Share News

Robberies in Telangana: ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త..

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:28 PM

సూర్యాపేట జిల్లాలోని మూడు మండలాల్లో నిన్న (శుక్రవారం) పెద్దఎత్తున చోరీలు జరిగాయి. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు ఏకంగా ఐదు గ్రామాల్లో దోపిడీలకు పాల్పడ్డారు. లక్షల సొత్తు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.

Robberies in Telangana: ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త..
Online Delivery Store Robbery

సిద్దిపేట: తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరసగా చోరీలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా సొమ్ము కాజేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం నాడు పట్టపగలే ఐదు గ్రామాల్లో దొంగతనాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు సిద్దిపేట జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. గజ్వేల్‌లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. మాస్కులు ధరించిన కొంతమంది కేటుగాళ్లు ఆన్ లైన్ డెలివరీ స్టోర్ షెట్టర్ తాళాలు పగలకొట్టారు. సీసీ కెమెరా వైర్లు కత్తిరించి బీరువా, డెలివరీ వస్తువులు ఎత్తుకెళ్లారు. పట్టణ సమీపంలోని చెరువు వద్దకు బీరువా తీసుకెళ్లి ధ్వంసం చేశారు. అనంతరం అందులోని నగదు దోచుకెళ్లారు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది.


సూర్యాపేట జిల్లాలో ఇలా..

కాగా, సూర్యాపేట జిల్లాలోని మూడు మండలాల్లో నిన్న (శుక్రవారం) పెద్దఎత్తున చోరీలు జరిగాయి. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు ఏకంగా ఐదు గ్రామాల్లో దోపిడీలకు పాల్పడ్డారు. లక్షల సొత్తు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సోమగాని లక్ష్మి అనే అంగన్వాడీ టీచర్‌ ఇంట్లో రూ.50 వేలు, 17 గ్రాముల బంగారం, 10 తులాల వెండి పట్టీలు చోరీకి గురయ్యాయి. వీటి మెుత్తం విలువ రూ.2.10 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. అలాగే గడ్డిపల్లి గ్రామానికి చెందిన కరణం నాగేశ్ కుటుంబం బంధువుల పెళ్లి కోసం పెనపహాడ్‌‌కు వెళ్లగా తాళాలు పగలకొట్టిన కేటుగాళ్లు రూ.1.76 విలువైన పసిడి ఆభరణాలు దోచుకెళ్లారు. అదే వీధిలో కోన శ్రీనయ్య ఇంటి తాళం బద్దలుకొట్టి రూ.36 వేలు స్వాహా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


నేరేడుచర్ల 5వ వార్డు నర్సయ్యగూడెంలో పేరం వెంకన్న, లింగమ్మ దంపతులు కూలి పనులకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో ఇద్దరు దుండగులు పల్సర్‌ బైక్‌‌పై వచ్చి ఇంటి తాళాలు పగలకొట్టారు. అనంతరం 7.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని బాధితులు చెప్పారు. పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం, కల్మెట్‌తండాలో గుండ్ర శ్రీనివాసరెడ్డి, బాణావత్ సైదా ఇళ్లలోనూ దుండగులు చేతివాటం ప్రదర్శించారు. శ్రీనివాసరెడి ఇంట్లో 12 తులాల వెండి, తులం బంగారం దోచుకెళ్లారు. బాణావత్ సైదా ఇంట్లో తులంన్నర బంగారం, రూ.60 వేలు అపహరించారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగిన ఘటనల్లో మెుత్తం రూ.13.65 లక్షల సొత్తు చోరీకి గురైందని జిల్లా పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

KTR: భూగర్భ జలాలు ఎండిపోవడానికి వారే కారణం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పై కప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

Updated Date - Feb 22 , 2025 | 12:28 PM