Share News

పెను విషాదం

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:30 AM

అది అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా సంస్థ! బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయం! మొదటి షిఫ్టు కార్మికులు విధులు ముగించుకుని... రెండో షిఫ్టు సిబ్బంది లోపలికి వెళ్తున్నారు.

పెను విషాదం

ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం

20 మందికి పైగా తీవ్ర గాయాలు

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ఘోరం జరిగింది! పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణనష్టం పరంగా ‘ఫార్మా’ చరిత్రలోనే అతి భారీ ప్రమాదమిది!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ‘ఎసెన్షియా’ కర్మాగారంలో జరిగిన పేలుడుతో 18 మంది ప్రాణాలు

కోల్పోయారు. 20 మందికి పైగా గాయాలపాలయ్యారు.

మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు.

భీతావహం..

ముక్కలుగా మృతదేహాలు... గుర్తుపట్టలేని స్థితిలో కాలిన శరీరాలు... ఎటు చూస్తే అటు శిథిలాలతో ప్రమాదస్థలం భీతావహంగా మారింది. కొందరి శరీర భాగాలు తుత్తునియలయ్యాయి. దూరంగా విసిరేసినట్లుగా పడిపోయాయి. సమీపంలోని ఒక చెట్టు కొమ్మల్లోనూ చిక్కుకున్నాయి. క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడిపోయి కనిపించారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎంత మంది కంపెనీ ఆవరణలో ఉన్నారు.. వారిలో ఎందరు బయటికి వచ్చారు.. ఎందరు శిథిలాల కింద చిక్కుకున్నారనేది ఇంకా లెక్క తేలడంలేదు. కార్మికుల కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ పలువురు విలపించడం కనిపించింది.

ఊపిరి తీసిన ఆవిరి..

అచ్యుతాపురం సెజ్‌లో అనేక ఫార్మా పరిశ్రమలున్నాయి. చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ... మృతుల సంఖ్యను బట్టి చూసుకుంటే ‘ఎసెన్షియా’ ఘటన అతి భారీ విషాదమని నిపుణులు పేర్కొంటున్నారు. రియాక్టర్లు, బాయిలర్ల పేలుడు వల్లే పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ... తొలిసారిగా ‘వేపర్‌ క్లౌడ్‌ ఎక్స్‌ప్లోజన్‌’ (వీసీఈ) జరిగింది.

అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసెన్షియా’లో రసాయన ద్రావకం లీక్‌

ఎలక్ట్రిక్‌ ప్యానల్‌పై పడిన రసాయనం

ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వెంట్‌

మంటలతో ‘వేపర్‌ క్లౌడ్‌ ఎక్స్‌ప్లోజన్‌’

కుప్పకూలిన భవనం శ్లాబ్‌, ఓ గోడ

కార్మికుల హాహాకారాలు.. పరుగులు

చెల్లాచెదురుగా మృతదేహాలు

సమీపంలోని చెట్ల మీదకూ ఛిద్రమైన శరీర భాగాలు

(అనకాపల్లి/విశాఖపట్నం/ అచ్యుతాపురం - ఆంధ్రజ్యోతి)

