BRS Meeting Nanded: నాందేడ్‌లో నేడే బీఆర్‌ఎస్ సభ
ABN , First Publish Date - 2023-02-05T02:53:47+05:30 IST
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎ్‌సను విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో నేడు (ఆదివారం) బహిరంగ సభ నిర్వహించనున్నారు.
హాజరుకానున్న సీఎం కేసీఆర్
బీఆర్‌ఎస్ చీఫ్‌తో ‘మహా’ నేతల భేటీ
మరో రెండు రాష్ట్రాల వారు కూడా
పార్టీలోకి భారీగా చేరికలు!
హైదరాబాద్/నిర్మల్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ రాజకీయాలే లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎ్‌సను విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో నేడు (ఆదివారం) బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధం చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు.. సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. ఈ సభపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు స్వయంగా ఆయన హాజరు కానుండడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణకు చెందిన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నాందేడ్‌లోనే మకాం వేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారం రోజులుగా అక్కడే ఉంటూ ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎ్‌సఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి ఆయన సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్ల గురించి చర్చించారు. సభకు హాజరవుతున్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశాయాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.
కేసీఆర్‌తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నేతల భేటీ
బీఆర్‌ఎస్ సభ నేపథ్యంలో.. మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో శనివారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. వారిలో.. మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషా ల్ భోప్చే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పసుల సమ్మయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ తదితరులున్నారు. అదేవిధంగా ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, అదే రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్‌సింగ్‌భగత్ తదితరులు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో రైతుబంధు, దళిత బంధు, ఉచితవిద్యుత్తు, వంటి పథకాల అమలు గురించి ఈ సందర్భంగా వారు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు వారు ఆసక్తి చూపినట్లు సమాచారం.
ప్రత్యేక విమానంలో..
ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశం అనంతరం నాందేడ్‌లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడికి చేరుకున్నాక ముందుగా గురుద్వారను సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నట్లు సమాచారం.