TADIPATRI CASE : ఎవరు ఇరుక్కుంటారో..?
ABN, Publish Date - May 19 , 2024 | 11:36 PM
మా పార్టీ అధికారంలోకి వస్తే మేము సేఫ్. లేదు లేదు గెలిచేది మా పార్టీనే. కాబట్టి మాకేం కాదు. ఇదీ పట్టణంలో జరిగిన రాళ్లదాడిలో పాల్గొని, అజ్ఞాతంలో ఉన్న ఇరుపార్టీల వారి ధీమా. సార్వత్రిక ఎన్నికల రోజున పట్టణంలోని ఓంశాంతినగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగిన 24గంటల్లోనే మరోసారి వైసీపీ శ్రేణులు పట్టణంలోని గానుగవీధిలోని టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటి సమీపంలో రాళ్లవర్షం కురిపించారు. అయితే ఈ ఘటనలకు ఎలాంటి సంబంధం లేని ఇరువర్గాల వారిని కూడా పోలీసు ఉన్నతాధికారులు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే ద్వితీయశ్రేణి ...
అజ్ఞాతంలోకి ఇరు పార్టీల వర్గీయులు
ఎన్నికల ఫలితాలపై రాళ్లదాడి కేసు భవితవ్యం
ప్రతిపక్షంలో ఎవరున్నా ఐదేళ్లు నరకమే!
పాత కేసులతో ప్రస్తుత దాడులను పోల్చుతూ చర్చ
మా పార్టీ అధికారంలోకి వస్తే మేము సేఫ్. లేదు లేదు గెలిచేది మా పార్టీనే. కాబట్టి మాకేం కాదు. ఇదీ పట్టణంలో జరిగిన రాళ్లదాడిలో పాల్గొని, అజ్ఞాతంలో ఉన్న ఇరుపార్టీల వారి ధీమా. సార్వత్రిక ఎన్నికల రోజున పట్టణంలోని ఓంశాంతినగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగిన 24గంటల్లోనే మరోసారి వైసీపీ శ్రేణులు పట్టణంలోని గానుగవీధిలోని టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటి సమీపంలో రాళ్లవర్షం కురిపించారు. అయితే ఈ ఘటనలకు ఎలాంటి సంబంధం లేని ఇరువర్గాల వారిని కూడా పోలీసు ఉన్నతాధికారులు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే ద్వితీయశ్రేణి నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోతూ తమకు సంబంధించిన వారిని కూడా
మరో 20రోజులు కనిపించకుండా పోదాం పదా అంటూ వారి వెంట తీసుకువెళుతున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం లోకి వచ్చే పార్టీపై తమ భవితవ్యం ఆధారపడి ఉంటుందని ఎవరికి వారు చెప్పుకుం టున్నట్లు సమా చారం.
- తాడిపత్రిటౌన
ప్రబోధానంద కేసులో మాదిరిగానేనా..?
గతంలో ప్రభోదానంద కేసులో కూడా ఇలాగే జరిగిందంటూ చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న చివరి ఏడాదిలో ప్రభోదానంద ఆశ్రమంపై దాడి జరిగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ సంఘటనలో ఎటువంటి సంబంధం లేని టీడీపీ నాయకులు, కార్యకర్తలను సైతం పోలీసులు కేసుల్లో చేరుస్తూ దాదాపు మూడేళ్లపాటు ఈ కేసును సాగదీస్తూ వచ్చారు. వైసీపీకి ఎవరు ఎదురుదిరిగితే వారిపై ప్రభాదానంద కేసు రుద్దుతూ నానబెయిలబుల్ కేసు నమోదు చేసి 15రోజులపాటు జిల్లాకేంద్రంలోని జైలుతోపాటు కడప సబ్‌జైలుకు కూడా తీసుకువెళ్లేలా వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీన్నిబట్టిచూస్తే మరో ప్రభోదానంద ఆశ్రమం కేసులాగా రాళ్లదాడి మారుతుందని కూడా పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పైచేయి అవుతుందని, అప్పటికి వారు చెప్పినట్లే కేసులు కూడా నమోదవుతాయని చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఎటువంటి సంబంధంలేని కొంతమంది పెద్దవడుగూరు, యాడికి, పుట్లూరు, యల్లనూరు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేయించారు. ప్రస్తుతం రాళ్లదాడి కేసులో 93 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురం, ఉరవకొండ కోర్టుల్లో హాజరుపరిచారు. అనంతరం కడప జైలుకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వారికి వచ్చే ఐదేళ్లు నరకమే అంటూ గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
సిట్ రాకతో పోలీసుల్లో అలజడి
పట్టణంలో జరిగిన సంఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియ్‌సగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా ఎస్పీ అమితబర్దర్, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. అంతటితో ఆగకుండా ప్రత్యేకంగా సిట్ బృందాన్ని ఏర్పాటుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రెండురోజులపాటు సిట్ బృందం సభ్యులు డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇనస్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్ విచారణ చేశారు. సంఘటనా స్థలాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంఘటనలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది నాయకుల వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారని చర్చ సాగుతుండటంతో అలాంటి వారిలో అలజడి రేగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లపై అర్ధరాత్రి సమయంలో దాడిచేయడం, ఇంటిలోని విలువైన వస్తువులను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు సంబంధించిన సీసీపుటేజీలు బయటకు రావడంతో పాల్గొన్న అధికారులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన ఇంటి పరిసరాల్లో కూడా సిట్ బృందం సభ్యులు విచారించడం గమనార్హం.
వందల సంఖ్యలో అజ్ఞాతంలోకి...
తాడిపత్రిలో రాళ్లదాడుల్లో పాల్గొన్న ఇరువర్గాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు జిల్లా, రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లారని తెలుస్తోంది. కొందరైతే పుణ్యక్షేత్రాలకు వెళితే ఎవరికి అనుమానం రాదన్న ఆలోచనతో తిరుపతి, విజయవాడ, వైజాగ్, అన్నవరం తదితర ప్రాంతాలకు వెళ్లారని సమాచారం. మరికొందరు గోవా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
వ్యాపారం పడిపోయింది
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో వరుసగా దాడులు జరగడంతో ఎలాంటి వ్యాపారాలు లేవు. మా లాంటి చిరువ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రోడ్లపైకి ప్రజలు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో మా వ్యాపారం దెబ్బతింది. పట్టణంలో ఎటుచూసినా పోలీసులే కనిపిస్తున్నారు. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో అర్థం కావడం లేదు.
- మహబూబ్‌బాషా, పండ్ల వ్యాపారి, తాడిపత్రి
భయమేస్తోంది
తాడిపత్రిలో రాళ్లదాడి అనంతరం గ్రామాల్లోకి పోలీసులు వస్తున్నారంటే భయంగా ఉంది. తాడిపత్రిలో అల్లర్లు జరిగితే యల్లనూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎవరిని తీసుకువెళ్లి కేసులు నమోదు చేస్తారో ఏమోనని భయమేస్తోంది. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించి కేసులు నమోదుచేయాలి. - లక్ష్మీదేవి, యల్లనూరు
ప్రజలు భయాందోళనలో ఉన్నారు
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకుంటారో అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ఇరుపార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రామాలను వదిలివెళ్లారు. దీంతో పిల్లలు, కుటుంబసభ్యులు బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తమ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
- శేఖర్, రైతు, రాయలచెరువు, యాడికి మండలం
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 19 , 2024 | 11:36 PM