవడానికి ల్యాండర్‌ నెమ్మదిగా దిశ మార్చుకుంటుంది.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌ 3

లక్ష్యం: సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ముందు దశ

సమయం: 38 సెకన్లు

కృత్రిమ మేధ నిర్ధారించిన సురక్షిత ల్యాండింగ్‌ ప్రదేశంలో.. ల్యాండర్‌ గంటకు 4.7 కి.మీ. వేగంతో దిగడం ప్రారంభిస్తుంది. చంద్రుడి ఉపరితలానికి 60 మీటర్ల ఎత్తు నుంచి 10 మీటర్లకు జారుతుంది. ఆ దశలో ల్యాండర్‌లోని ఇంజన్లన్నీ షట్‌డౌన్‌ అవుతాయి.

టెర్మినల్‌ డిసెంట్‌ ఫేజ్‌ 4 (ఫ్రీఫాల్‌ దశ)

లక్ష్యం: ల్యాండర్‌ చంద్రుడిపై దిగడం

సమయం: 9 సెకన్లు

చంద్రుడి ఉపరితలానికి 10 మీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్‌లోని ఇంజన్లన్నీ షట్‌డౌన్‌ అవగానే.. చంద్రుడి గురుత్వశక్తి కారణంగా కిందికి జారడం మొదలుపెడుతుంది. దాని కాళ్లు చంద్రుణ్ని తాకగానే.. వాటిలో ఉండే సెన్సర్లు యాక్టివేట్‌ అవుతాయి. ల్యాండర్‌ చంద్రుడి మీద దిగిన 1.25 సెకన్లకు.. ఆ విషయం ఇస్రో గ్రౌండ్‌ కంట్రోల్‌కు తెలుస్తుంది.

..ఇక్కడితో ల్యాండర్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ విజయవంతమైనట్టు. అయితే, దీని తర్వాత ఇంకో దశ కూడా ఉంది. అది.. ల్యాండర్‌లోని రోవర్‌ బయటకు వచ్చి పరిశోధనలు చేసే దశ. కానీ అందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. కారణమేంటంటే.. 10 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ కిందికి జారి పడినప్పుడు ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. అంతా సద్దుమణిగాక.. ల్యాండర్‌లోని రోవర్‌ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫొటోలు తీసుకుని భూమికి పంపుతాయి. రెండూ సురక్షితంగా ఉన్నాయనడానికి ఆ ఫొటోలే నిదర్శనం. దీంతో చంద్రయాన్‌-3 పూర్తిగా సఫలమైనట్టు లెక్క.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2023-08-23T09:36:55+05:30 IST