World Cup: బ్యాటర్లకు పండగే.. భారత్ vs శ్రీలంక మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఇదే!
ABN, First Publish Date - 2023-11-02T13:10:45+05:30
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. గురువారం 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ముంబై: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. గురువారం 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్ల మధ్య 2011 ప్రపంచకప్ ఫైనల్ ఈ మైదానంలోనే జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే రోహిత్ సేన అధికారికంగా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్ దృష్యా ఈ మ్యాచ్‌లో గెలవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తన విజయపరంపర కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు శ్రీలంకకు మాత్రం ఈ మ్యాచ్ చావోరేవో అన్నట్టుగా తయారైంది. ఆ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన శ్రీలంక రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్టు, మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ముందుగా వాంఖడే పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఇది బ్యాటర్లకు అనుకూలం. ఇక్కడ బ్యాటింగ్ ఎప్పుడూ చేసిన మంచి స్కోర్లు చేయొచ్చు. దీనిని బట్టి బ్యాటింగ్ మొదట చేసిన, తర్వాత చేసిన ఇబ్బంది ఉండకపోవచ్చు. వాంఖడే పిచ్‌పై ఇప్పటివరకు 25 వన్డే మ్యాచ్‌లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు, తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 11 సార్లు గెలిచాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఈ పిచ్‌పై ఆడిన మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 399, 382 పరుగులు చేసింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 229, 149 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే పిచ్‌పై 2015లో సౌతాఫ్రికా ఏకంగా 438 పరుగులు చేసింది. గత రికార్డుల ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోర్లు సాధిస్తే లక్ష్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు చేధించిన దాఖలాలు లేవు. దీనిని బట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ సాధిస్తే లక్ష్య చేధన కష్టం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్ దృష్యా మొదట బ్యాటింగ్ చేస్తే సునాయసంగా 300కు పైగా పరుగులు చేసే అవకాశాలున్నాయి. ఇక బౌలింగ్ విషయానికొస్తే పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికీ సహకరిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు బంతి స్వింగ్ అవుతుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు పట్టు దొరుకుతుంది. అయితే బ్యాటర్లు కుదురుకుంటే సునాయసంగా పరుగులు రాబట్టవచ్చు.
ఇక వెదర్ రిపోర్టు విషయానికొస్తే.. ముంబైలో నేడు సాధారణ ఉష్ణోగ్రత ఉండనుంది. మ్యాచ్ ప్రారంభంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. ఆ తర్వాత సాయంత్రం, రాత్రి వేళ్లలో వాతావరణం చల్లబడ్డాక 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండొచ్చు. తేమ 59 శాతంగా ఉండనుంది. మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు.
Updated Date - 2023-11-02T13:47:22+05:30 IST