World Cup: బుమ్రా, సిరాజ్, రాహుల్‌కు విశ్రాంతి.. తుది జట్టులోకి ఆ నలుగురు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
ABN, First Publish Date - 2023-11-11T12:39:40+05:30
India vs Netherlands: ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇదే ఊపులో నెదర్లాండ్స్‌పై కూడా గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్‌లోకి అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఇప్పటికే జట్టు సెమీస్ చేరడం, పాయింట్ల పట్టికలో కూడా మొదటి స్థానం ఖరారు కావడం, ప్రత్యర్థి చిన్న జట్టే కావడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి.
బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దుమ్ములేపుతున్న టీమిండియా తమ చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన భారత జట్టు అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇదే ఊపులో నెదర్లాండ్స్‌పై కూడా గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్‌లోకి అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఇప్పటికే జట్టు సెమీస్ చేరడం, పాయింట్ల పట్టికలో కూడా మొదటి స్థానం ఖరారు కావడం, ప్రత్యర్థి చిన్న జట్టే కావడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించొచ్చు. అదే జరిగితే టీమిండియా తుది జట్టులో 3 నుంచి నాలుగు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొనసాగనున్నారు. వీరి స్థానాల్లో మార్పులుండకపోవచ్చు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కూడా ఆడే అవకాశాలే ఎక్కువ. మ్యాచ్ జరిగేది బెంగళూరు చిన్నస్వామిమైదానంలో కావడంతో కోహ్లీ కోసమే అభిమానులు స్టేడియానికి వస్తారు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించే కోహ్లీకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సొంత మైదానంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీ కచ్చితంగా బరిలోకి దిగుతాడని చెప్పుకోవచ్చు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఐదో స్థానంలో ఆడే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్థానంలో మార్పు జరిగే అవకాశాలున్నాయి. రాహుల్‌కు విశ్రాంతినిచ్చి యువ వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఓపెనర్ కూడా అయిన ఇషాన్ కిషన్‌ను గిల్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో ఆడించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు కిషన్ టోర్నీలోని తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కొనసాగున్నాడు.
స్పిన్ కోటాలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లో ఒకరికి విశ్రాంతి ఇవొచ్చు. జడేజా ఆల్ రౌండర్ కాబట్టి అతడిని తప్పించే అవకాశాలు ఉండకపోవచ్చు. దీంతో అశ్విన్.. కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఇప్పటివరకు అశ్విన్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రమే ఆడించారు. ఇక పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణను ఆడించొచ్చు. శార్దూల్ ఠాకూర్‌ను ఆరంభంలో రెండు మూడు మ్యాచ్‌లు ఆడించి ఆ తర్వాత బెంచ్‌కు పరిమితం చేశారు. ఇక గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక చివరగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అతడిని తుది జట్టులో కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
టీమిండియా తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్/ప్రసిద్ధ్ కృష్ణ
Updated Date - 2023-11-11T12:44:18+05:30 IST