Heart WAY: హృదయ మార్గం
ABN , First Publish Date - 2023-02-09T23:17:37+05:30 IST
జీవితంలో మనకు అనేక రకాల అనుభవాలు ఎదురవుతాయి. అవి మన నమ్మకాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఏ విషయాల మీద మనకు దృఢమైన నమ్మకాలు ఉండవో.. వాటిని మనం పూర్తిగా స్వీకరించం.
చింతన
జీవితంలో మనకు అనేక రకాల అనుభవాలు ఎదురవుతాయి. అవి మన నమ్మకాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఏ విషయాల మీద మనకు దృఢమైన నమ్మకాలు ఉండవో.. వాటిని మనం పూర్తిగా స్వీకరించం. పైగా ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి కూడా ఎంతో సంశయిస్తాం. అనుభవం అనే మాట అందరూ వినే ఉంటారు. కానీ దాని ప్రాధాన్యత ఏమిటనేది గుర్తించేవాళ్ళు చాలా తక్కువ. ఈ సందర్భంగా నేను మీకొక కథ చెబుతాను. ఆ వ్యక్తి తన మనో వాంఛలు ఎలా తీర్చుకోవాలనే ఆలోచనతోనే ప్రతిరోజూ గడిపేవాడు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా... తన కోరికలు తీర్చే భూతం ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకొనేవాడు. అతను ఈ అన్వేషణలో కొనసాగుతూ ఉండగా... ఓ రోజున ఒక సాధువు అతనికి ఎదురయ్యాడు. ‘‘నా కోరికలన్నీ తీర్చగలిగే ఏదైనా భూతం ఉంటే ఇవ్వగలరా?’’ అంటూ ఆ సాధువుకు అతను మొరపెట్టుకున్నాడు.
‘‘నా దగ్గర అలాంటి భూతం ఒకటుంది. కానీ ఏ రోజైతే నీకు ఇక ఏ కోరికలూ లేకుండా పోతాయో... అప్పుడు అది నిన్ను తినేస్తుంది. ఆలోచించుకో’’ అన్నాడు ఆ సాధువు.
‘‘అలా ఎన్నటికీ జరగదు. ఎందుకంటే నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి. నన్ను తినే అవకాశమే దానికి ఇవ్వను’’ అని చెప్పాడా వ్యక్తి.
‘‘సరే! నీ ఇష్టం’’ అంటూ ఒక భూతాన్ని సాధువు పిలిచి, ఆ వ్యక్తికి అప్పగించాడు.
‘‘నేను ఏం చెయ్యాలో ఆదేశించు. లేకపోతే నిన్ను తినేస్తాను’’ అంది భూతం.
‘‘నా కోసం ఒక పెద్ద భవనం కట్టు’’ అని అడిగాడు.
భూతం చిటికెలో పెద్ద భవంతి నిర్మించి, ‘‘ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. లేదంటే నిన్ను తినేస్తాను’’ అంది.
‘‘నాకు ధన సంపదలు ఇవ్వు. నాకు సేవలు చెయ్యడానికి నౌకర్లను ఏర్పాటు చెయ్యి’’ అని ఆదేశించాడు.
ఆ కోరికలన్నిటినీ భూతం తీర్చేసింది. తరువాత ఏం చెయ్యాలో ఆదేశించాలని అడిగింది. అలా ఆ వ్యక్తి కోరిన ప్రతిదాన్నీ క్షణాల్లో భూతం పూర్తి చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే అతని కోరికలన్నీ తీర్చేసింది. ఇక అడగడానికి అతనికి ఏమీ మిగలలేదు.
‘‘నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? లేదంటే నిన్ను తినేస్తాను’’ అంది భూతం.
ఆ వ్యక్తికి ఏమీ తోచక, భయంతో పరుగులు తీస్తూ సాధువు దగ్గరకు వెళ్ళాడు. తన పరిస్థితి వివరించాడు.
‘‘నీకు ముందే చెప్పాను కదా! నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నేనేం చెయ్యలేను’’ అన్నాడు సాధువు.
తన తప్పును మన్నించి, ఏదో ఒక ఉపాయం చెప్పాలని ఆ వ్యక్తి ప్రాధేయపడ్డాడు.
అప్పుడు ఆ సాధువు ‘‘భూతానికి ఒక నిచ్చెన ఇవ్వు. నువ్వు పిలిచేవరకూ దాన్ని ఎక్కుతూ, దిగుతూ ఉండాలని ఆదేశించు’’ అని చెప్పాడు.
ఆ వ్యక్తి అలా చేసి, భూతం నుంచి తప్పించుకున్నాడు.
అలాంటి భూతమే మీ వెంట కూడా పడింది. అదే... మీ మనస్సు. మనం జీవితంలో హృదయం చెప్పేది వినాలి, మనస్సు చెప్పేది కాదు. ఎందుకంటే... చంచల స్వభావం ఉన్న మనస్సు ఎప్పుడూ ఏదో ఒకటి కావాలంటుంది. కానీ మనల్ని శాంతి పథంలో నడిపించేది హృదయం మాత్రమే. అదే లేకపోతే జీవితం అసంపూర్తిగా మిగిలిపోతుంది. హృదయమార్గంలో పయనించినప్పుడు మాత్రమే... జీవితం సుఖ సంతోషాలతో... ఆనందంగా సాగిపోగలదని గుర్తించండి.
-ప్రేమ్ రావత్, 9246275220