అది అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా సంస్థ! బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయం! మొదటి షిఫ్టు కార్మికులు విధులు ముగించుకుని... రెండో షిఫ్టు సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. అంతలోనే... దట్టమైన పొగ అలుముకుంది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే... చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు! ఒక్కసారిగా హాహాకారాలు! పేకమేడలా కూలిపోయిన ఫ్యాక్టరీ శ్లాబ్‌! ఒకరిద్దరితో మొదలైన ప్రాణనష్టం... సమయం పెరిగేకొద్దీ పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ఫార్మా పరిశ్రమ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికార వర్గాల కథనం ప్రకారం... ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో ఇంటర్మీడియట్‌ కెమికల్స్‌ ఉత్పత్తి చేస్తారు. 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారంలో మొత్తం 381 మంది ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తారు. బుధవారం మధ్యాహ్నం తొలి షిఫ్టు కార్మికులు విధులు ముగించుకుని వెళ్తుండగా... దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కొన్ని నిమిషాల్లోనే భారీ పేలుడు సంభవించింది. దీని తీవ్రతకు శ్లాబ్‌, గోడ కుప్పకూలిపోయాయి. ఒకదాని వెంట మరొకటిగా జరిగిన ఘటనలతో కార్మికులు కకావికలమయ్యారు. పేలుడు ధాటికి కొందరి శరీరాలు తుత్తునియలయ్యాయి. శ్లాబ్‌ శిథిలాల కింద కొందరు నలిగిపోయారు. చుట్టూ దట్టమైన పొగ అలుముకోవడంతో... ఎటుపోతున్నామో తెలియకుండా పరుగులు తీస్తూ గోడలకు తగిలి, మెట్లపై నుంచి కొందరు కింద పడిపోయారు. ఈ మూడు కారణాలతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ‘ఎసెన్షియా’లో ఒక్కో షిఫ్టులో 80 మంది కార్మికులు పని చేస్తారు. సరిగ్గా ఏ-షిఫ్టు సిబ్బంది బయటికి వెళ్తూ... బి-షిఫ్టు కార్మికులు లోపలికి వెళ్లేటప్పుడే ఈ ఘోరం జరిగింది. మరో ఐదు నిమిషాలు ఉంటే తొలి షిఫ్టు కార్మికులు మొత్తం బయటికి వచ్చేవాళ్లు. రెండో షిఫ్టు సిబ్బంది వాహనాలు దిగి కర్మాగారం ప్రధాన గేటు దాటి వెళ్తుండగా ఈ పేలుడు జరిగింది. దీంతో బయట ఉన్న కార్మికులు పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి కర్మాగారంలోకి ప్రవేశించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లు, కర్మాగారం బస్సుల్లో అచ్యుతాపురంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఘాటైన వాసనలతో కూడిన దట్టమైన పొగ కర్మాగార భవనం మొత్తం ఆక్రమించడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది.

gk,.jpg


రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

ప్రమాదం మధ్యాహ్నం జరిగినా దట్టమైన పొగలు కమ్ముకోవడం, వాటిని పీల్చినవారు అస్వస్థతకు గురి కావడంతో అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తప్ప ఇంకెవరూ లోపలకు వెళ్లలేకపోయారు. రాత్రి చీకటి పడేంత వరకు గాయపడిన వారిని అంబులెన్సుల్లో తరలిస్తూనే ఉన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగిన తర్వాతే సహాయ చర్యలు ఊపందుకున్నాయి. అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ ఎం.దీపిక సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. సాయంత్రం 5గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి.

ఆవిరి మేఘాలతో ‘అపాయం..’

గ్యాస్‌ లీకైనపుడు అది గాలిలో కలిసిపోతే ఏ ప్రమాదం ఉండదు. అదే గ్యాస్‌ లీకై తలుపులు మూసిన గదిలోనే ఉంటే... అవి మేఘంగా మారుతుంది. చిన్న ‘స్పార్క్‌’తో భారీ పేలుడు సంభవిస్తుంది. ఎసెన్షియాలో జరిగిన ప్రమాదం కూడా అలాంటిదే. ‘మిథైల్‌ టెరిషరీ బుయటైల్‌ ఈథర్‌’ గాలిలో కలిసిన వెంటనే దట్టమైన ఆవిరి మేఘాలుగా మారిపోతుంది. భవనం మొత్తం క్లోజ్డ్‌గా ఉండటంతో... ఇది పొగలా అలుముకుంది. ఎలక్ట్రికల్‌ ప్యానళ్ల నుంచి భవనంలో అన్ని మూలలకు విస్తరించింది. మంటలు చెలరేగిన వెంటనే అప్పటికే పైపుల్లో ఉన్న ఆవిరి మేఘం విచ్ఛిన్నమవడంతో రియాక్టర్‌ పేలిందని ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించినట్లు తెలిసింది.


అసలేం జరిగింది..

ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదానికి ‘వేపర్‌ క్లౌడ్‌ ఎక్స్‌ప్లోజన్‌’ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. థర్డ్‌ఫ్లోర్‌లో ఉన్న రియాక్టర్‌ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఒక ట్యాంకర్‌లోకి ‘మిథైల్‌ టెరిషరీ బుయటైల్‌ ఈథర్‌’ అనే సాల్వెంట్‌ (ద్రవ రసాయనం) పంపిస్తున్నారు. ఈ క్రమంలో పైపులు లీకై... గ్రౌండ్‌ఫ్లోర్‌లోని విద్యుత్‌ ప్యానల్స్‌పై రసాయనం పడింది. దీంతో రసాయనం ఆవిరై... దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. ఆ గది మొత్తం అలుముకున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్‌ ప్యానల్స్‌, ఏసీ డక్టుల ద్వారా భవనమంతా రసాయన మేఘాలు వ్యాపించాయి. సాల్వెంట్‌ పడిన ఎలక్ట్రిక్‌ ప్యానల్స్‌ వద్ద నిప్పు రాజుకుంది. క్షణాల్లోనే దట్టమైన పొగలా అలుముకున్న రసాయన ఆవిరి వల్ల భారీ పేలుడు జరిగింది. దీని తీవ్రతకు గ్రౌండ్‌ఫ్లోర్‌ శ్లాబ్‌, గోడ కుప్పకూలాయి. మూడో ఫ్లోర్‌లో ఉన్న రియాక్టర్‌కూడా పేలిపోయినట్లు తెలుస్తోంది.

మృతుల్లో ఏజీఎంలు, ట్రైనీలు

ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన వారిలో బుధవారం అర్ధరాత్రి సమయానికి 17 మందిని గుర్తించారు. మృతులు వీరే... నీలాపు రామిరెడ్డి (ఏజీఎం/ అసోసియేట్‌ డైరెక్టర్‌), ప్రశాంత్‌ హంస (సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌), మహంతి నారాయణ (టీమ్‌ లీడర్‌), కొప్పర్తి గణేశ్‌ కుమార్‌ (సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌), చల్లపల్లి హారిక (ట్రైనీ ఇంజనీర్‌), పైడి రాజశేఖర్‌ (ట్రైనీ ప్రాసెస్‌ ఇంజనీర్‌), మరిశెట్టి సతీశ్‌ (సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌), మొండి నాగబాబు (అసిస్టెంట్‌ మేనేజర్‌), నాగేశ్వర రామచంద్రరావు (టీమ్‌ లీడర్‌), వేగి సన్యాసినాయుడు (హౌస్‌ కీపింగ్‌ బాయ్‌), యల్లబిల్లి చిన్నారావు (పెయింటర్‌), జవ్వాది పార్థసారధి (ఫిట్టర్‌), పపూడి మోహన్‌ దుర్గా ప్రసాద్‌ (హౌస్‌ కీపింగ్‌), బమ్మిడి ఆనందరావు (అసిస్టెంట్‌ మేనేజర్‌), మర్ని సురేందర్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌), పూసర్ల వెంకటసాయి (సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌), జవ్వాది చిరంజీవి (ఫిట్టర్‌).

అనుభవజ్ఞులు లేకనే...

ఎసెన్షియా కంపెనీలో అనుభవజ్ఞులైన నిపుణులు లేకపోవడమే భారీ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కర్మాగారంలో జూనియర్లు, ఇటీవల డిగ్రీ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్లు పనిచేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కర్మాగారంలో మూడో ఫ్లోర్‌లోని రియాక్టర్‌ నుంచి కింద ఫ్లోర్‌లోకి సాల్వెంట్‌ తరలించే క్రమంలో అది లీకైన విషయాన్ని అనుభవంలేని సాంకేతిక నిపుణులు గుర్తించలేకపోయారని అంచనాకు వచ్చారు. అదే సీనియర్లు అయితే లీకులను వెంటనే అరికట్టడం, వర్క్‌ స్పాట్‌లో ప్రధానంగా ఎలక్ట్రికల్‌ ప్యానళ్లు ఉన్న గదిలో ఆవిరి మేఘాన్ని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేవారని అంటున్నారు. ఇటీవల వసంత కెమికల్స్‌లో ప్రమాదం సంభవించినపుడు కొంత నష్టం జరిగినా సీనియర్లు ఉండడంతో అక్కడ భారీ ముప్పు తప్పిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 22 , 2024 | 06:46 AM