Minister Satya Kumar: కేంద్రానికి మంత్రి సత్యకుమార్ లేఖ.. ఏపీలో ఆ ప్రాజెక్టు చేపట్టాలంటూ వినతి..
ABN, Publish Date - Oct 07 , 2024 | 07:11 PM
సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు.
అమరావతి: సత్యసాయి జిల్లా ధర్మవరంలో "హ్యాండ్లూమ్ క్లస్టర్" ఏర్పాటుకు సత్వరం చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టుచీరెల ఉత్పత్తికి ఈ ప్రాంతం ప్రసిద్ధి గాంచిందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను లేఖకు జత చేసినట్లు మంత్రి తెలిపారు. దాన్ని పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన చేనేత, పట్టు చీరెల తయారీ నిపుణులకు ధర్మవరం పుట్టినిల్లని సత్యకుమార్ లేఖలో వివరించారు.
ఆధునిక యాంత్రిక యుగంలో పవర్‌లూమ్స్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ధర్మవరం సంప్రదాయ పట్టు చీరెల తయారీ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోతూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్ల ఊబిలో చిక్కుకున్న ధర్మవరం చేనేత, పట్టు చీరెల ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టేందుకు తాను పంపుతున్న డీపీఆర్‌లో పలు ప్రతిపాదనలు చేసినట్లు కేంద్ర మంత్రికి సత్యకుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లావ్యాప్తంగా దాదాపు 28,500కుటుంబాలు, ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతంలో 12,800 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని మంత్రి చెప్పారు. అందువల్ల చేనేత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు, ఈ రంగంలో తగిన పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు తాను ప్రతిపాదించిన చర్యలు ఉపయోగపడతాయని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
దాదాపు రూ.30కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో 80శాతం మేర నిధులు (సుమారు రూ.24కోట్లు) కేంద్రం భరిస్తే, మిగిలిన 20 శాతం నిధులు (రూ.6కోట్లు)ను ఏపీ ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వివరించారు. హ్యాండ్లూమ్ క్లస్టర్‌తో అనేక ప్రయోజనాలు, ఎన్నో కుటుంబాలు ఆధారపడే అవకాశం ఉన్నందున డీపీఆర్‌ను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - Oct 07 , 2024 | 07:11 PM