Garuda Squad : గగనతలంలో గరుడ దళం!
ABN , First Publish Date - 2023-03-02T03:03:09+05:30 IST
తెలంగాణలోనూ నిఘా అధికారులకు గరుడ దళం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం శత్రుదేశాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు సరిహద్దుల్లో సైన్యంతో పాటు నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాల్లోనే ఈ గరుడ స్క్వాడ్‌ను ఉపయోగిస్తున్నారు.

ప్రముఖుల భద్రత, మావోయిస్టుల కదలికలపై నిఘా
నల్లమల నుంచి డేగ పిల్లలు.. ఐఐటీఏలో శిక్షణ
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోనూ నిఘా అధికారులకు గరుడ దళం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం శత్రుదేశాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు సరిహద్దుల్లో సైన్యంతో పాటు నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాల్లోనే ఈ గరుడ స్క్వాడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇకపై రాష్ట్రంలోనూ ఈ గరుడ దళం అందుబాటులోకి రానుంది. వీవీఐపీలు, వీఐపీల పర్యటనల సమయంలో గగనతలంలో నిషేధిత డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయడంలో డేగలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మావోయిస్టుల కట్టడి చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో వారి కదలికల్ని గుర్తించేందుకు వీలుగా గరుడ దళం సిద్ధమవుతోంది. నిఘా విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో గరుడ స్క్వాడ్‌కు నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. ఐఐటీఏలో ఇప్పటి వరకు పోలీస్ జాగిలాలకు నిందితుల్ని గుర్తించడం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల్ని గుర్తించడం వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కానీ, తొలిసారిగా గరుడ స్క్వాడ్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన డేగలకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిపుణులను నియమించారు. వారికి నెలకు రూ.35 వేలు, రూ.25 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అయితే డేగలకు శిక్షణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిక్షణ ఇచ్చే సమయంలో కొన్ని డేగలు మృతి చెందినట్లు సమాచారం. గరుడ దళానికి అవసరమైన డేగ పిల్లలను అధికారులు నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి సేకరిస్తున్నారు. అకాడమీలో ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని పెంచుతూ శిక్షణ ఇస్తున్నారు.