టీటీడీ శ్రీవారి ఆలయానికి తొలిఅడుగు
ABN , First Publish Date - 2023-05-22T00:19:57+05:30 IST
కరీంనగర్‌లో కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.

కరీంనగర్ టౌన్, మే 21: కరీంనగర్‌లో కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మిథున లగ్నంలో భూకర్షణం చేసి పనులకు అంకురార్పణ చేయడంతో ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడనున్నది. ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు, ఆగమ శాస్త్ర నిపుణుడు మోహనరంగా, టీటీడీ ఈఈ నర్సింహమూర్తి పద్మనగర్‌లో ఆలయాన్ని నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించి చేసి ఆలయ నిర్మాణ పనులకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ ప్రతి రాష్ట్ర రాజధానిలో ఒక ఆలయాన్ని నిర్మిస్తోందని, తెలంగాణలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే బ్రహ్మాండంగా వెంకన్న ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలో రెండో ఆలయాన్ని కరీంనగర్‌లో నిర్మించాలని కోరడంతో టీటీడీ పాలకవర్గం అంగీకరించిందన్నారు. ఇందుకు 20 కోట్ల రూపాయలు కేటాయించి స్వామివారి ఆలయ నిర్మాణ బాధ్యతలను తిరువల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులుకు, ఆగమశాస్త్ర నిపుణులు మోహనరంగాకు అప్పగించారని చెప్పారు. వారితోపాటు ఈఈ, ఇతర అధికారులు ఆలయం నిర్మించే స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. ఏడాదిన్నరలోపు శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తిరుమల తరహాలో నిర్మించి గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు. సోమవారం భూకర్షణంతో ఆలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేస్తామని చెప్పారు. ఈ నెల 31న ఉదయం ఆరు గంటలకు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల నుంచి మూడు ఏనుగులను తెప్పించి నగరంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనని అన్నారు. దేవదేవుడి ఆలయ నిర్మాణంలో పాల్గొనే అవకాశం స్వామివారి ఆశీస్సులతోనే వచ్చిందని, ఇది అదృష్టంగా భావించి ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని, ఎంపీ బండి సంజయ్‌కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో సహా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తరహాలో తమిళనాడు నుంచి తెప్పించిన రాయితోనే నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిటిడి ఈఈ నర్సింహమూర్తి, మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఆగమశాస్త్రపండితుడు నమిలికొండ రమణాచార్యులు, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధలు, నాయకులు పాల్గొన్నారు.
- స్వామి వారి అనుగ్రహంతో ఆలయ నిర్మాణం
- టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు
కలియుగంలో భక్తులను రక్షించేందుకే స్వామివారు తిరుమలలో వెలిశారు. స్వామివారి అనుగ్రహంతోనే కరీంనగర్‌లో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఖాసన ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్మించే ఆలయ నిర్మాణ పనులకు ఈనెల 31న ఉదయం 6 గంటలకు ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాం. ఇదే రోజు సాయంత్రం శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ తరహాలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం. సోమవారం ఉదయం భూకర్షణం చేసి పనులకు అంకురార్పణ చేస్తాం. తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఎలాంటి పూజలు, కైంకర్యాలు, సేవలు నిర్వహిస్తారో అదే తరహాలో కరీంనగర్ ఆలయంలోనూ చేపట్టనున్నాం.