ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

ABN, Publish Date - Jul 09 , 2024 | 04:18 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.

  • మధ్యంతర ఇసుక పాలసీ విడుదల.. జీవో 43 జారీ

  • జగన్‌ హయాంలోని పాలసీల ఉపసంహరణ

  • ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీలతో కాంట్రాక్టు రద్దు

  • ఇకపై ప్రైవేటు అమ్మకాలు బంద్‌

  • ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల్లోనే ఇసుక

  • బ్లాక్‌లో అమ్మితే కఠిన శిక్ష, జరిమానా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది. దీంతో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇది పూర్తిస్థాయి పాలసీ కాదు. త్వరలో సమగ్ర పాలసీ రానుంది. అయితే, మధ్యంతర పాలసీ ప్రజలెదుర్కొంటున్న ఇసుక కష్టాలను తీర్చనుంది. ప్రైవేటు అమ్మకాలు, అడ్డగోలు అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ రవాణాను చట్టబద్ధంగా అరికట్టేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జగన్‌ సర్కారు తీసుకొచ్చిన 2019, 2021 ఇసుక పాలసీలను ప్రభుత్వం ఉపసంహరింది.

దీని ప్రకారం ఇసుక అమ్మకాల కాంట్రాక్టు రద్దయింది. అలాగే, 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా, ఎనిమిది జిల్లాల పరిధిలో జీసీకేసీ కంపెనీలతో గనుల శాఖ అప్పట్లో కుదుర్చుకున్న ఇసుక తవ్వకాలు, అమ్మకం కాంట్రాక్ట్‌ కూడా రద్దయిపోయింది. ఈ మేరకు ఒప్పందాల రద్దుకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ కార్యదర్శి యువరాజ్‌ మెమో జారీ చేశారు. అయితే, ఆ ఒప్పందం నుంచి తామే స్వచ్ఛందంగా వైదొలగుతామని ఆ రెండు కంపెనీల ప్రతినిధులు.... గనుల శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి లిఖితపూర్వక నివేదిక ఇచ్చారు. దీంతో సోమవారం నుంచి ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, నిల్వలు, ర వాణా వంటి అంశాల్లో ఆ కంపెనీలు వేలుపెట్టడానికి వీల్లేదు. ఇప్పటికే వాటి నియంత్రణలో ఉన్న ఇసుక డంప్‌లను, స్టోరేజీ యూనిట్లను రెవెన్యూ అధికారుల సమక్షంలో గనుల శాఖ స్వాధీనం చేసుకుంది.

పాలసీ ముఖ్యాంశాలు.....

ఇసుక పాలసీ 2016, 2019, అప్‌గ్రేడ్‌ చేసిన పాలసీ 2021ని చంద్రబాబు ప్రభుత్వం సమీక్షించింది. పర్యావరణ పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పుడు సమగ్రమైన ఇసుక పాలసీ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దీంట్లో భాగంగా ఏం చేయాలో గనుల శాఖ డైరెక్టర్‌ కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించింది. ఉచిత ఇసుక నిర్వహణ (ఆపరేషనల్‌ )కయ్యే ఖర్చులు వినియోగదారులే భరించాలి. అలాగే చట్టపరమైన ఫీజులు (సీనరేజీ, జీఎస్టీ)వినియోగదారులు భరించాలి.


ఇవే లక్ష్యాలు....

ఉచిత ఇసుక అందించడానికి వెనక కొన్ని ప్రధాన లక్ష్యాలున్నాయని సర్కారు తన పాలసీలో పేర్కొంది. అవి... 1. ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడం, ఇంకా సరైన ధరలకే లభించేలా చూడటం ప్రధాన లక్ష్యం. 2. ఇసుక వ్యవహారాల్లో పారదర్శకత, వాస్తవాలు క నిపించేలా చేయడం. 3. పూర్తిస్తాయి విజిలెన్స్‌, పర్యవేక్షణ ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టడం. 4. సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలు, మార్గదర్శకాలమేరకు పర్యావరణ పరిరక్షణకు లోబడే ఇసుక తవ్వకాలు ఉంటాయి. కాగా, ఉచిత ఇసుక విధానం అమలు, పర్యవేక్షణకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎ్‌ససీ) ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ క న్వీనర్‌గా ఉంటే ఈ కమిటీలో జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, సబ్‌కలెక్టర్‌ లేదా ఆర్‌డీఓ, జిల్లా సెబ్‌ అధికారిచ జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ), ఆర్‌టీఓ, భూగర్భ వనరుల విభాగం డీడీ, జలవనరుల శాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ (ఈఈ), గ్రామీణ నీటి పారుదల విభాగం ఈఈ, పీసీబీ పర్యావరణ ఇంజనీర్‌, జిల్లా కలెక్టర్‌ సిఫారసు చేసే ఇతరులు సభ్యులుగా ఉంటారు.

