కరెంట్‌ కట్‌.. కట..

ABN , First Publish Date - 2023-05-12T00:41:27+05:30 IST

అసలే వేసవి కాలం.. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమల బెడద. ఈ క్రమంలో కరెంట్‌ లేకపోతే క్షణం ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలోనే అధికలోడ్‌తో ఢమాల్‌ అంటున్న ట్రాన్స్‌ఫార్మర్లు, అప్రకటిత కోతలతో జనం అల్లాడుతున్నారు.

కరెంట్‌ కట్‌.. కట..
ఖమ్మంలో రాత్రి 12గంటలకు కరెంట్‌ లేక పోవటంతో చిన్నారితో తల్లిదండ్రుల అవస్థలు

ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమల బెడద

పల్లెల నుంచి పట్టణాల వరకు పెరిగిన విద్యుత వాడకం

1.50మిలియన యూనిట్స్‌ అధిక లోడ్‌తో ట్రాన్సఫార్మర్లు ఢమాల్‌

అప్రకటిత కోతలతో వినియోగదారుల ఇబ్బందులు

ఖమ్మం సంక్షేమ విభాగం, మే 11 : అసలే వేసవి కాలం.. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమల బెడద. ఈ క్రమంలో కరెంట్‌ లేకపోతే క్షణం ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలోనే అధికలోడ్‌తో ఢమాల్‌ అంటున్న ట్రాన్స్‌ఫార్మర్లు, అప్రకటిత కోతలతో జనం అల్లాడుతున్నారు. అయితే అకాల వర్షాలు పడుతున్నా.. కాసేపటికి భానుడు భగ్గుమంటుండటం.. వాతావరణంలో విపరీతంగా వస్తున్న మార్పులతో ఉక్కపోత తీవ్రంగా ఉంటోంది. దాంతో ఉపశమనం పొందేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలు ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండటంతో పల్లెల నుంచి పట్టణాల వరకు విద్యుత వాడకం విపరీతంగా పెరిగింది. ఆభారం ట్రాన్సఫార్మర్లపై పడి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఫలితంగా గంటల తరబడి అప్రకటిత కోతలు ఏర్పడుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 25కేవీ విద్యుత సామర్థ్యం కలిగిన ట్రాన్సఫార్మర్‌ నుంచి 80శాతం మేరకు మాత్రమే విద్యుత వినియోగం జరగాల్సి ఉంటుంది. అంతకు మించిన విద్యుత వినియోగం జరిగితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. మూడు రోజులుగా రోజుకు 1.50మిలియన యూనిట్ల విద్యుత వాడకం జరుగుతుండటంతో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ట్రాన్సఫార్మర్ల ఫ్యూజులు కాలుతున్నాయి.

పెరిగిన విద్యుత వినియోగం

ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన, ఖమ్మంరూరల్‌, వైరా, సత్తుపల్లి విద్యుత డివిజన్ల వారీగా విద్యుత పంపిణీ జరుగుతోంది. అత్యధిక విద్యుత వినియోగం ఖమ్మం టౌన 1.55 మిలియన యూనిట్స్‌, ఖమ్మంరూరల్‌ 1.20, సత్తుపల్లి డివిజన్లో 0.98 మిలియన్‌ యూనిట్లు ఉంటుంది. తర్వాత వైరా డివిజనలో 0.61 విద్యుత వినియోగంతో జిల్లా వ్యాప్తంగా రోజుకు 4.34 మిలియన యూనిట్ల విద్యుత పంపిణీ లక్ష్యం జరుగుతోంది. మే నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులు, ఉక్కపోత కారణంగా పదిరోజుల్లో మూడు రోజుల్లోనే గణనీయంగా విద్యుత వాడకం పెరిగింది. మే 1న 3.140 మిలియన యూనిట్ల విద్యుత వినియోగం కాగా మే 8న 4.391 మిలియన యూనిట్లు, మే9న 4.793, మే 10న 4.840 మిలియన యూనిట్ల విద్యుత వినియోగం జరిగింది.

విద్యుత ఇబ్బందులు లేవు

సురేందర్‌, ఎస్‌ఈ, టీఎ్‌సఎనపీడీసీఎల్‌, ఖమ్మం జిల్లా

ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత వాడకం తగ్గగా.. వేసవి కావడంతో గృహ విద్యుత వినియోగం పెరిగింది. డిమాండ్‌ మేరకు గ్రిడ్‌ నుంచి విద్యుత పంపిణీ జరుగుతోంది. మూడు రోజులుగా విద్యుత వినియోగం పెరగడంతో సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఆకస్మికంగా జరిగే విద్యుత ఇబ్బందులను తొలగిస్తున్నాం.

Updated Date - 2023-05-12T00:41:27+05:30 IST