Ex MLA Chevireddy Bhaskar Reddy : రాజకీయ ప్రేరేపితం.. కేసు కొట్టేయండి
ABN, Publish Date - Dec 25 , 2024 | 07:02 AM
పోక్సో చట్టం కింద తిరుపతి జిల్లా యర్రవారిపాలెం పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన..
తెల్లకాగితంపై సంతకంతో కేసు పెట్టారు: చెవిరెడ్డి న్యాయవాది
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోక్సో చట్టం కింద తిరుపతి జిల్లా యర్రవారిపాలెం పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. మైనర్ బాలికపై లైంగికదాడి జరిగిందని చెవిరెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిటిషనర్‌పై ఫిర్యాదు చేశారన్నారు. సంబంధిత వీడియో ఆధారాలను కోర్టు ముందుంచారు. పిటిషనర్, ఫిర్యాదుదారుడు కూడబలుక్కొని పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, జోక్యం చేసుకోవద్దని అభ్యర్థించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ ‘పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు. పిటిషనర్‌పై కంప్లైట్ చేయలేదని ఫిర్యాదుదారుడు చెబుతున్నారు. పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. బాలికను పరామర్శించేందుకు పిటిషనర్ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెపై రేప్ జరిగిందని పిటిషనర్ మీడియాతో మాట్లాడారని తప్పుడు కేసు పెట్టారు. పిటిషనర్ నవంబరు 4న మీడియాతో మాట్లాడితే 19 రోజుల తర్వాత కేసు పెట్టారు. తెల్లకాగితాలపై ఫిర్యాదుదారుడి సంతకాలు తీసుకొని పిటిషనర్‌పై కేసు పెట్టారు. రాజకీయ దురుద్దేశంలో పిటిషనర్‌ను కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసును కొట్టివేయండి’ అని వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో జనవరి 10న నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ ప్రకటించారు.
Updated Date - Dec 25 , 2024 | 07:03 AM