Share News

AP ELECTIONS : దొరికినంతా తినేశారా..?

ABN , Publish Date - May 27 , 2024 | 12:13 AM

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బు పంచకుండా మింగేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనంతపురం అర్బన నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ భారీగా నిధులను మింగేశారు. ఆ సమయంలో ఉన్న అధికారులు ఎన్నికలు ముగియగానే వెళ్లిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే ఎదురు కాబోతోంది. బూత లెవల్‌ ఆఫీసర్లు(బీఎల్‌ఓ)లు..

AP ELECTIONS : దొరికినంతా తినేశారా..?

ఎన్నికల నిధులు బొక్కిందెవరు...?

రూ.50 లక్షలు మింగిన ఇద్దరు అధికారులు!

రెమ్యునరేషన కోసం బీఎల్‌ఓల ప్రదక్షిణ

నాలుగు విడతలుగా రూ.1.47కోట్ల కేటాయింపు

అదనంగా 1.23కోట్లు కావాలని కోరిన అధికారులు

అనంతపురం నియోజకవర్గంలో చోద్యం

ఆడిట్‌ లేకపోవడంతో అక్రమ వ్యవహారం

అనంతపురం క్రైం, మే 26: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బు పంచకుండా మింగేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనంతపురం అర్బన నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ భారీగా నిధులను మింగేశారు. ఆ సమయంలో ఉన్న అధికారులు ఎన్నికలు ముగియగానే వెళ్లిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే ఎదురు కాబోతోంది. బూత లెవల్‌ ఆఫీసర్లు(బీఎల్‌ఓ)లు, నగరపాలిక సిబ్బందికి రెమ్యునరేషన అందలేదు. దీంతో వారందరూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. వారికి ఇవ్వాల్సిన డబ్బును ఇప్పటికే వాడేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఇద్దరు అధికారులు ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు సమాచారం. దీనికి తోడు ఎన్నికల డబ్బుకు ఆడిట్‌లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు సమాచారం. బీఎల్‌ఓలకు, పీఓ, ఏపీఓలకు రెమ్యునరేషన విషయంలో తేడా ఉండటం సైతం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.


ఎన్నికల నిధులు ఏం చేశారు ?

ఎన్నికల నిధుల ఖర్చులో తేడాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి నాలుగు విడతలుగా రూ.1,47,89000 నిధులు కేటాయించారు. ఎన్నికల్లో పని చేసిన సిబ్బందికి, భోజనాలు, షామియానాలు, ఇతర ఖర్చులు ఇందులోనే భరించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కేవలం టీచర్లు, ఇతర ప్రభుత్వ శాఖకు సంబంధించిన వారికి మాత్రమే రెమ్యునరేషన అందజేశారు. అందులో కూడా తేడాలున్నాయట. ఒక్కో నియోజకవర్గంలో ఒకలా అందజేశారట. అనంతపురం నియోజకవర్గంలో తొలుత 277మంది బీఎల్‌ఓలు పని చేశారు. చివర్లో అదనంగా 15మంది అవసరం ఉండటంతో మొత్తం 292 మంది పని చేశారు. వీరిలో చాలా మంది ఎన్నికలకు సంబంధించి ప్రతి ఏటా సమ్మర్‌ విజన కింద కొత్త ఓట్లను ఎక్కించడం, ఓటరు జాబితా సవరణ లాంటి విధుల్లో పాల్గొన్నారు. ఇక చివర్లో స్లిప్పులు పంచడం, పోలీసులకు భోజనాలు అందించడం వంటివి చేశారు. కానీ వారికి ఎన్నికల రోజుకు సంబంధించి మాత్రమే ఒక్కొక్కరికి రూ.550లు అందజేశారట. చాలామంది బీఎల్‌ఓలకు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు రావాల్సి ఉంది. ఆ డబ్బు కోసం తిరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. మరో వైపు జిల్లా ఉన్నతాధికారులను కలవడానికి అసోసియేషన నాయకులు ముందుకు రాకపోవడంతో వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.


