సెన్సార్‌తో సాగునీరు
ABN , First Publish Date - 2023-04-15T00:15:24+05:30 IST
అన్ని రంగాలకు టెక్నాలజీని జోడిస్తున్న ఈ రోజుల్లో సాగునీటి రంగంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హెడ్ రెగ్యులేటరీ, డిస్ర్టిబ్యూటరీ, కాలువలుకు ఇకనుంచి సెన్సార్ విధానం ద్వారా ఆటోమెషీన్ లింక్ చేస్తున్నారు.

హెడ్ రెగ్యులేటరీలు, కాలువలకు ఆటోమెషీన్ లింక్
నూతన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీతో పొలాలకు నీటి సరఫరా
నీటి దుర్వినియోగానికి ఇక చెక్
పైలట్ ప్రాజెక్టుగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ ఎంపిక
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్ 14 : అన్ని రంగాలకు టెక్నాలజీని జోడిస్తున్న ఈ రోజుల్లో సాగునీటి రంగంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిల్వ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. మానవ ప్రమేయం లేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా నీటిని విడుదల చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాలోని చంద్లాపూర్‌లో గల రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ రిజర్వాయర్‌కు ఆటోమెషీన్ లింక్ పూర్తికాగానే మిగతా రిజర్వాయర్లకూ అమలు చేయనున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లను నిర్మించారు. గౌరవెల్లి మినహా మిగతా అన్ని రిజర్వాయర్లకు గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రధాన కాలువలు, మైనర్ కాలువలు, ఓటీల ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యాముల్లోకి.. అక్కడి నుంచి పొలాలకు నీటి విడుదలను చేపట్టారు. గోదావరి జలాలతో భూగర్భజలాలు వృద్ధి చెందడం.. ఫలితంగా బోర్లు, బావుల్లో నీటి ఊట పెరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా సబ్ మైనర్ కాలువల నిర్మాణ పనులు పూర్తయితే నేరుగా పొలాలకే నీరందుతుంది.
ఆటోమెషీన్ అనుసంధానం
3 టీఎంసీల సామర్థ్యం కలిగిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ ఎడమ కాలువకు సంబంధించి 9 డిస్ర్టిబ్యూటరీలు, 132 మైనర్ కాలువలు, ఓటీలు ఉండగా కుడి కాలువ పరిధిలో 11 డిస్ర్టిబ్యూటరీలు, 119 మైనర్ కాలువలు, ఓటీలు ఉన్నాయి. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 4 చొప్పున హెడ్ రెగ్యులేటరీలు ఉన్నాయి. కాగా ఈ హెడ్ రెగ్యులేటరీల నుంచే రిజర్వాయర్ కాలువల్లోకి నీటి విడుదల జరుగుతుంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ సిబ్బందే యంత్రాల ద్వారా గేట్లు ఎత్తి నీటిని కాలువల్లోకి తరలిస్తున్నారు. దీని వల్ల అవసరానికి మించి నీటి విడుదల జరిగి దుర్వినియోగమవుతున్నాయి. ఏ కాలువకు ఎన్ని నీళ్లను పంపిస్తున్నారో లెక్క తేలడం లేదు. అంతేగాకుండా కొన్ని కాలువలకు ఎక్కువగా, మరికొన్ని కాలువలకు తక్కువగా సాగునీరు సరఫరా అవుతోంది. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కడానికే నూతన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని ఆచరణలోకి తెచ్చారు. హెడ్ రెగ్యులేటరీ, డిస్ర్టిబ్యూటరీ, కాలువలు, ఓటీలకు ఇకనుంచి సెన్సార్ విధానం ద్వారా ఆటోమెషీన్ లింక్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతం అనుసంధానం చేశారు.
పంటల ఆధారంగా నీటి విడుదల
రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా లబ్ధి జరిగే గ్రామాలకు సంబంధించి ఏయే పంటలు వేశారు.. ఎంత సాగునీరు అవసరం.. అనే వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. ఈ లెక్క ప్రకారం ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కాలువలకు ఎంతెంత నీరు అవసరమనే విషయాన్ని గుర్తిస్తున్నారు. పంటలకు అవసరమైన సమయంలోనే ఈ నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ వివరాలన్నింటినీ ఇరిగేషన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌తో జతచేయగానే ఆటోమేటిక్‌గా సెన్సార్ ద్వారా గేట్లు తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతాయి. దీనికి సంబంధించిన కంట్రోల్ సెంటర్‌ను రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న కాళేశ్వరం సర్కిల్ ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎలక్ర్టికల్ సెన్సార్‌లు అమర్చిన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి పంట భూములకు సాగునీరు తరలివెళ్లే వరకు ఆటోమెషిన్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంటుంది.
ప్రతీ ఎకరాకు నీరందేలా
రిజర్వాయర్లలో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నప్పటకీ సరైన కేటాయింపు లేక చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదనే విమర్శలున్నాయి. దీనికితోడు కొన్ని చోట్ల రైతులు నీళ్లను తమ భూములకు మళ్లించుకోవడంతో నీటి దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించారు. ఒక ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా జరిగితేనే ప్రతీ ఎకరాకు నీరు అందుతుందని గ్రహించారు. అందుకే ఈ సాఫ్ట్‌వేర్ ఇరిగేషన్ విధానాన్ని ఆచరణలోకి తేనున్నారు. అంతేగాకుండా ఏయే కాలువకు ఎన్ని నీళ్లు విడుదల చేశామనే లెక్కతోపాటు ఓటీల ద్వారా పంటభూములకు విడుదలైన నీటి లెక్క కూడా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల దిగుబడి పూర్తికావడానికి ఒక టీఎంసీ నీరు వినియోగమైందని గుర్తిస్తే.. మళ్లీ వచ్చే యాసంగి సీజన్‌కు ఒక టీఎంసీ నీటిని అందుబాటులో ఉంచుతారు. వినూత్నంగా చేపట్టిన ఈ ఆటోమెషిన్ విధానం గురించి రంగనాయకసాగర్ పరిధిలో ఉన్న రైతులకు కూడా అవగాహన కల్పించనున్నారు.