Geetha Madhuri : ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు
ABN , First Publish Date - 2023-03-04T23:50:19+05:30 IST
చమ్కా చమ్కా చమ్కీరే చిన్నారి చింగారే... నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా... దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే... ...ఊర మాస్ బీట్ అయినా... శ్రావ్యమైన సంగీతమైనా... గీతామాధురి గొంతులో పలికితే ‘టాప్ లేచిపోద్ది’.
చమ్కా చమ్కా చమ్కీరే చిన్నారి చింగారే...
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా...
దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే...
...ఊర మాస్ బీట్ అయినా... శ్రావ్యమైన సంగీతమైనా...
గీతామాధురి గొంతులో పలికితే ‘టాప్ లేచిపోద్ది’.
పరిశ్రమతో పదిహేనేళ్ల అనుబంధం. విలక్షణ గాయనిగా ప్రత్యేక స్థానం. తెలుగు ‘ఇండియన్ ఐడల్-2’ ద్వారా తొలిసారి న్యాయనిర్ణేతగా మారిన గీత... తన అనుభవాలను, అనుభూతులను ‘నవ్య’తో పంచుకున్నారు...
పాటల తరువాత నాకు యాంకరింగ్ చాలా ఇష్టం. కమ్యూనికేషన్, కో-ఆర్డినేషన్ నచ్చుతాయి. వాయిస్‌ఓవర్ లాంటివి చేస్తుంటాను.
ఒకవేళ గాయని కాకపోయి ఉంటే ఎయిర్‌హోస్టెస్ అయ్యేదాన్ని. ఇంటర్‌లో ఉండగా ఎయిర్‌హోస్టెస్ ట్రైనింగ్ తీసుకొందామని వెళ్లాను కూడా! కానీ ఇంటర్ తరువాత రమ్మన్నారు. ఈలోగా ఇటువైపు వచ్చేశా.
బాలు గారు, చిత్ర గారు, సునీత గారు, శ్రేయాగోషల్ నాకు బాగా ఇష్టమైన గాయకులు. ఈ మధ్యకాలంలో అర్జీత్‌సింగ్ పాటలు కూడా నచ్చుతున్నాయి. సంగీత దర్శకుల్లో ఇళయరాజా, కీరవాణి, రహమాన్ చాలా ఇష్టం.
‘‘ఆ గగనంలో తారాజ్యోతి కిరణం నువ్వయితే’... అంటూ కీరవాణి గారి మధురమైన బాణీతో నా సినీ పాటల ప్రయాణం మొదలైంది. రవితేజ ‘ఖతర్నాక్’ చిత్రంలోనిదా గీతం. నిజానికి నా తొలి రికార్డింగ్ మా గురువు రామాచారి గారు స్వరపరిచిన ‘ప్రేమ లేఖ చిత్రం’లో. కానీ ముందు విడుదలైన సినిమా ‘ఖతర్నాక్’. ఇది 2006లో సంగతి. సంగీత సాగరాన్ని మథిస్తున్న ఇద్దరు ఉద్దండుల ద్వారా పరిశ్రమకి పరిచయం కావడం నిజంగా నాకు లభించిన గొప్ప అవకాశం. ఇక అక్కడి నుంచి ఇన్నేళ్లలో ఏ రోజూ ఖాళీగా ఉన్నది లేదు. నేను సినిమాల్లోకి రావడానికి కారణం కూడా మా గురువుగారే. ఆయన దగ్గరే లలిత సంగీతం నేర్చుకుని, తరువాత ఆయన దగ్గరే పాడాను. సార్ ప్రోద్బలంతోనే రికార్డింగ్‌లు, కోరస్‌లు, ట్రాక్‌లు పాడుతూ వచ్చాను. అలా సినిమాల్లో అవకాశం లభించింది. నాటి నుంచి కెరీర్ శరవేగంగా దూసుకుపోతోంది.
స్కూల్లో ఫస్ట్ ప్రైజ్‌తో...
మా చుట్టాల్లో పాటలు పాడేవారున్నారు కానీ, మా ఇంట్లో ఎవరికీ సంగీత నేపథ్యం కూడా లేదు. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరూ లేరు. పాటలంటే మొదటి నుంచి నాకు ఇష్టం. ఆ ఇష్టంతోనే కొచ్చర్లకోట పద్మావతి గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర కవిటం గ్రామం మా స్వస్థలం. ఒకసారి మా స్కూల్లో పాట పోటీలు నిర్వహించారు. అందులో మొదటి బహుమతి గెలుచుకున్నా. అది చూసి ‘ఓకే... తను పాడగలదు’ అని ఇంట్లోవాళ్లు గ్రహించారు. నాకూ నమ్మకం కలిగింది. అప్పటి నుంచి సాధనపై మరింత దృష్టి పెట్టాను.
