NRI: ఇండోనేషియాలో విదేశీయుడి టూర్.. అక్కడ ఎవరూ చేయకూడని పని చేశాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-05-07T16:17:40+05:30 IST
ఇండోనేషియాలో పర్యటనకు వచ్చన ఓ విదేశీయుడు అసె ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పీకలదాకా మద్యం తాడి స్థానికులపై దాడికి దిగాడు. అసెలో షరియా చట్టం అమలవుతోంది. దీంతో, బహిరంగంగా అతడిని 40 కొరడా దెబ్బలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నారై డెస్క్: ఇండోనేషియాలో పర్యటనకు వచ్చన ఓ విదేశీయుడు అసె ప్రాంతానికి వెళ్లాడు. అసె ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అక్కడ షరియా చట్టం అమలవుతుంటుంది. సంప్రదాయిక నియమనిబంధనలు అమల్లో ఉంటాయి. అలాంటి చోట ఎవరూ చేయకూడని పని చేశాడా ఆస్ట్రేలియా వ్యక్తి. చివరకు బహిరంగంగా 40 కొరడా దెబ్బల శిక్ష పడే పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు. అతడికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం నూసా ప్రాంతానికి చెందిన రిస్బీ జోన్స్(23) అసెలోని ఓ హోటల్‌లో దిగాడు. ఆ తరువాత అతడు అకస్మాత్తుగా హోటల్ గదిలోంచి నగ్నంగా బయటకు వచ్చాడు. పెద్దగా అరుస్తూ రోడ్డు మీదకు వచ్చిన అతడు స్థానికంగా ఉన్న జాలర్లపై దాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం ప్రారంభించాడు. అతడి దాడిలో గాయాల పాలైన ఓ వ్యక్తి కాలికి ఏకంగా 50 కుట్లు వేయాల్సి వచ్చింది. ఆ తరువాత నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతడిపై ఇండోనేషియా చట్టాల ప్రకారం కేసులు పెట్టారు.
అసె ప్రాంతంలో షరియా చట్టం అమలవుతుండటంతో అక్కడ మద్యపానం, జూదం, స్వలింగ సంపర్కం, అక్రమసంబంధాలు వంటి వాటిని నేరంగా పరిణిస్తారు. దీంతో, సంప్రదాయిక చట్టాల ప్రకారం అతడిని నడి వీధిలో నిలబెట్టి 40 కొరడా దెబ్బలు కొట్టే అవకాశం ఉంది. అయితే, ఇండోనేషియా చట్టాల ప్రకారం శిక్ష కావాల, లేదా షరియా నిబంధనల ప్రకారం శిక్ష కావాలో నిర్ణయించుకునే అవకాశం రిస్బీకి ఉంది. కాగా, రిస్బీ జైలు పాలవడంపై అతడి కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. రిస్బీ తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నట్టు వెల్లడించారు. ఇక రిస్బీకి ఏ శిక్ష పడనుందో త్వరలో తేలనుంది.