AUS vs NZ: వామ్మో ఇది మామూలు ఊచకోత కాదు.. 2 బంతుల్లోనే 21 పరుగులు బాదేశారు!
ABN , First Publish Date - 2023-10-28T13:18:49+05:30 IST
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.
ధర్మశాల: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా కివీస్ పేసర్ మాట్ హెన్రీ వేసిన 3వ ఓవర్లో రెండు బంతుల్లోనే 21 పరుగులు బాదేశారు. ఆ ఓవర్ మొదటి బంతిని వార్నర్ సిక్సు బాదాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. కానీ బౌలింగ్ చేసే సమయంలో హెన్రీ గీత దాటడంతో ఫ్రీ హిట్ రూపంలో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో మరో ఎక్స్‌ట్రా బంతి వేయగా దానిని హెడ్ సిక్సు బాదాడు. కానీ అది కూడా నో బాల్ అయింది. దీంతో హెన్రీ మరో ఎక్స్‌ట్రా బాల్ వేయాల్సి వచ్చింది. దానిని కూడా హెడ్ సిక్సు బాదాడు. హెన్రీ వరుసగా రెండు నో బాల్స్ వేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. అలా ఆ ఓవర్లో మొదటి రెండు బంతుల్లోనే 3 సిక్సులు, ఓ సింగిల్, రెండు ఎక్స్‌ట్రా పరుగులు వచ్చాయి. దీంతో మూడో ఓవర్ మొదటి రెండు బంతులకే 21 పరుగులొచ్చాయి. మిగిలిన 3 బంతుల్లో హెడ్ పరుగులేమి చేయకపోయినప్పటికీ హెన్రీ ఓ వైడ్ వేశాడు. దీంతో ఎక్స్‌ట్రా రూపంలో మరో పరుగు వచ్చింది. అలా ఆ ఓవర్ మొత్తంలో ఏకంగా 22 పరుగులొచ్చాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు. మాట్ హెన్రీ వేసిన మొదటి ఓవర్లో వార్నర్ 2 ఫోర్లు బాదాడు. హెన్రీనే వేసిన మూడో ఓవర్లో వార్నర్ ఓ సిక్సు, హెడ్ రెండు సిక్సులు బాదడంతో ఏకంగా 22 పరుగులొచ్చాయి. బౌల్ట్ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ ఓ ఫోర్, సిక్సు బాదాడు. హెన్రీ వేసిన ఐదో ఓవర్ మొదటి మూడు బంతులను హెడ్ 2 ఫోర్లు, ఓ సిక్సు బాదాడు. దీంతో 4.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. వార్నర్, హెడ్ ధాటికి కివీస్ బౌలర్ హెన్రీ తన మొదటి 3 ఓవర్లలోనే ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు.
ఫెర్గ్యూసన్ వేసిన 7వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సులు, హెడ్ ఓ ఫోర్ బాదడంతో 19 పరుగులొచ్చాయి. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో హెడ్ ఓ ఫోర్, సిక్సు, వార్నర్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోర్ 8.5 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా ఆసీస్ రికార్డు నెలకొల్పింది. అలాగే డేవిడ్ వార్నర్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ట్రావిస్ హెడ్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా హాఫ్ సెంచరీని చేసిన బ్యాటర్‌గా హెడ్ రికార్డు నెలకొల్పాడు. హెడ్, వార్నర్ విధ్వంసంతో ఆస్ట్రేలియా జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవర్‌కు 12 పరుగుల చొప్పున సాధించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి పవర్ ప్లేలో ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. మొదటి 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఏకంగా 10 సిక్సులు బాదడం గమనార్హం. ఆ తర్వాత కూడా హెడ్, వార్నర్ విధ్వసం కొనసాగింది. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 15 ఓవర్లలోనే 150 పరుగులు దాటింది.
అయితే ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 20వ ఓవర్ మొదటి బంతికి స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ విడదీశాడు. 5 ఫోర్లు, 6 సిక్సులతో 65 బంతుల్లోనే 81 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడుతున్న వార్నర్.. బౌలర్ ఫిలిప్స్‌కే స్ట్రెట్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన హెడ్ 59 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ స్కోర్ 23 ఓవర్లలోనే 200కు చేరుకుంది. అనంతరం 24వ ఓవర్లో మరోసారి చెలరేగిన స్పిన్నర్ ఫిలిప్స్ సెంచరీ హీరో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 67 బంతులు ఎదుర్కొన్న హెడ్ 10 ఫోర్లు, 7 సిక్సులతో 109 పరుగులు చేశాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన ఫిలిప్స్ 18 పరుగులు చేసిన స్మిత్‌ను పెవిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత 36 పరుగులు చేసిన షాయిన్ మార్ష్‌ను మరో స్పిన్నర్ శాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 264 పరుగులకు ఆసీస్ 4 వికెట్లు కోల్పోయింది.