Vanama Venkateswara Rao: నో డౌట్.. మళ్లీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తా..
ABN , First Publish Date - 2023-08-11T12:58:14+05:30 IST
సుప్రీం స్టేతో న్యాయమే గెలిచిందని, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలు, కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో
కొత్తగూడెం, (ఆంధ్రజ్యోతి): సుప్రీం స్టేతో న్యాయమే గెలిచిందని, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలు, కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో తనకు అంతా మంచే జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Kothagudem MLA Vanama Venkateswara Rao) పేర్కొన్నారు. వనమా ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టే వచ్చిన తర్వాత తొలిసారి గురువారం కొత్తగూడెం వచ్చిన వనమాకు బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు సుజాతనగర్ సమీపంలోని నాయకులగూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. డప్పువాయిద్యాలు, బంజారా నృత్యాలు, కోలాటాలు, కళాకారుల ఆటపాట మధ్య నాయకులగూడెం నుంచి సుజాతనగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, విద్యానగర్‌కాలనీ, చుంచుపల్లి, కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటరు, బస్టాండ్‌సెంటరు, కొత్తగూడెం పట్టణం సూపర్‌బజారు, ఎంజీ రోడ్డు, గణేష్ టెంపుల్, మొర్రేడుబ్రిడ్జి మీదుగా పాత పాల్వంచ వరకు సుమారు 30 కిలోమీటర్లు వందలాది ద్విచక్రవాహనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు.
ఈ క్రమంలో పోస్టాఫీస్ సెంటరు, విద్యానగర్‌కాలనీల వద్ద రెండు క్రేన్ల సాయంతో వనమాకు గజమాలలను అలంకరించారు. అంతకుముందు వనమా జూలూరుపాడులోని సాయిబాబా ఆలయం, నాయకులగూడెం వద్ద ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటరులో ప్రజలను ఉద్దేశించి వనమా మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం(Kothagudem Constituency) నుంచి పోటీ చేసి విజయం సాదిస్తానని, తుదిశ్వాస వరకు కొత్తగూడెం ప్రజలకు సేవచేస్తానని, ఎన్నో కుట్రలు, కుత్రంతాలు దాటుకుని 40ఏళ్లుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని, ఇదంతా నియోజకవర్గ ప్రజల ఆశ్వీరాదంతోనే జరిగిందన్నారు. తాను మళ్లీ నేటినుంచే కార్యాచరణలో ఉంటానని నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్న ఇచ్చేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మున్సిపల్‌చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్‌చైర్మన్ వేల్పుల దామోదర్, నాయకులు ఎంఎ. రజాక్, పలువురు కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీశ్రేణులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.