సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
ABN , First Publish Date - 2023-04-26T00:39:15+05:30 IST
తెలంగాణలో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి రైతు పక్షపాతిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు.

- రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట
- ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
- రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- ఘనంగా పార్టీ ప్లీనరీ సమావేశం
గద్వాల టౌన్, ఏప్రిల్ 25 : తెలంగాణలో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి రైతు పక్షపాతిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని ఒక ప్రైవేటు పంక్షన్ హాల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశానికి రవీందర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రం లో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్న కేసీఆర్ పాలన దేశ ప్రజలను తెలంగాణవైపు చూసేలా చేసిందన్నారు. అట్టడుగు వర్గాలకు విద్యనందిచేందుకు గురుకులాల ఏర్పాటు మొదలుకుని, మెడికల్ కళాశాలల వరకు అభివృద్ధి ప్రస్థానం సాగిందన్నారు. కడుపులో ఉండే బిడ్డ కోసం అందించే న్యూట్రిషియన్ కిట్లు మొదలుకొని కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌తో చేయూతనిచ్చే సంక్షేమ పథకాల సమర్థ అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా, అభివృద్ధికి ఆర్థిక చేయూతనివ్వకుండా అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. సంఘ్ పరివార్ శక్తులతో కలిసి సోషల్ మీడియా వేదికగా విద్వేష విషం చిమ్ముతూ తెలంగాణలో అధికారం కోసం అడ్డదారుల్లో పనిచేస్తున్న బీజేపీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే మతోన్మాదుల విషవలయంలో చిక్కుకోకుండా పార్టీ శ్రేణులు ప్రజలను చైతన్యం చేసేందుకు నిబద్ధతతో కృషి కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.
మతోన్మాదుల ఆటలు సాగవు
మత సామరస్యానికి, చైతన్యానికి ప్రతీకగా ఉండే తెలంగాణ సమాజంలో మతోన్మాదుల ఆటలు సాగవని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా సీఎం కేసీఆర్ స్ఫూర్తివంతమైన నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకుంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2022 వరకు నియోజకవర్గంలో సాగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు దక్కిన ప్రయోజనం, పల్లె, పట్టణ ప్రగతి పథకాల ద్వారా అమలు చేసిన పనుల గురించి ఎమ్మెల్యే వివరించారు. ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై దర్యాప్తు సంస్థల వేధింపులు తప్ప బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. సమావేశంలో తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ తల్లి, అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, ఆచార్య జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళి అర్పించారు. ప్లీనరీలో తెలంగాణ వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జంబు రామన్‌గౌడ, పచ్చర్ల శ్రీధర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, పద్మ, బాసుశ్యామల, సరోజనమ్మ, ఎంపీపీలు మనోరమ, నజీమున్సీసా బేగం, ప్రతాప్ గౌడ్, విజయ్, రాజారెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు, వైస్ ఎంపీపీలు పాల్గొన్నారు. ప్లీనరీకి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.