ఆ పాటలతో ప్రాచుర్యం...
బీకాం చదువుతున్నప్పుడే నాకు సినిమా అవకాశాలు మొదలయ్యాయి. తరువాత కెరీర్ బాగా బిజీ అయిపోయింది. అసలు కాలేజీకి వెళ్లడం కుదరలేదు. దీంతో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయలేకపోయాను. తరువాతైనా పరీక్షలు రాయచ్చుగా అంటే... ‘రాసినా ఫెయిల్ అవుతాన’ని చెప్పా. అందుకే ఇంక పరీక్షలు రాయలేదు. నిజం చెప్పాలంటే అంత సమయం దొరకలేదు. గాయనిగా ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంలో ఐదు వందలకు పైగా సినిమా పాటలు పాడాను. ఇతర పాటలు కూడా కలుపుకొంటే రికార్డు చేసినవి 1500 పైనే ఉంటాయి. అయితే గీతామాధురి పేరు బాగా పాపులర్ అయింది ‘చిరుత’ చిత్రంలోని ‘చమ్కా చమ్కా చమ్కీరే’ పాటతో. తరువాత ‘నచ్చావులే’లో పాడిన ‘నిన్నే నిన్నే కోరా... నిన్నే నిన్నే చేరా... నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా’ పాట. ఆ పాటకు నంది అవార్డు అందుకున్నా. ఈ రెండూ నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ముందు భయం వేసింది...
ఇప్పుడు ‘ఆహా’ వారి తెలుగు ‘ఇండియన్ ఐడల్’ సీజన్2కు న్యాయనిర్ణేతగా ఉన్నాను. ఒక పాటల పోటీకి జడ్జిగా వ్యవహరించడం నాకు ఇదే మొదటిసారి. ఇది నాకు ఒక కొత్త అవకాశం. కొత్త పాత్ర. తమన్, కార్తీక్ లాంటి వారి పక్కన కూర్చోవాలంటే మొదట్లో కొంచెం భయం వేసింది. అయితే ఇప్పుడు కాస్త అలవాటైంది. అప్రమత్తంగా ఉంటూ అందరూ మెచ్చేలా, నేను చేయగలిగింది చేద్దామనుకొంటున్నా. ఇన్నేళ్లుగా పరిశ్రమలో ఉన్నా కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి ఇంతకాలం పట్టిందా అని అడగవచ్చు. అందుకు ముందు నా వయసు, నా అనుభవం సరిపోవని ఇప్పటివరకు ఆగాను. వేరొకరి ప్రతిభను అంచనా వేయాలంటే అనుభవం ముఖ్యం. అది లేకుండా పిలిచారు కదా అని వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటే... దానికి నేను న్యాయం చేయలేను. అందుకే గతంలో అడిగినా కూడా నో చెప్పాను. ఇప్పుడు కూడా పరిశ్రమలో ఇరవై ఇరవై ఐదేళ్ల అనుభవజ్ఞులు జడ్జీలుగా ఉన్నారు. వారి పక్కన కూర్చోవడానికి నా స్థాయి సరిపోతుందా అని ఆలోచించాను. అయితే చాలామంది అన్నారు... ‘గాయనిగా, మెంటార్‌గా మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. జడ్జిగా కూర్చోవచ్చు’ అని. ఆ మాటలతో నాకు భరోసా కలిగింది. ఆ భరోసాతోనే రంగంలోకి దిగేశాను. ‘ఇండియన్ ఐడల్’ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
అందుకే కెరీర్ తగ్గుతోంది...
