California winter storms: అగ్రరాజ్యంలో మంచు తుఫాన్ బీభత్సం.. మంచు గుప్పిట్లో కాలిఫోర్నియా..!
ABN , First Publish Date - 2023-03-04T07:29:31+05:30 IST
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మంచుతో గడ్డకట్టుకుపోయింది.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మంచుతో గడ్డకట్టుకుపోయింది. రోడ్ల మీద, ఇండ్ల పైకప్పుల మీద అడుగుల మేర మంచు పేరుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మంచు కారణంగా నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మంచుతో చాలా చోట్ల ఇండ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. అటు టెక్సాస్, లూసియానాలో కూడా భారీగా మంచు కురుస్తోంది. దాదాపు ఏడు అడుగుల మేర హిమపాతం పేరుకుపోయింది. ఇళ్లు, రోడ్లు, కార్లపై భారీగా మంచు పేరుకుపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టెక్సాస్‌లోనైతే ఏకంగా 3.46లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
రోడ్లన్నీ మంచు గుట్టలను తలపిస్తున్నాయి. దాంతో రవాణా వ్యవస్థకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం, ఇటు రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో జనాలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక మంచు తుఫాన్ కారణంగా వందలకొద్ది విమానాలను అధికారులు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. డాలస్‌లోని ఫోర్ట్‌వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దాదాపు 400 విమాన సర్వీసులను నిలిపి వేశారు. మరోవైపు డాలస్‌ను టోర్నడో తాకే ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్, టెక్సాస్‌లో 145 కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యావసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దని కోరారు.
ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!