Share News

Telangana Election: కేసీఆర్ సర్కార్‌కు ఈసీ షాక్..

ABN , First Publish Date - 2023-11-27T10:06:45+05:30 IST

రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించింది. ఫిర్యాదులు రావడంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది.

Telangana Election: కేసీఆర్ సర్కార్‌కు ఈసీ షాక్..

హైదరాబాద్: ఎన్నికల ముందు రైతుబంధు పంపిణీకి అనుమతి దక్కడంతో సద్వినియోగం చేసుకోవచ్చని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నగదు పంపిణీ అనుమతిని ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ప్రయోజనం ఆశించి చివరి వరకూ రైతుబంధును పంపిణీ చేయకుండా వేచిచూసింది. ఈలోగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంది. కాగా ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వడం, విపక్షాలు మండిపడిన విషయాలు తెలిసిందే.

ఎన్నికల షెడ్యూల్‌ను ఉల్లంఘించకుండా ఈ నెల 24 నుంచి రైతు బంధును పంపిణీ చేస్తామంటూ ఈ నెల 18న సీఈసీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇది ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, కొత్తది కానందున అనుమతి ఇవ్వాలని విన్నవించింది. దీంతోపాటు రైతు రుణ మాఫీ, ఉద్యోగుల కరువు భత్యాల (డీఏ) అమలుకు అనుమతించాలని కోరింది. శుక్రవారం రైతు బంధు పంపిణీకి సీఈసీ ఓకే చెప్పింది. రుణ మాఫీ, ఉద్యోగుల డీఏలపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

ఏటా యాసంగి రైతుబంధును నవంబరు, డిసెంబరుల్లోనే పంపిణీ చేస్తున్నారు. ఈ సారి నవంబరు ముగుస్తున్నా, సీజన్‌ ముంచుకొస్తున్నా నగదు సాయంపై స్పష్టత లేకపోవడంతో పెట్టుబడికి ఇబ్బంది తలెత్తుతుందని రైతులు కలత చెందారు. ఈ నేపథ్యంలో సీఈసీ కనికరించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఈ నెల 24 నుంచి రైతుబంధు పంపిణీ చేయొచ్చంటూ అనుమతిచ్చింది. నగదు సాయానికి అనుమతి ఇస్తూనే సీఈసీ షరతులు విధించింది. ఎన్నికల ప్రచారం ముగిశాక పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ నెల 28తో ప్రచార ఘట్టం ముగుస్తుంది. అంటే ఇవాళ మాత్రమే రైతుబంధు పంపిణీకి ప్రభుత్వానికి అనుమతి ఉంది. ఈలోపే రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 29, 30 తేదీల్లో పంపిణీకి అనుమతి లేదని వివరించింది. దీనికి తగినట్లు రైతుబంధును డీబీటీ పద్ధతిలో జమచేస్తామని తెలిపింది. ఎందుకోగానీ డీబీటీ పద్ధతిలో జమ చేస్తామన్న ప్రభుత్వం చేయకుండా తాత్సారం చేసింది. దీంతో ఫిర్యాదులు వెళ్లడం.. అనుమతి నిరాకరించడం చకచకా జరిగిపోయాయి.

Updated Date - 2023-11-27T13:00:13+05:30 IST