Share News

రూ. లక్షకు రూ. ఐదు లక్షలు!

ABN , First Publish Date - 2023-12-01T22:34:55+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. ఒక వైపు అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఈనెల మూడున జరుగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి.

రూ. లక్షకు రూ. ఐదు లక్షలు!

- తారస్థాయికి చేరిన బెట్టింగులు

- స్థానికులతో పాటు సీమవాసుల ఆసక్తి

- గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ

- రూ.30 కోట్లకు చేరిన పందేలు

గద్వాల క్రైం, డిసెంబరు 1 : శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. ఒక వైపు అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఈనెల మూడున జరుగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లను తలదన్నేలా పందేలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధానంగా మల్దకల్‌, ధరూర్‌, గద్వాల, అయిజ, అలంపూర్‌ మండలాల్లో శుక్రవారం బెట్టింగులు తార స్థాయికి చేరాయి. మా అభ్యర్ధి గెలుస్తాడంటే, మా అభ్యర్ధి గెలుస్తాడనే కోణంలో లక్షలకు లక్షలు పెట్టి పందేలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒక్క జిల్లా కేంద్రంలోనే దాదాపు రూ.10 కోట్ల దాకా బెట్టింగ్‌లు వేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ బెట్టింగులలో జిల్లా వాసులతో పాటు రాయలసీమ వాసులు కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది.

జిల్లా కేంద్రంలోనే రూ.10 కోట్లు!

పోలింగ్‌కు ముందు రోజు వరకు ఒకటికి రెండు రెట్లుగా సాగిన బెట్టింగ్‌ దందా ఇప్పుడు రెట్టింపు అయినట్లు సమాచారం. ఏకంగా ఒకటికి ఐదు రెట్లు కావడంతో బెట్టింగ్‌లపై ఆసక్తి నెలకొన్నది. ఒక్క జిల్లా కేంద్రంలోనే రూ. 10 కోట్లకు పైగా బెట్టింగ్‌లు కాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. జిల్లా వాసులతో పాటు రాయలసీమకు చెందిన వారు కూడా జోరుగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బెట్టింగులు రూ. 30 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

నాలుగు మండలాలపైనే అందరి దృష్టి

జోగుళాంబ గద్వాల జిల్లాలో మల్దకల్‌, ధరూర్‌, గట్టు, కటీదొడ్డి మండలాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయన్న అంశంపైనే ఎక్కువ మంది బెట్టింగులు కాసినట్లు తెలిసింది. వాస్తవంగా గెలుపోటములు గద్వాల పట్టణ ఓట్లపై ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పోలింగ్‌కు ఒకరోజు ముందే గద్వాల పట్టణ ఓటర్లలో ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఆ నాలుగు మండలాలపై ఉన్నది. ముఖ్యంగా మల్దకల్‌, ధరూర్‌ మండలాల నుంచి ఒక పార్టీకి, గట్టు, కేటీదొడ్డి మండలాల నుంచి మరో పార్టికి ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. దీంతో బెట్టింగ్‌ రాయుళ్ల దృష్టి ఈ నాలుగు మండలాలపైనే కేంద్రీకృతమై ఉన్నట్ల చర్చ జరుగుతోంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎవరి ఏ పార్టీపై బెట్టింగ్‌ కాసినా, ఆదివారం ఓట్ల లెక్కింపు అనంతరం ఎవరు సంబుర పడతారు.. ఎవరు ఆవేదనలో మునిగిపోతారో తేలనున్నది. అంత వరకు అందరమూ వేచి చూడవలసిందే...

Updated Date - 2023-12-01T22:34:57+05:30 IST