Hyderabad: చదివింది బీఎస్సీ.. చేసేది స్మగ్లింగ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:33 AM
ఈజీమనీ కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. బీఎస్సీ చదివిన ఆ యువకుడు ఏకంగా దొంగతనాలు చేస్తూ.. చివరకు దొరికిపోయి జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

- స్నేహితుడితో కలిసి హాషిష్ ఆయిల్ రవాణా
- అనకాపల్లికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
- రూ.80 లక్షల విలువైన ఆయిల్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ: బీఎస్సీ చదివిన యువకుడు ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. స్నేహితుడితో కలిసి ముఠాగా ఏర్పడి హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు హాషిష్ ఆయిల్ (గంజాయి నూనె) సరఫరా చేస్తున్నాడు. చివరకు రాచకొండ(Rachakonda) పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత
భువనగరి రైల్వేస్టేషన్ సమీపంలోని అనంతారం సర్వీసు రోడ్డులో ఇద్దరు వ్యక్తులు కాలేజీ బ్యాగులు వేసుకొని అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు ఎస్‌వోటీ మల్కాజిగిరి టీమ్‌కు సమాచారం అందింది. భువనగిరి డీసీపీ అక్షాంష్ యాదవ్, ఎస్‌వోటీ రమణారెడ్డి, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ అంజయ్య పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి టీమ్ వారిపై నిఘా పెట్టింది. భువనగిరి రూరల్ పోలీసులతో కలిసి సంయుక్తగా దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకుంది.
వారి నుంచి రూ.80 లక్షల విలువైన నాలుగు కేజీల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుంది. ఒక్క కేజీ హాషిష్ ఆయిల్‌ను తయారు చేయాలంటే సుమారు 50 కేజీల గంజాయిని మరపట్టాల్సి ఉంటుందని, 200 కేజీల గంజాయిని మరపట్టి 4 కేజీల హాషిష్ ఆయిల్‌ను తయారు చేశారని సీపీ వెల్లడించారు. నిందితులిద్దరు అనకాపల్లి నర్సీపట్నానికి చెందిన పేట్ల శేఖర్, అనిమిరెడ్డి దుర్గారావుగా నిర్ధారించారు.
ఉన్నత చదువు చదివి..
పేట్ల శేఖర్ నర్సీపట్నంలో బీఎస్సీ కెమెస్ట్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతనికి స్థానికంగా గంజా దుర్గ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అతను హైదరాబాద్‌తో పాటు నగర చుట్టపక్కల శివారు ప్రాంతాలకు గంజాయి, హాషిష్ ఆయిల్‌ను సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. శేఖర్ అతనితో చేతులు కలిసి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. ఈ నేపథ్యంలో అతని చిన్ననాటి స్నేహితుడైన దుర్గారావుకు విషయం చెప్పి తన ముఠాలో చేర్చుకున్నాడు.
స్నేహితులిద్దరూ కలిసి గంజా దుర్గ వద్ద హాషిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్, శివారు ప్రాంతాల వినియోగదారులకు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా కాలేజీ బ్యాగుల్లో హాషిష్ ఆయిల్‌ను పెట్టుకొని, రైలు మార్గంలో హైదరాబాద్‌కు చేరుకుని విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులిద్దరినీ భువనగిరి రూరల్ పోలీసులు రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గంజా దుర్గను త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News