దొరల రాజ్యం వద్దు
ABN , First Publish Date - 2023-06-27T22:41:28+05:30 IST
దొరల రాజ్యం మనకొద్దని, బహుజన రాజ్యాధికారంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
రేవల్లి/పెద్దమందడి/, జూన్ 27: దొరల రాజ్యం మనకొద్దని, బహుజన రాజ్యాధికారంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన సమాజ్ పార్టీ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం వనపర్తి జిల్లా రేవల్లి, గోపాల్‌పేట, పెద్దమందడి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బీఎస్పీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాల పేరుతో రూ.300 కోట్లను దోచుకున్నారని, ఆ ఉత్సవాలతో నిరుపేదలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రానున్న మూడు నెలల కాలంలో దొరికిన వారికి దొరికినంత దోచుకునేలా అలీబాబా 40 దొంగల కథ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటుందని ఆరోపిం చారు. బహుజన రాజ్యాధికారం వస్తే దోచుకున్నదంతా బయటకు తీసి, ప్రతీ నిరుపేద కుటుంబానికి అందజేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడగట్టుకున్న సొమ్మును మహారాష్ట్రకు తీసుకెళ్తు న్నారని అన్నారు. ఏదులలో మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి తన ఫామ్ హౌస్ కోసం బుద్దారం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రామ చెరువు కట్ట ఎత్తు పెంచి, రైతుల 300 ఎకరాలను ముంచి ఫామ్ హౌస్ నుంచి మంత్రి బోటింగ్ చేయడానికి చేస్తున్న పనులు సీఎంకు కనిపిస్త లేవా? అని ప్రశ్నించారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి నాగమోని చెన్న రాములు ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు ఘణపురం కృష్ణయ్య, గట్టు, మన్యం, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్, నాయకులు పాల్గొన్నారు.