మళ్లీ అలిగిన కోమటిరెడ్డి!
ABN , First Publish Date - 2023-09-07T03:26:36+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోమారు పార్టీపై అలకబూనారు. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ఎన్నికల కమిటీ, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన స్ర్కీనింగ్ కమిటీల్లో చోటు దక్కకపోవడంతో మనస్తాపం చెందారు. ఏకంగా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది.

సీడబ్ల్యూసీ, ఎన్నికల కమిటీల్లో చోటు.. దక్కనందుకు వెంకట్‌రెడ్డి మనస్తాపం
రాజీనామాకూ సిద్ధపడ్డ భువనగిరి ఎంపీ
ఠాక్రే, సంపత్‌కుమార్ సంప్రదింపులు
ఫోన్‌లో మాట్లాడిన కేసీ వేణుగోపాల్
తాను వచ్చి మాట్లాడతానని హామీ
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోమారు పార్టీపై అలకబూనారు. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ఎన్నికల కమిటీ, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన స్ర్కీనింగ్ కమిటీల్లో చోటు దక్కకపోవడంతో మనస్తాపం చెందారు. ఏకంగా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అధిష్ఠానం అప్రమత్తమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్.. కోమటిరెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సంపత్‌కుమార్ ఫోన్ చేసి.. వెంకట్‌రెడ్డితో మాట్లాడించారు. వాస్తవానికి గతంలోనే టీపీసీసీ అధ్యక్ష నియామకం మొదలుకొని అనేక అంశాల్లో అధిష్ఠానంపై, రాష్ట్ర నాయకత్వంపై కోమటిరెడ్డి పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. ఆ తర్వాత పార్టీకి దగ్గరై కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వెంకట్‌రెడ్డి.. సీడబ్ల్యూసీలో చోటు దక్కుతుందని ఆశించారు. అయితే తెలంగాణ నుంచి దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డిలకు సీడబ్ల్యూసీలో అధిష్ఠానం చోటు కల్పించింది. రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అధిష్ఠానం ఏర్పాటు చేసిన స్ర్కీనింగ్ కమిటీలోనూ రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు చోటు దక్కింది. తాజాగా ఏఐసీసీ ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఉత్తమ్‌కు స్థానం కల్పించారు. కానీ, కోమటిరెడ్డికి మాత్రం పార్టీ పరంగా టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ హోదా తప్ప.. మరో ప్రాధాన్య పదవి ఏదీ లేకుండా పోయింది. దీంతో గాంధీభవన్‌లో కార్యక్రమాలకు వెంకట్‌రెడ్డి మళ్లీ దూరమయ్యారు.
సమావేశాలకు గైర్హాజరు..
వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ప్రాథమిక వడపోత కోసం ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) రెండు సార్లు భేటీ అయినా.. ఆ సమావేశాలకు కోమటిరెడ్డి హాజరు కాలేదు. పీఈసీ సభ్యులతో స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ నిర్వహించిన ముఖాముఖి సమావేశానికీ దూరంగానే ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీలోనూ తనకు చోటు దక్కకపోవడంపై ఠాక్రే, సంపత్‌కుమార్‌తో భేటీ సందర్భంగా వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఓటమి చవిచూసిన సంపత్‌కుమార్‌కు సీడబూ్ల్యుసీలో చోటు కల్పించి, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్టీకి సేవలందించిన తనను పక్కన పెట్టారంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన వేణుగోపాల్.. హైదరాబాద్‌లో కలిసి మాట్లాడతానని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది. కాగా.. కోమటిరెడ్డి అలకపై ఠాక్రే స్పందిస్తూ ఆయనేమీ అసంతృప్తిగా లేరని అన్నారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడని, ఆయన ఏమీ అలక బూనలేదని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.