జోగుళాంబ దేవి నిజరూప దర్శనం

ABN , First Publish Date - 2023-01-26T23:06:34+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ఐదో శక్తి పీఠం జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

జోగుళాంబ దేవి నిజరూప దర్శనం
నిజరూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు

మూడు వేలకుపైగా కలశాలతో అమ్మవారికి అభిషేకం

ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు

అలంపూరు, జనవరి 26: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ఐదో శక్తి పీఠం జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. 3,000లకు పైగా కలశాలతో అమ్మవారి మూలవిరాట్‌కు భక్తులతో అభిషేకాలు చేయించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి అపబృత స్నపనం, పంచామృతాభిషేకం నిర్వహించారు. జోగుళాంబ సేవాసమితి గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు బండారు వెంకన్న బాబు కుటుంబ సమేతంగా అమ్మవారి కోసం పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం కట్టెల పేటలో బోరింగు శీను ఇంటి నుంచి పెద్ద బోనంతో అమ్మవారి విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి నిజరూప దర్శనంలో భాగంగా ముందుగా జోగుళాంబ ఆలయంలోని ధ్వజ మండపం దగ్గర సహస్ర ఘట్టాలను ఏర్పాటు చేశారు. వాటిలో మంగళ ద్రవ్యాలతో పాటు అమృత జలాన్ని నింపారు. అనంతరం పూజలు చేశారు. అమ్మవారిని స్మరిస్తూ, కలశాలతో గర్భాలయం వద్దకు చేరుకుని అర్చకులకు అందించారు. ఆ పుణ్య జలాలతో అమ్మవారి దివ్యమంగళ విగ్రహానికి అభిషేకం చేశారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు.

ఇదీ నిజరూప దర్శనం

సాధారణ రోజుల్లో అమ్మవారికి జరిగే అభిషేక కార్యక్రమాలను భక్తులు వీక్షించే అవకాశం ఉండదు. స్వర్ణాభరణాల అలంకరణతో ఉన్న అమ్మవారిని మాత్రమే దర్శించుకుంటారు. అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా వసంత పంచమి ఒక్కరోజు మాత్రమే ఎలాంటి అలంకరణ లేకుండా అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. దీనినే నిజరూప దర్శనంగా పిలుస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారిని వేడుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం.

ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు

అమ్మవారి నిజరూప దర్శనానికి ముందు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం, మునిసిపల్‌ చైర్మెన్‌ మనోరమ ఆలయాల్లో పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన కలశాలను తీసుకుని నిజరూప దర్శనానికి అందజేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య దంపతులు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, నాయకులు బంగి లక్ష్మణ్‌ పూజల్లో పాల్గొన్నారు. గద్వాల జిల్లా జడ్జి కనకదుర్గ, అలంపూరు జడ్జి కమాలాపురం కవిత, మహబూబ్‌ నగర్‌ జడ్జి గంట కవిత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-01-26T23:06:35+05:30 IST