సింగిల్ డిజిటా? డబుల్ ధమాకానా?
ABN , First Publish Date - 2023-12-03T03:16:55+05:30 IST
ఎన్నికల ఫలితాలపై బీజేపీలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ సింగిల్ డిజిట్‌కుపరిమితమవుతుందా? హంగ్ వచ్చేలా డబుల్ డిజిట్ సాధిస్తామా?
ఫలితాలపై బీజేపీలో ఉత్కంఠ.. ముగ్గురు ఎంపీల సత్తా తేల్చే ఫలితాలు
రెండంకెలు సాధించి హంగ్‌లో కీలక పాత్ర పోషిస్తామని తొలుత అంచనాలు
క్షేత్రస్థాయి సమాచారం, ఎగ్జిట్‌పోల్స్‌తో పదిలోపే రావచ్చని ప్రస్తుత భావన
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తానన్న ఈటల శపథంపై ఆసక్తి
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై
వెంకట రమణారెడ్డి గెలిస్తే సంచలనం
మిత్రపక్షంగా బరిలో దిగిన జనసేన బోణీ కొట్టేనా?
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలపై బీజేపీలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ సింగిల్ డిజిట్‌కుపరిమితమవుతుందా? హంగ్ వచ్చేలా డబుల్ డిజిట్ సాధిస్తామా? మిత్రపక్షం జనసేన బోణీ కొట్టేనా?.. అన్న దానిపై కమలం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా, గత ఎన్నికలతో పోలిస్తే గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు, సీట్లు సాధిస్తామన్న ధీమా మాత్రం బీజేపీ ముఖ్యనేతల్లో వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈసారి పోలింగ్ అనంతరం, తమకు గట్టి పట్టున్న ప్రాంతాలలో అక్కడి నేతల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని బీజేపీ నాయకత్వం సేకరించింది. 10-15 సీట్లతో తమకు డబుల్ డిజిట్ వస్తుందని తొలుత భావించినా, శనివారం నాటికి పరిస్థితి కొంత గడ్డుగా అనిపించిందని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు. అన్ని సర్వే సంస్థలు కూడా ఇదే తరహా ఫలితాన్ని వెల్లడించాయని ఆయన ఉదహరించారు. అయితే, ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఫలితం తమకు మరిన్ని సీట్లు అందిస్తున్న ఆశాభావంతో ఉన్నామని మరో ముఖ్య నేత చెప్పారు. సర్వేలైనా, ఎగ్జిట్‌పోల్స్ అయినా.. ఒక్కోసారి అంచనాలు తప్పుతాయని, గతంలో కూడా అలా జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
కాగా, బీజేపీ నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలోకి దిగిన నేపథ్యంలో వారిలో ఎవరి సత్తా ఎంత అన్నది కూడా ఆదివారం నాటి ఫలితాలతో తేలుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, బోథ్ నుంచి సోయం బాపూరావు పోటీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్ నుంచి పోటీకి దిగిన నేపథ్యంలో, ఈ రెండు స్థానాల్లో ఫలితం మరింత ఉత్కంఠగా మారిందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. హుజూరాబాద్ నుంచి ఈటల రెండోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడ్డారు. రెండేళ్ల కిందట అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తొలిసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్‌ను కూడా ఈటల ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తాను గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతానని, సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానని దాదాపు ఏడాది కిందటే ఈటల చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో గజ్వేల్ ఫలితం ఈటల ప్రతిష్ఠకు సవాల్‌గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, కామారెడ్డి నుంచి బరిలో దిగిన బీజేపీ సీనియర్ నేత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ వెంకట రమణారెడ్డి తన విజయంపై ధీమాతో ఉన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై విజయం సాధిస్తే జెయింట్ కిల్లర్‌గా ఆయన సంచలనం సృష్టిస్తారు.
8 సీట్లలో జనసేన పోటీ
తమతో పొత్తు పెట్టుకున్న జనసేనకు ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయన్నది కూడా బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో జనసేనకు బీజేపీ 8 నియోజకవర్గాలు కేటాయించిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, వైరా, అశ్వారావుపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం స్థానాల్లో జనసేన అభ్యర్థులకు మద్దతుగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో, జనసేన బోణీ కొడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.