MP Kotha Prabhakar: ‘బీజేపీని గద్దె దించేవరకు మా ఉద్యమం ఆగదు’
ABN, First Publish Date - 2023-03-02T12:09:38+05:30
గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దె దించే వరకు తమ ఉద్యమం ఆగదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
సిద్దిపేట: గ్యాస్ ధరను పెంచిన బీజేపీ (BJP)ని గద్దె దించే వరకు తమ ఉద్యమం ఆగదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy) స్పష్టం చేశారు. గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా గురువారం దుబ్బాక పట్టణంలో స్థానిక బస్టాండ్ ఎదుట బీఆర్ఎస్ (BRS) ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రూ.1175తో గ్యాస్ కొనడం దారుణమన్నారు. నల్లధనం తీస్తానని గతంలో చెప్పిన మోదీ నేటికీ తీసింది లేదని... రూ.15 లక్షలు అకౌంట్లో వేసింది లేదని మండిపడ్డారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోదీ అమ్మకానికి పెట్టడం దారుణమని మండిపడ్డారు. దేశంలో ఏ టెండర్ పడ్డ గుజరాత్ కంపెనీకే మోదీ ప్రభుత్వం అప్పజెబుతోందని మండిపడ్డారు. నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతోందన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని తిట్టడమే బీజేపీ నాయకుల పని అని ఎంపీ అన్నారు.
గతంలో వాజ్‌పేయి (Atal Bihari Vajpayee ) పాలించిన బీజేపీ పాలన ఎటు పోయిందని.. ఇప్పుడు ఇంత దౌర్భాగ్య మోదీ పాలన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీని గద్దె దించేందుకే బీఆర్ఎస్ స్థాపించడం జరిగిందన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను చేజిక్కించుకొని ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని తెలిపారు. ‘‘ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా అన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Dubbaka MLA Raghunandan Rao) ఎటు పోయిండు.. రాజీనామా చేసిండా? ’’ అని ప్రశ్నించారు. అబద్ధాలు ఆడి గద్దెనెక్కిన రఘునందన్‌ను ఊర్లల్లో తిరగనీయ వద్దని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ధర్నా అనంతరం స్థానిక బస్టాండ్ ఎదుట దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు.ఈ నిరసనలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ (MLC Farooq Hussain) పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T12:09:38+05:30 IST