Hyderbad: బీఆర్‌ఎస్‌లో ఆగని పోరు

ABN , First Publish Date - 2023-04-22T11:40:46+05:30 IST

నువ్వెంత.. అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకున్నారు. వేదికపై వాగ్వాదానికి దిగారు. ఓ చోట మైకు లాక్కుంటే.. మరో చోట నీ అంతు చూస్తా అని బెదిరించుకునే..

Hyderbad: బీఆర్‌ఎస్‌లో ఆగని పోరు

హైదరాబాద్‌: మహానగరంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ముగింపు దశకు చేరింది. ఇప్పటికే డివిజన్ల వారీగా మెజార్టీ సమావేశాలు పూర్తి కాగా.. 25న నియోజకవర్గ స్థాయి సమ్మేళనం నిర్వహణకు నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల మధ్య సహృద్భావ వాతావరణం కల్పించేందుకు నిర్వహించిన సమ్మేళనాలు అగ్ర నేతలు ఊహించిన స్థాయిలో జరగలేదు. పైగా పార్టీలోని విభేదాల బహిర్గతానికి వేదికలయ్యాయి. డివిజన్‌ స్థాయి నాయకులు మాత్రమే కాదు.. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రి, మాజీ ఎమ్మెల్యే వంటి వారూ వేదికలపైనే వాగ్వాదాలకు దిగారు. నువ్వెంత.. అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకున్నారు. వేదికపై వాగ్వాదానికి దిగారు. ఓ చోట మైకు లాక్కుంటే.. మరో చోట నీ అంతు చూస్తా అని బెదిరించుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది.

కొన్ని నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కాలేదు. ఇదీ పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలనిచ్చింది. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో తాజా పరిణామాలు నాయకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి రావడం పక్కన పెడితే.. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఎందుకిలా..? బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఆధిపత్య పోరుకు కారణాలేంటి..? అధిష్టానం ఆశిస్తోన్నట్టుగా అంతా సర్ధుకుంటుందా..? ఇదే పరిస్థితి ఎన్నికల సమయంలోనూ కొనసాగుతుందా..? అలా అయితే ఎవరికి నష్టం..? అన్నది ఆసక్తికరంగా మారింది.

బీజం పడింది అప్పుడే..?

ఫ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడు కార్పొరేటర్లుగా ఉన్న కొందరు తమకు సహరించలేదని పలువురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఓటమి పాలైన సీనియర్‌ నేతలూ ఆగ్రహంతో ఉన్నారు. విజయం సాధించినా.. ఆశించిన మెజార్టీ రాలేదని శాసనసభ్యులు.. తమ ఓటమికి అప్పటి కార్పొరేటర్ల సహాయ నిరాకరణే కారణమని ఓడిపోయిన నేతలు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వేళ శాసనసభ్యులు, అప్పటి కార్పొరేటర్ల మధ్య విభేదాలకు బీజం పడింది. కాలగమనంలో విభేదాలు తగ్గకపోగా.. రోజురోజుకూ నువ్వా..? నేనా..? అన్నట్టుగా మారుతున్నాయి.

2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు, మాజీలుగా మారిన పలువురు కార్పొరేటర్ల మధ్య అంతరం మరింత పెరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు సహకరించక పోవడం వల్లే తాము ఓటమి పాలయ్యామన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, కుత్బుల్లాపుర్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ అసెంబ్లీల పరిధిలో బహిరంగంగా అభిప్రాయం వ్యక్తం చేయకపోయినా.. పార్టీ నేతలు కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

అంతకు ముందు రెండు, మూడు పర్యాయాలు విజయం సాధించిన కొందరు కార్పొరేటర్లూ.. 2021లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తాము గెలిస్తే ఎమ్మెల్యే టికెట్‌కు పోటీగా వస్తామన్న భయంతో శాసనసభ్యులు పనిగట్టుకొని ఓడించారన్న భావనలోనూ కొందరున్నారు.

ప్రస్తుత కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకూ పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కార్పొరేటర్లు శాసనసభ ఎన్నికల్లో టికెట్‌ ఆశించడమే ఇందుకు కారణం. శాసనసభ్యులందరికీ టికెట్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. కొందరు శాసనసభ్యులకు ఏ మూలో అనుమానం ఉంది. నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేత ఉంటే మనకు అవకాశం రాదేమో అన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సొంత పార్టీ కార్పొరేటర్లనూ వైరి వర్గంగా భావిస్తున్నారు. నగరంలోని ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల తీరు ఇలానే ఉంది. శాసనసభ్యులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకూ కార్పొరేటర్లు దూరంగా ఉంటుండడం గమనార్హం.

ఆ నియోజకవర్గాల్లో..

బోడుప్పల్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిలు వేదికపైనే వాగ్వాదానికి దిగారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతుండగా.. మల్లారెడ్డి మైకు లాక్కోవడం చర్చనీయాంశమైంది. అంబర్‌పేట లో ఫూలే జయంతి వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గోల్నాక కార్పొరేటర్‌ లావణ్య భర్త దూసరి శ్రీనివా్‌సగౌడ్‌లు రోడ్డుపైనే సవాళ్లు విసురుకున్నారు. నీ అంతు చూస్తా అని ఎమ్మెల్యే అంటే.. నీ వల్ల ఏం కాదు.. నేనేంటో చూపిస్తా అని శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. బాగ్‌ అంబర్‌పేట, కాచిగూడ మాజీ కార్పొరేటర్లు పద్మావతి డీపీరెడ్డి, ఎక్కాల చైతన్యలు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కాలేదు. ముషీరాబాద్‌లోని పలు డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు మీటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అందరినీ కలుపుకొని పోవడం లేదన్న విమర్శలున్నాయి.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని బోరబండ, ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్ల సమ్మేళనాలు ఇప్పటికీ జరగలేదు. స్థానిక నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో నియోజకవర్గ మీటింగ్‌ నిర్వహించి మమ అనిపించాలని చూస్తున్నారు.

Updated Date - 2023-04-22T11:40:46+05:30 IST