అదనంగా రూ.1.23కోట్లు కావాలట

వాస్తవానికి ఎన్నికల ముందు పీఓకు ఎంత ఇవ్వాలని, బీఎల్‌ఓలకు ఇంత డబ్బు ఇస్తామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించలేదు. కొన్ని జిల్లాల్లో స్పష్టంగా ప్రకటించారు. మొత్తం వచ్చిన నిధులు రూ.1,47,89000 ఇప్పటివరకు రూ.1.29కోట్లు ఖర్చు చేశామని, ఇంకా అదనపు బడ్జెట్‌ రూ.1.23కోట్లు పెండింగ్‌ ఉందని అధికారులు ఎన్నికల కమిషనకు నివేదించినట్లు తెలిసింది. ఆ డబ్బు విభాగాలుగా రూ.30లక్షలు, రూ.9లక్షలు, రూ.11లక్షలు, రూ.15, రూ.40లక్షలు, రూ.6లక్షలు, రూ.2లక్షలు, రూ.10లక్షలుగా అవసరం ఉన్నట్లు ఎన్నికల కమిషనను కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల సిబ్బందికి డబ్బు పంచకుండా ఏం చేశారని బీఎల్‌ఓలు, ఇతర సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వేటికెంత ఖర్చు చేశారో బహిరంగంగా వివరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బొక్కిందెవరు...?

ఎన్నికల సొమ్మును ఓ ఇద్దరు అధికారులు తమ జేబుల్లోకి మళ్లించుకున్నట్లు సమాచారం. వ్యవహారమంతా వారి చేతుల్లోనే ఉండటం, ఎన్నికల లెక్కలకు ఆడిట్‌ లేకపోవడంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఓ అధికారి రూ.30లక్షలు, మరో అధికారి రూ.20లక్షలు నొక్కేసి ఆ డబ్బును ఇప్పటికే చేర్చాల్సిన చోటికి చేర్చినట్లు తెలుస్తోంది. ఖర్చు చూపే విషయంలో దొంగ బిల్లులు సృష్టించినట్లు సమాచారం. భోజనం, షామియానాలు, వాటర్‌బాటిల్స్‌, మజ్జిగ ప్యాకెట్లు, కార్లు, ఇతర వాహనాల అద్దెల విషయాల్లోనూ తక్కువ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ


అనుయాయులకే ఆ బాధ్యత అప్పగించినట్లు సమాచారం. సిబ్బంది అడుగుతుంటే అధికారులు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. వచ్చే పెండింగ్‌ సొమ్ములో ఇవ్వాలని భావిస్తున్నారో లేక ఆ డబ్బునూ దిగమింగేయాలని చూస్తున్నారో తెలియని పరిస్థితి.

తేడాలెందుకో...?

పోస్టల్‌ బ్యాలెట్‌ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి, నేరుగా 13వ తేదీ ఎన్నికల రోజు పాల్గొన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషనలో తేడా ఉండి, ఈ ముసుగులోనే ఆ డబ్బు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. 13న విధుల్లో పాల్గొన్న వారికి రోజుకు పీఓకు రూ.2100లు, ఏపీఓకు రూ.1300లు, ఓపీఓకు రూ.500, బీఎల్‌ఓలకు రూ.350లు ప్రకారం ఇస్తామని చెప్పారట. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ 8రోజులు కొనసాగింది. ఈనెల 2నుంచి 10వతేదీ వరకు జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌కు పీఓకు రూ.350లు, ఏపీఓకు రూ.350లు, ఓపీఓలకు రూ.250లు ఇచ్చారు. జూనియర్‌ కళాశాలలో ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అన్ని రోజులూ


విధులు నిర్వర్తించారు. అక్కడ సౌకర్యాలు సరిగా లేక నానా అవస్థలు పడ్డారు. కానీ రెమ్యునరేషన విషయంలో ఇంతా తేడా ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పీఓకు ప్రకటించిన దాంట్లో కనీసం సగం రూ.వెయ్యి కూడా ఇవ్వలేరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా ఉద్యోగి భర్తకు ఈ విషయం తెలిసి ‘ఫ్రీ సర్వీస్‌ చేశాననుకోవాల్సింది. రూ.250లు ఎందుకు తీసుకున్నావు’ అని ఆమెను మందలించారట. పనిచేసిన సిబ్బందికే కోతలు పెట్టారంటే మిగిలిన పనుల్లో ఎంత తిని ఉంటారో....?


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 27 , 2024 | 12:13 AM