Share News

Brian Lara: కోహ్లీ కాదు, హెడ్ కాదు.. తన 400 పరుగుల రికార్డును బ్రేక్ చేసేది ఎవరో చెప్పేసిన లారా

ABN , First Publish Date - 2023-12-06T12:01:59+05:30 IST

బ్రియాన్ లారా. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజుల కొద్దీ బ్యాటింగ్ చేసి వందల కొద్దీ పరుగులు సాధించడం లారాకు బఠాణీలు తిన్నంతా సులువు. 1990లలో, 2000వ దశకం ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో లారా హవా స్పష్టంగా కనిపించింది.

Brian Lara: కోహ్లీ కాదు, హెడ్ కాదు.. తన 400 పరుగుల రికార్డును బ్రేక్ చేసేది ఎవరో చెప్పేసిన లారా

బ్రియాన్ లారా. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజుల కొద్దీ బ్యాటింగ్ చేసి వందల కొద్దీ పరుగులు సాధించడం లారాకు బఠాణీలు తిన్నంతా సులువు. 1990లలో, 2000వ దశకం ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో లారా హవా స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేలకుపైగా పరుగులు సాధించిన లారా ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిపోయాడు. లారా క్రికెట్ నుంచి రిటైర్ అయి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తుంది. అయినప్పటికీ లారా సాధించిన పలు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదంటేనే ఆయన ఏ స్థాయి ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌లో లారా సాధించిన వ్యక్తిగత స్కోర్ 400, 501 పరుగులు ఇప్పటికీ ఎవరూ అందుకోలేకపోయారు. లారా రిటైర్ అయ్యాక ఎంతో మంది గొప్ప బ్యాటర్లు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా కనీసం లారా సాధించిన స్కోర్ల చేరువలోకి కూడా వెళ్లలేకకోయారు. కాగా లారా 1994లో ఇంగ్లండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 501 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే కావడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్‌లో 2004లో ఇంగ్లండ్‌పై లారా 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే. ఈ రెండు రికార్డులను ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.


ఈ తరం ఆటగాళ్లలో లారా సాధించిన ఈ రెండు రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఎవరికి ఉందంటే పలువురు క్రికెట్ విశ్లేషకులు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ వంటి తదితరుల పేర్లు చెబుతున్నారు. ఇదే ప్రశ్న లారాకు కూడా ఎదురైంది. కానీ లారా మాత్రం వీరేవరిని కాకుండా టీమిండియాకు చెందిన ఓ 24 ఏళ్ల బ్యాటర్‌కు తన రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అతను మరెవరో కాదు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్. ఓ క్రీడా పత్రికతో లారా మాట్లాడుతూ ‘‘శుభ్‌మన్ గిల్ నా రెండు రికార్డులను బద్దలు కొట్టగలడు. ఈ కొత్త తరంలో గిల్ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాటర్. రానున్న రోజుల్లో క్రికెట్‌ను శాసించనున్నాడు. అతను చాలా పెద్ద రికార్డులను బద్దలు కొడతాడని నేను నమ్ముతున్నాను. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో గిల్ సెంచరీ చేయలేదు. కానీ అతను ఇప్పటివరకు ఆడిన నాక్స్ చూడండి. అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్‌లో అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. గిల్ కౌంటీ క్రికెట్ ఆడితే నా 501 పరుగుల రికార్డును బ్రేక్ చేయగలడు. అతను కచ్చితంగా నేను సాధించిన 400 పరుగులను దాటగలడు. ప్రస్తుతం క్రికెట్ చాలా మారిపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్. బ్యాటర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ టీ20 లీగ్‌లు ఆడుతున్నారు. ఐపీఎల్ మొత్తం మార్చేసింది. స్కోరింగ్ రేటు పెరిగింది. కాబట్టి మీరు పెద్ద స్కోర్‌లను చూస్తూనే ఉంటారు. శుభ్‌మన్ గిల్ పెద్ద స్కోర్ చేస్తాడు. నా మాటలను గుర్తించుకోండి.’’ అని లారా చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T12:02:08+05:30 IST