చాలామంది అంటుంటారు... గతంలోలాగా ఇప్పుడు గాయకులకు సుదీర్ఘ కెరీర్ ఉండడం లేదని! నిజమే. అందుకు కారణం ప్రస్తుతం గాయకులతోపాటు, సినిమాలు, వేదికలు ఎక్కువైపోయాయి. అందరికీ కొత్తదనం కావాలి. సగటు ప్రేక్షకుడి ఆలోచనా విధానం మారింది. కొత్తవాళ్లు వచ్చినా ఆదరించేవారు ఎక్కువయ్యారు. కనుకనే కొత్తవారికి అవకాశాలు వస్తున్నాయి. అదే సమయంలో ఒకే గొంతు ఎక్కువ కాలం వినలేని పరిస్థితి. తొందరగా బోర్ కొట్టేస్తోంది. గతంలో ఇలా లేదు. ఇన్ని అవకాశాలు, వేదికలు, ఆలోచనలు లేవు. నాడు సినిమా కానీ, పాట కానీ చాలా అరుదుగా దొరికే విషయం. రేడియోలో వచ్చినప్పుడు వినడం తప్ప మరో దారి లేదు. చాలా తక్కువమంది గ్రామఫోన్లు, టేపురికార్డర్లు కొనేవారు. ఒక పాట మళ్లీ వినాలంటే రేడియోలో వచ్చేవరకూ వేచివుండాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు... అన్ని సౌకర్యాలూ అందరికీ అరచేతిలోకే వచ్చేశాయి. ఒకే పాటను పది పదిహేనుసార్లు వినేసి, బోర్ కొట్టాక కొత్త పాటకు వెళ్లిపోవచ్చు. వీటన్నిటి నేపథ్యంలో సహజంగానే మార్పు వస్తుంది కదా. ఆలోచనల్లో... అవకాశాల కల్పనలో! దానికి తగ్గట్టుగానే గాయలకుల కెరీర్ కుదించుకుపోతోంది.
తొక్కాలనుకొంటేనే తప్పు...
ఇది ప్రతిచోటా వినిపించేదే. నావరకు అలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే బంధుప్రీతి అనేది తప్పని నేను అనను. మన ఆస్తి మన పిల్లలకు ఎలాగైతే దక్కాలనుకొంటామో... అలాగే తమవాళ్లకు అవకాశాలు దక్కాలనుకోవడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం. అలా కాకుండా అయినవారి కోసం వేరొకరిని తొక్కేయడం తప్పు. ఆ మాటకొస్తే నెపొటిజమ్ అనేది ప్రతిచోటా ఉంటుంది. ఉదాహరణకు మా అమ్మాయిని నేను స్కూల్లో జాయిన్ చేస్తాననుకోండి... అక్కడ వేరే అమ్మాయి చేరకూడదు అనుకొంటే అది తప్పు అవుతుంది. తమ పిల్లలకు మంచి ఉద్యోగం తెప్పించుకోవాలని ఎవరికి ఉండదు! ఇక ఈ రోజుల్లో ఎవరూ ఎవర్నీ తొక్కేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇన్ని వేదికలు, బలమైన సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. ఒకర్ని ఎదగకుండా ఇంకొకరు అడ్డుకోలేరు. ఒకచోట ఆపినా వేరొకచోట కొత్త అవకాశం వస్తూనే ఉంటుంది.
మొహమాటం ఎక్కువ...
నాకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదలను. అది చిన్న సినిమా కావచ్చు... పెద్ద సినిమా కావచ్చు. దాంతోపాటు నా సహనం. ఇదే నా బలం. బలహీనతంటారా... ఎవరికీ ‘నో’ చెప్పలేకపోవడం. నాకు మొహమాటం ఎక్కువ. దానివల్లే చాలా సమస్యలు వచ్చాయి. మొహమాటానికి కొన్ని అవసరం లేనివి కూడా ఒప్పేసుకొంటాను. ఉదాహరణకు ఎక్కడికైనా గెస్ట్‌గా పిలిచారనుకోండి... అదే సమయంలో ఇంకో పని ఉందనుకోండి... ‘నో’ అనలేక రెండూ మేనేజ్ చేయాలని చూస్తాను. దానికి బదులు ఒకేదానికి వెళ్లి ప్రశాంతంగా ఉండచ్చు. కానీ రెండూ మేనేజ్ చేసి, ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదనుకొంటా. దాంతో ఏమవుతుందంటే... ‘ఎక్కడైనా ఎవరైనా ఫీలయ్యారా? ఎవరైనా హర్ట్ అయ్యారా? నేను సరిగ్గానే మాట్లాడానా?’ అని ఆలోచిస్తుంటా. అది నా వీక్‌నెస్.
ఇండిపెండెంట్ మ్యూజిక్...
ఏ రంగంలోనైనా సుదీర్ఘ కాలం ప్రయాణిస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. నాకూ అలాంటివి ఎదురయ్యాయి కానీ, వాటి ప్రభావం నా కెరీర్‌పై పడలేదు. అయితే ఆ సమయంలో అనిపిస్తుంది... ‘ఇలా అయిందేమిటి’ అని! ఏదైనా మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకొంటామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ‘ఇండియన్ ఐడల్’తో పాటు, ఇతర షోలు చేస్తున్నా. మంచి పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికైనా ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలు చేయాలనేది నా ఆకాంక్ష. అయితే ఇప్పుడున్న కమిట్‌మెంట్స్‌తో అది సాధ్యంకావడంలేదు. ఇవన్నీ అయిపోయాక నిదానంగా మొదలుపెడతా.’’
ఫ హనుమా