Google: లేఆఫ్స్ తరువాత మిగిలిన గూగుల్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం.. మానసిక స్థైర్యంపై దెబ్బ!
ABN , Publish Date - Dec 15 , 2023 | 09:21 PM
ఇటీవలి గూగుల్ లేఆఫ్స్.. ఉద్యోగులపై ప్రభావం చూపించినట్టు సంస్థలో ఇటీవల జరిగిన ఓ అంతర్గత మీటింగ్‌లో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 12వేల మంది ఉద్యోగుల తొలగింపు..దాదాపు ఏడాది క్రితం గూగుల్‌లో చోటుచేసుకున్న పరిణామం ఇది. గూగుల్ చరిత్రలో ఎన్నడూ చూడని ఘటన. అయితే, ఈ లేఆఫ్స్ (Google Layoffs) ప్రభావం ఉద్యోగులపై పడినట్టు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) కూడా అంగీకరించారని జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!
లేఆఫ్స్ ప్రభావం ఇప్పటికీ గూగుల్‌లో కనిపిస్తోందని ఇటీవల జరిగిన మీటింగ్‌లో కొందరు ఉద్యోగులు పేర్కొన్నారట. కంపెనీ అభివృద్ధి, లాభనష్టాలు, ఉద్యోగుల నైతికస్థైర్యంపై (Employee morale) లేఆఫ్స్ ప్రభావం గురించి ఆ మీటింగ్‌లో చర్చకు వచ్చింది. అయితే, లేఆఫ్స్ ప్రభావం ఉద్యోగులపై ఉందని సుందర్ పిచాయ్ ఆ మీటింగ్‌లో అంగీకరించారని తెలిసింది. కంపెనీ అంతర్గత సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైందని సమచారం.
లేఆఫ్స్‌లో జాబ్ పోయిన వారి వాటా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు ఆరు శాతం ఉంటుందట. అయితే, గూగుల్ తన 25 ఏళ్లలో ఎదుర్కొన్న తీవ్ర సవాలు ఇదేనని పిచాయ్ పేర్కొన్నారు. ‘‘గూగుల్‌లో ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ చూడలేదు’’ అని పిచాయ్ వ్యాఖ్యానించారట. అయితే, భవిష్యత్తులో రాబోయే సమస్యలను నివారించేందుకు ఈ నిర్ణయం తప్పలేదని చెప్పారు. లేఆఫ్స్ చేపట్టకపోయి ఉంటే భవిష్యత్తు సాంకేతికతల అభివృద్ధికి పెట్టుబడులు సాధ్యమయ్యేవి కావని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఉద్యోగుల తొలగింపును మరింత మెరుగైన విధానంలో చేపట్టి ఉండాల్సిందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. తొలగింపులు తప్పనప్పటికీ వాటి ప్రభావంపై మాత్రం సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారట.