KCR : కేసీఆర్‌కు తుంటి మార్పిడి
ABN , First Publish Date - 2023-12-09T03:16:18+05:30 IST
బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.

3 గంటలకు పైగా శస్త్రచికిత్స.. విజయవంతం..
6-8 వారాల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
ఫాంహౌస్ బాత్‌రూంలో జారిపడిన కేసీఆర్.. అర్ధరాత్రి వేళ ఘటన
విరిగిన తుంటి ఎముకకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సర్జరీ
కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే.. పరామర్శకు రావొద్దన్న హరీశ్
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా.. మెరుగైన వైద్యానికి ఆదేశం
ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి సూచన
త్వరగా కోలుకోవాలని మోదీ, బాబు సహా ప్రముఖుల ఆకాంక్ష
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జగదేవ్‌పూర్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం మూడు గంటల పాటు సర్జరీ చేశారు. 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని తెలిపారు. గురువారం అర్ధరాత్రి 12 దాటాక సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బాత్ రూంకు వెళ్లి వస్తుండగా అదుపుతప్పి కేసీఆర్ కిందపడ్డారు. అంతకు గంట క్రితం వరకు తనను కలిసేందుకు వచ్చినవారితో మాట్లాడిన కేసీఆర్.. వారంతా వెళ్లాక నిద్రించారు. కొద్దిసేపటికి బాత్ రూంకు వెళ్లి వస్తూ జారిపడ్డారు. ఆయాలు గమనించి పైకి లేపారు. తీవ్ర నొప్పి కలగడంతో గాయమైనట్లుగా గుర్తించారు. గజ్వేల్ నుంచి అంబులెన్స్‌ను రప్పించి హైదరాబాద్ తీసుకెళ్లారు. కాగా, కేసీఆర్ కిందపడిన విషయం తెలిసి మాజీ మంత్రులు, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావు హుటాహుటిన బయల్దేరి మార్గమధ్యంలో కలుసుకున్నారు. అర్ధరాత్రి 2.30 సమయంలో యశోద ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వివిధ విభాగాల వైద్యులు శుక్రవారం కేసీఆర్‌కు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, సీటీ స్కాన్ నిర్వహించారు. ఈ సమయంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తుంటి ఎముక విరగడం తప్ప ఇతర ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో వారందరూ ఊరట చెందారు.
మూడు గంటలపైగా..
కేసీఆర్‌కు తుంటి భాగంలో మల్టిపుల్ ఫ్రాక్చర్ అవడంతో మార్పిడి చేయాలా..? స్టీల్ ప్లేట్ వేసి బిగించాలా..? అని డాక్టర్ ఎంవీ రావు బృందం చర్చించింది. స్కానింగ్ అనంతరం తుంటి మార్పిడికే సిద్ధపడి.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సాయంత్రం 5.10 సమయంలో ఆస్పత్రి నాలుగో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. రాత్రి 8 గంటలకు సర్జరీ పూర్తయింది. ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన తదితర వైద్య బృందం పాల్గొంది. ఆర్థో వైద్యులు డాక్టర్ ప్రవీణ్‌కమార్, డాక్టర్ నితిన్ ఆధ్వర్యంలోని బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది. సర్జరీ అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయనను సాధారణ రూమ్‌కు మార్చామని చెప్పారు. కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్, కుమార్తె కవిత, హరీశ్, ఎంపీ సంతోష్ ఆస్పత్రిలోనే ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
కేసీఆర్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. యశోద ఆస్పత్రిని సందర్శించి మెరుగైన కేసీఆర్ వైద్య సేవలు అందేలా చూడాలని, ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించాలని ఆరోగ్య శాఖ కార్యరద్శి రిజ్వీని ఆదేశించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు సీఎం ఆదేశాలతో రిజ్వీ యశోదా ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి.. అనంతరం సీఎం రేవంత్‌కు వివరించారు.
తరలివచ్చిన నేతలు.. 9వ ఫ్లోర్ కిటకిట
కేసీఆర్‌ను యశోద ఆస్పత్రి 9వ అంతస్తులో అడ్మిట్ చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యేలు జగదీశ్వర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దానం నాగేందర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, మాజీ మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్, శ్రీనివా్‌సగౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజ్ శ్రవ ణ్, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. వీరి కోసం 9వ అంతస్తును కేటాయించారు. కాగా, కేసీఆర్‌కు గాయమైన సంగతి తెలియని పలువురు శుక్రవారం ఆయనను కలిసేందుకు ఫాంహౌ్‌సకు వచ్చారు.
ఆస్పత్రికి ఎవరూ రావొద్దు: హరీశ్
కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, లోపలికి అనుమతి లేనందున బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన్ను చూసేందుకు ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఆస్పత్రికి వస్తే ఇన్ఫెక్షన్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం కోసం ఇంటి వద్ద నుంచే ప్రార్థనలు చేయాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్నవారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
బాధ కలిగించింది: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు. ‘కేసీఆర్ గాయపడ్డారన్న సమాచారం బాధ కలిగించింది. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని బాబు పేర్కొన్నారు. టీడీపీ యువ నేత లోకేశ్ స్పందిస్తూ ‘గాయం నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: మోదీ
కేటీఆర్‌కు జగన్ ఫోన్
కేసీఆర్ గాయపడడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో కేసీఆర్‌కు గాయం కావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేటీఆర్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు గాయమైన విషయం బాధ కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై కోరారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. కేటీఆర్‌కు ఫోన్ చేశారు. కేసీఆర్ గాయం గురించి తెలిసి బాధపడ్డానని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ గాయపడడం బాధాకరమని ఆయన త్వరగా కోలుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.