సిద్దిపేటకు హరిత‘నిధి’

ABN , First Publish Date - 2023-02-14T23:48:31+05:30 IST

ఇప్పటికే హరితహారం పేరిట జిల్లావ్యాప్తంగా అన్నిగ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో, వ్యవసాయ భూముల వద్ద మొక్కల పెంపకం చేపడుతున్నారు.

సిద్దిపేటకు హరిత‘నిధి’
మర్పడగ శివారులోని అర్భన్‌ ఫారెస్టు

50 లక్షల మొక్కల సామర్థ్యంతో సెంట్రల్‌ నర్సరీ

మూడేళ్ల పేరిట రూ.5.85 కోట్లు కేటాయింపు

మర్పడగ శివారు అర్భన్‌ ఫారెస్టు ఎంపిక

ఇకపై అందుబాటులో అన్నిరకాల మొక్కలు

మంత్రి హరీశ్‌ కృషితో జిల్లాకు ప్రయోజనం

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 14: ఇప్పటికే హరితహారం పేరిట జిల్లావ్యాప్తంగా అన్నిగ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో, వ్యవసాయ భూముల వద్ద మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఒక్కోసారి మొక్కలు లేక హరితహారం పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఈ లోటు ను అధిగమించడానికి మంత్రి హరీశ్‌రావు కృషితో ఇటీవల సిద్దిపేట జిల్లాకు హరితనిధి మంజూరైంది. ఇక నుంచి నిరంతరం అన్నిరకాల మొక్కలు అందుబాటులో ఉండేవిధంగా ఈ హరితనిధిని సిద్ధం చేయనున్నారు.

సిద్దిపేట జిల్లాలోని 19 మండలాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. మొత్తంగా 26,041 హెక్టార్లలో భౌగోళిక జిల్లాపరంగా 7.32శాతం అటవీ విస్తీర్ణం ఉంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ ఏరియాల్లోని అడవులను 75 బ్లాకులుగా విభజించి పర్యవేక్షిస్తున్నారు. అడవుల విస్తీర్ణంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో కూడా మొక్కల పెంపకాన్ని విరివిగా చేపడుతున్నారు. ప్రతిఏడాది 50 లక్షలకు పైచిలుకు మొక్కలు నాటుతూనే ఉన్నారు.

మొక్కల లోటును పూడ్చడానికే

హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న క్రమంలో పలుమార్లు లోటు కనిపిస్తున్నది. మొక్కలు లేకపోవడంతో హరితహారం లక్ష్యానికి ఆటంకాలు తప్పడం లేదు. ఈ సమయాల్లో ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లోని మొక్కలు కూడా ఒకే సీజన్‌కు పనికొస్తున్నాయి. అందుకే ఈ పరిస్థితులను అధిగమించడానికి హరితనిధికి శ్రీకారం చుట్టారు. కొండపాక మండలం మర్పడగలోని అర్భన్‌ ఫారెస్టులో దాదాపు 20 హెక్టార్ల స్థలాన్ని ఇందుకు కేటాయించారు. ఈ స్థలంలో 50 లక్షల మొక్కల సామర్థ్యంతో సెంట్రల్‌ నర్సరీ నిర్మించాలని తలపెట్టారు. ఈ ఏడాది 5 లక్షల మొక్కలతో ప్రారంభమై మూడేళ్లలో లక్ష్యాన్ని చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం యూకలిప్టస్‌ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వగా రాబోయే రోజుల్లో ఇతర మొక్కలపై దృష్టి సారించనున్నారు.

ఆకట్టుకునేలా సెంట్రల్‌ నర్సరీ

సెంట్రల్‌ నర్సరీ ఏర్పాటుకు హరితనిధి ద్వారా రూ.5.85కోట్లు కేటాయించనున్నారు. ఇందుకోసం 20 హెక్టార్లు అంటే దాదాపు 50 ఎకరాల స్థలాన్ని గుర్తించగా అందులో పాలీ గ్రీన్‌హౌస్‌, మిస్ట్‌ చాంబర్‌, హర్డెనింగ్‌ చాంబర్‌, కంపోస్ట్‌ షెడ్‌, రూట్‌ ట్రెయినర్లు, సీడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, ఓవర్‌ హెడ్‌ట్యాంకులు, బోర్లు, స్టోర్‌ రూం, వాచ్‌మన్‌ షెడ్‌, వాటర్‌ గ్రిడ్‌ పైపులైన్‌ మెయిన్‌, కోకో హస్క్‌ ప్లాట్‌ఫాం, నర్సరీ చుట్టూరా చైన్‌లింక్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి రూ.1.51 కోట్లు, 2023-24 సంవత్సరానికి రూ.1.18. కోట్లు, 2024-25 సంవత్సరానికి రూ.3.14 కోట్లు అంచనా వేశారు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఉన్న అర్భన్‌ ఫారెస్టు పార్కు ఈ నిర్మాణాలతో మరింత వన్నె తెచ్చుకోనున్నది. ఈ 50 ఎకరాల స్థలంలో మియావాకీ చెట్ల విధానంతో పాటు అన్ని రకాల పండ్లు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను పెంచనున్నారు.

వచ్చే వానాకాలం వరకు 5 లక్షలు మొక్కలు సిద్ధం

మొక్కల పెంపకంపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపిస్తుంటారు. తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో ఒకేరోజు లక్ష మొక్కలు నాటించి రికార్డు సృష్టించారు. సిద్దిపేటలోనూ ఏకకాలంలో లక్షకు పైగా మొక్కలు నాటించేలా చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఎటుచూసినా పచ్చని మొక్కలు ఉన్నాయంటే అందుకు హరీశ్‌రావు కృషే. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఎవెన్యూ ప్లాంటేషన్‌, ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతివనం, వననర్సరీలను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం హరితనిధితో 50 లక్షల మొక్కలను అందుబాటులో ఉంచేవిధంగా సెంట్రల్‌ నర్సరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టేలా ఆదేశించారు. వచ్చే వానాకాలం వరకు 5లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-02-14T23:48:32+05:30 IST