Rahul Gandhi: ఆ మాటెత్తితేనే మోదీ భయపడుతున్నారు: రాహుల్

ABN , First Publish Date - 2023-09-23T19:35:52+05:30 IST

దేశంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులగణన పేరెత్తితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడతున్నారని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో రాహుల్ మాట్లాడారు.

Rahul Gandhi: ఆ మాటెత్తితేనే మోదీ భయపడుతున్నారు: రాహుల్

జైపూర్: దేశంలో కులగణన (Caste census) చేపట్టాలని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కులగణన పేరెత్తితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో రాహుల్ మాట్లాడుతూ, ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారని, అయితే దానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టారని చెప్పారు.


''మొదట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill) గురించి వాళ్లు (కేంద్ర ప్రభుత్వం) మాట్లాడలేదు. ఇండియా వెర్సస్ భారత్ వివాదంపై చర్చించేందుకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్లు ప్రకటించారు. ప్రజలు ఈ అంశాన్ని ఏమాత్రం ఇష్టపడకపోవడం, అప్పటికే పార్లమెంటు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చారు. బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చాలంటే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అవసరమని బీజేపీ అంటోంది. తద్వారా కనీసం 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ల అమలును జాప్యం చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తక్షణం రిజర్వేషన్లను అమలు చేయాలని చెబుతోంది. ఓబీసీ మహిళలకు కూడా లబ్ధి చేకూరాలని కోరుతున్నాం'' అని రాహుల్ తెలిపారు.


ఓబీసీల పట్ల తమకు గౌరవం ఉందని ప్రతిరోజూ మాట్లాడే ప్రధానమంత్రి కులగణన పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. కులగణనను కాంగ్రెస్ చేపట్టిన విషయాన్ని మోదీ తన తదుపరి ప్రసంగంలో ప్రజలకు చెప్పాలని, ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయని, ఆ లెక్కలేమిటో ప్రజల ముందు ఉంచాలని రాహుల్ కోరారు. ఈసారి జనాభా సేకరణ కులం ఆధారంగా చేపట్టాలని, ఓబీసీలను అవమానపరచ వద్దని, వారిని మోసగించవద్దని రాహుల్ సూచించారు.


పార్లమెంటులో నా గొంతు నొక్కాలనుకున్నారు...

పార్లమెంటులో తాను కులగణన అంశాన్ని ప్రస్తావించినప్పుడు బీజేపీ ఎంపీలు తన గొంతు వినపడకుండా చేయాలనే ప్రయత్నం చేశారని రాహుల్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోందన్నారు. అదానీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటని బీజేపీ కార్యకర్తలను అడిగితే వాళ్లు వెనక్కి తిరిగిచూడకుండా వెళ్లిపోతారని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఈ సదస్సులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T19:35:52+05:30 IST