విశాల ప్రజాప్రయోజనాల కోసం....

‘‘నిర్మాణ రంగానికి ఇసుక అనేది ప్రధాన వనరు. నిర్మాణ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఇసుక ధరపై సరైన నియంత్రణ లేకపోతే సామాజిక, ఆర్థిక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఉపాధి, పారిశ్రామిక రంగాలు దెబ్బతింటాయి. సాగునీటి పనులు, మౌలిక వనరుల ప్రాజెక్టులు, రాజధాని భవనాల నిర్మాణం, ఇతర నిర్మాణ రంగానికి మౌలిక వనరు అయిన ఇసుక సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాబట్టి సామాజిక ఆర్థిక రంగంపై ఎలాంటి విపరీత ప్రభావం చూపకుండా ఉండేందుకు, విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇసుక అందరికీఅందుబాటులో ఉంచడం అవసరం.’’ అని ప్రభుత్వం పేర్కొంది.

ఇసుక ధరల నిర్ణయం ఇలా..

ప్రభుత్వం.... ఇసుక సరఫరా నుంచి ఎలాంటి ఆదాయం తీసుకోదు. అయితే, ఇసుక నిర్వహణకయ్యే ఖర్చును వినియోగదారులే భరించాలి.

1. నిర్వహణ చార్జీలు అంటే, ఇసుక తవ్వకాలు, వాహనాల్లో ఇసుకను లోడింగ్‌ చేయడం, రీచ్‌ నుంచి డిపోకు లారీల్లో రవాణా చేసినందుకు అయ్యే రవాణా చార్జీలు, రీచ్‌ల్లో ర్యాంప్‌ రక్షణ, ఇతర పరిపాలనా ఖర్చులుంటాయి.

2. చట్టబద్ధమైన ఫీజులు, పన్నులు వినియోగదారులే భరించాలి. అవేమంటే ఏపీ మినరల్‌ మైన్స్‌ కన్సిషన్‌ రూల్స్‌-1966 ప్రకారం గ్రామ పంచాయతీలకు సీనరేజీ ఫీజులు, జిల్లా మినరల్‌ ఫండ్‌ (డీఎమ్‌ఎఫ్‌) ఖనిజాల అన్వేషణ, పరిశోధన ( మెరిట్‌) ఫీజులతోపాటు జీఎస్టీని వినియోగదారులు చెల్లించాలి.


ఉచిత ఇసుక ఎలా తీసుకోవాలి...

గృహనిర్మాణం కోసం ఇసుక అవసరం ఉన్నవారు సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్‌ డిపోకు వెళ్లాలి. తన ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, ఇసుక డెలివరీ చేయాల్సిన అడ్రస్‌, వాహనం నెంబరు వంటివి సమర్పించాలి. ఆ తర్వాత అధికారి నిర్ణయించే చట్టబద్ధమైన ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఈ చెల్లింపుల కోసం డిపోల్లో ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన క్యూఆర్‌కోడ్‌లు ఏర్పాటుచేశారు. వినియోగదారులు తమ ఫోన్‌ద్వారా స్కాన్‌చేసి ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, యూపీఐబీమ్‌ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. ఎవరు ముందుగా వస్తే వారికే ప్రాధాన్యత తరహాలో స్టాక్‌ లభ్యతను బట్టి ఇసుక కేటాయిస్తారు.

ఇసుక డిపోలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే పనిచేస్తాయి. ప్రభుత్వ డిపోలో కొన్న ఇసుకను తరలించేందుకు వినియోగదారుడే వాహనాలను సమకూర్చుకోవాలి. ఇంటి నిర్మాణం కోసమే ఇసుక తీసుకోవాలి. ఈ విధానం అమలుకు జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌లు(డీఎల్‌టీఎ్‌ఫ) ఏర్పాటు చేస్తారు. ఇబ్బందులు, ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో టోల్‌ ఫ్రీ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీలను ఏర్పాటు చేయనున్నారు.

ఎద్దుల బండి పదేపదే అక్రమ రవాణాలో దొరికితే 5వేలరూపాయల మేర ఫైన్‌ విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాలో వాహనాలు రెండు దఫాలకంటే ఎక్కువగా పట్టుబడితే వాటిని వెంటనే సీజ్‌చేసి కొత్త న్యాయచట్టాల ప్రకారం కోర్టుముందు ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jul 09 , 2024 | 04:19 AM

Advertising
Advertising
<