తెలంగాణలో కాదు.. కర్ణాటకలో డిక్లరేషన్‌ చేయండి

ABN , First Publish Date - 2023-08-28T00:18:01+05:30 IST

సొంత రాష్ట్రంలో చేస్తేనే నిజాయితీ ఉన్నట్టు దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో కాదు.. కర్ణాటకలో డిక్లరేషన్‌ చేయండి
సిద్దిపేటలో దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాలను అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్‌, ఆగస్టు 27: కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణలో డిక్లరేషన్‌ మీద డిక్లరేషన్‌ చేస్తున్నారని, ఏ డిక్లరేషన్‌ చేసినా సొంత రాష్ట్రంలో చేస్తేనే నిజాయితీ ఉన్నట్లు తెలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మొదటగా డిక్లరేషన్‌ చేసి, ఇక్కడ తర్వాత డిక్లరేషన్‌ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు సూచించారు. ఆదివారం సిద్దిపేటలో బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాలను పంపిణీ మంత్రి పంపిణీ చేశారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగులకు అత్యధిక పింఛన్‌ అందించడమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు సీఎం కేసీఆర్‌ ఒక్కరు మాత్రమే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక్కొక్క దివ్యాంగుడు ఒక్కో కేసీఆర్‌ కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని కర్ణాటక, చత్తీ్‌సఘడ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండి వెయ్యి రూపాయల పింఛను మాత్రమే ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో 5 లక్షల 5 వేల 225 మంది దివ్యాంగులకు పెన్షన్లు పెంచి ఇస్తున్నామని తెలిపారు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు చెప్పారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని దివ్యాంగులు దీవించాలని మంత్రి కోరారు. బీడీ కార్మికులకే కాదు బీడీ టేకేదార్లకు రూ.2,016పెన్షన్‌ ఇస్తున్నామని వివరించారు. జిల్లాలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 167 మందిని క్రమబద్ధీకరించామని, మిగిలిన 11 మందిని త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమంలో ఎన్నో మార్పులు వచ్చాయని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, కూర రఘోతంరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ పాల్గొన్నారు.

ముస్లింల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌ కృషి

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు27: ముస్లింల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు అతీక్‌అహ్మద్‌, సజ్జూలతో పాలు పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో అందరం కలిసి పనిచేయాలని సూచించారు. సిద్దిపేటలో 2,600 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించామని, అందులో పేద ముస్లిం కుటుంబాలకు 650 ఇళ్ల్లు అందించామని చెప్పారు. తెలంగాణలో 9 ఏళ్ల నుంచి హిందూ, ముస్లిం గొడవలు లేవని, హిందు, ముస్లిం బాయ్‌బాయ్‌ అన్నట్లుగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నామని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల షాదీముబారక్‌ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ముస్లింల సంఖ్య తక్కువున్నా వారి సంక్షేమాని బడ్జెట్‌లో పెద్దపీట వేశామని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-28T00:18:01+05:30 IST