T Congress: కొత్త బాస్ కమింగ్..! ఊపుతెస్తారా?
ABN , First Publish Date - 2023-01-11T11:38:33+05:30 IST
తెలంగాణ (Telangana)కు కొత్తగా నియమితులైన కాంగ్రెస్ (Congress) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే (Manik Rao Thackeray)భాగ్యనగరానికి చేరుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)కు కొత్తగా నియమితులైన కాంగ్రెస్ (Congress) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే (Manik Rao Thackeray)భాగ్యనగరానికి చేరుకున్నారు. ఇన్‌చార్జి హోదాలో తొలిసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా గాంధీభవన్ (Gandhi Bhavan)కు చేరుకుని ముఖ్యనేతలతో వరుసగా సమావేశం కానున్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో వేర్వేరుగా థాక్రే భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. రేపు డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, అధికార ప్రతినిధులతో మాణిక్‌రావు థాక్రే చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రపైనా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమూ ఉందంటున్నారు. రెండు రోజుల పాటు థాక్రే తెలంగాణలో పర్యటించనున్నారు.
ఇటీవల సీనియర్ లీడర్లంతా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఆయన తీరును బహిరంగంగా మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. అనంతరం అధిష్టానం దూతగా దిగ్విజయ్‌సింగ్.. హైదరాబాద్ చేరుకుని ఇక్కడ పరిస్థితులతో మేథోమధనం చేసి హైకమాండ్‌కు రిపోర్టు చేశారు. అనంతరం మాణిక్యం ఠాగూర్‌ను ఇన్‌చార్జిగా తప్పించి మాణిక్‌రావు థాక్రేను నియమించింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి జ్వాలలను కొత్త బాస్ ఎలా చల్లారుస్తారో వేచి చూడాలి.
బీజేపీ బాస్ కూడా దూకుడు..
మరోవైపు బీజేపీ (BJP) రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సాల్ (Sunil Bansal) కూడా అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు. ఆయన కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం కూకట్‌పల్లిలో మాల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు బండి సంజయ్‌తో కలిసి బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ కమిటీలతో సమావేశం కానున్నారు. రేపు మెదక్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బన్సాల్ టూర్ సాగనుంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధ్యక్షులు తెలంగాణలో పర్యటించడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే ఈనెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. పార్టీలన్నీ ఆయా కార్యక్రమాలతో బిజీ అయిపోవడంతో అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల పీవర్ వచ్చేసినట్లుగా కనబడుతోంది. ఆయా పార్టీల శ్రేణుల్లో ఎన్నికల జోష్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పార్టీలు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది.