Amaravati : తప్పులు కప్పిపుచ్చే తనిఖీలు!
ABN, Publish Date - Aug 26 , 2024 | 03:59 AM
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు
సోషల్ ఆడిట్ బృందాల కమీషన్లు
అవినీతిపరులతో బేరసారాలు
4 రకాల నిఘా వ్యవస్థలూ నిర్వీర్యం
ఐదేళ్లుగా ఉపాధి హామీ పథకం తీరు
కమీషన్లు దండుకుంటున్న సోషల్ ఆడిట్ బృందాలు
అవినీతిపరులతో బేరసారాలు.. బెదిరింపులు
నాలుగు రకాల నిఘా వ్యవస్థలూ నిర్వీర్యం
గత ఐదేళ్లుగా ఉపాధి హామీ పథకం తీరు
పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని డిమాండ్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు నాలుగు రకాల నిఘా వ్యవస్థలను ఏర్పాటుచేసినా.. వాటి కళ్లకు గంతలు కట్టి యథేచ్ఛగా అక్రమాలకు గేట్లు ఎత్తేశారు.
ఒకప్పుడు ఉపాధిలో సామాజిక తనిఖీ విభాగం(సోషల్ ఆడిట్) అంటే అక్రమాలకు పాల్పడే సిబ్బందికి సింహస్వప్నంగా ఉండేది. ప్రతి మండలంలో సోషల్ ఆడిట్ సిబ్బంది నెలరోజులు తిష్టవేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించేవారు. ప్రతి ఆర్నెల్లకు సోషల్ ఆడిట్ తనిఖీలు నిర్వహిస్తున్నారంటే గ్రామాల్లోని ఉపాధి సిబ్బంది అప్రమత్తంగా ఉండేవారు.
రికవరీలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ ఆ పరిస్థితిని మార్చేసింది. సోషల్ ఆడిట్ సిబ్బందికి పర్సంటేజీలిస్తే చాలు.. వాళ్లే మేనేజ్ చేస్తారన్న భావనకు ఉపాధి సిబ్బంది వచ్చారు.
చాలీచాలని సిబ్బందితో వచ్చి నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. కమిషనరేట్ నుంచి జిల్లా స్థాయి దాకా సోషల్ ఆడిట్ అధికారుల చేతులు కట్టేసి అవినీతికి గేట్లు ఎత్తేశారు. విజిలెన్స్ విభాగం కూడా అచేతనంగా మారిపోయింది.
అంబుడ్స్‌మెన్‌గా సొంత పార్టీ వాళ్లనే ఎక్కువమందిని నియమించుకోవడంతో వారు అంతగా స్పందించకపోవడం, స్పందిస్తే ప్రభుత్వ పెద్దల ఆగ్రహాలకు గురి కావాల్సి వస్తుందని భయపడ్డారు.
ఉన్న వ్యవస్థల్లో క్వాలిటీ కంట్రోల్ కొంత మెరుగ్గా వ్యవహరించింది. అయితే క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేసేది 10 శాతం పనులు మాత్రమే అయినందున అవినీతిపరుల ఆటలు కట్టించలేకపోయారు.
గత ఐదేళ్లలో సోషల్ ఆడిట్ తీరు..
గత ఐదేళ్లలో అవినీతి జరిగిన మొత్తానికి, రికవరీ చేసిన మొత్తానికి భారీ వ్యత్యాసాలున్నాయి. తనిఖీలు నామమాత్రంగా జరిపి క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అధికారులే మేనే జ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. 2020-21 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,683 గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహిస్తే రూ.139 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సోష ల్ ఆడిట్‌లో గుర్తించారు.
అందులో రూ. 63.33 కోట్లకు యాక్షన్ టేకన్ నివేదికలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే కేవలం రూ.2.25 కోట్లు(3.55 శాతం మాత్రమే) రికవరీ చేసి సరిపెట్టుకున్నారు. 1,379 మంది సిబ్బంది నుంచి రికవరీ చేశామని, 5,038 మంది ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు చేశామని పేర్కొన్నారు.
ఇక 2021-22 సంవత్సరంలో 5,956 గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి, రూ.137.67 కోట్లు దుర్వినియోగమైనట్టు తేల్చారు. రూ.89.34 కోట్లకు యాక్షన్ టేకన్ రిపోర్టులను తయారుచేశారు. అందులో రూ.7.59 కోట్లు(8.50 శాతం మాత్రమే) రికవరీ చేయగలిగారు.
అలాగే, 2022-23లో 13,070 గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి రూ.80.64 కోట్లు తేడాలున్నట్లు గుర్తించారు. అందులో రూ.39 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించి యాక్షన్ టేకన్ నివేదికలను తయారుచేశారు. అందులో రూ.5.35 కోట్లు(13.48 శాతం మాత్రమే) రికవరీ చేయగలిగారు.
2023-24లో 13,388 గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి, రూ.56.12 కోట్ల తేడాలు ఉన్నట్లు తేల్చారు. అందులో రూ.10.64 కోట్లు అవినీతి జరిగిందని నిర్ధారించి యాక్షన్ టేకన్ నివేదికలను తయారుచేశారు.
అందులో రూ.1.48 కోట్లు (13.98ు మాత్రమే) రికవరీ చేయగలిగారు. ఇక 2024-25 సంవత్సరానికి ఇప్పటివరకు 2,131 గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించగా రూ.21.86 కోట్ల పనుల్లో తేడాలు గుర్తించి, రూ.6.36 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు.
రూ.2.73 లక్షలు(0.43 శాతం మాత్రమే) రికవరీ చేయగలిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఇటీవల సోషల్ ఆడిట్ నిర్వహిస్తే ఎప్పుడూ లేని విధంగా రూ.76 లక్షలు అవినీతి జరిగినట్లు తేల్చారు. దీంతో ప్రత్యక్షంగా హాజరైన సోషల్ ఆడిట్ డైరెక్టర్ జగదీష్, అంబుడ్స్‌మెన్ ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరుపతి జిల్లా చిల్లకూరులో జరిగిన సోషల్ ఆడిట్‌లోనూ భారీగా రికవరీ పెట్టారు.
నిఘా ఏజెన్సీల తీరు మారాలి....
ఉపాధి హామీలో కీలకమైన నిఘా ఏజెన్సీలు ఇకనైనా ధోరణి మార్చుకోవాలి. ఈ నాలుగు రకాల వ్యవస్థలు జవాబుదారీగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. సోషల్ ఆడిట్ డైరెక్టర్ పదవీ కాలం ఇప్పటికే పూర్తి కావడంతో కొత్త డైరెక్టర్‌ను నియమించాల్సి ఉంది. ఈ లోపు పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణ తేజను ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశముంది. ఆయన సోషల్ ఆడిట్‌ను ప్రక్షాళన చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. మిగతా నిఘా ఏజెన్సీల్లోనూ నిజాయితీ కలిగిన అధికారులను నింపి పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది.
Updated Date - Aug 26 , 2024 | 03:59 AM