YS Jagan: ఆ చీకటి జీవో సంగతి చూడండి!
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:05 AM
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో
ప్రభుత్వ భూములను తెగనమ్మేందుకు ల్యాండ్ పాలసీనే మార్చేసిన నాటి జగన్ సర్కారు
‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరిట వైసీపీ పెద్దల బిల్డప్.. నిధులు, వనరుల సమీకరణ ముసుగులో ప్రక్రియ
మంత్రివర్గం, అసెంబ్లీ దృష్టికే తీసుకురాని వైనం.. ఏకపక్షంగా 2021లో చీకటి జీవో 243 జారీ
అది 2019 నుంచే వర్తిస్తుందని ఆదేశాలు.. ఆ జీవో రాష్ట్రంలో ఇప్పటికీ అమల్లోనే..
తొలగించకుంటే ప్రభుత్వ భూములకు ముప్పే!
2011, డిసెంబరు 14... ‘హైదరాబాద్‌ను అమ్మేశారు’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ సంచలన పరిశోధనాత్మక వార్తలను ప్రచురించింది. ఆ నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ఉండగా అప్పటి ప్రభుత్వం తెగనమ్మేసిందని, నేతలు రూ.వందల కోట్ల విలువైన భూములు కబ్జాచేశారంటూ అనేక పరిశోధనాత్మక వార్తలు ప్రచురించింది. దాని ఫలితంగా నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ వార్తలపై స్పందించింది. విచారణ కోసం కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. దాని సిఫారసుల ఆధారంగా.. ప్రభుత్వ భూములను వనరుల సమీకరణ కోసం అమ్మరాదు.. తాకట్టు పెట్టరాదంటూ 2012 సెప్టెంబరు 14న సమగ్ర భూ కేటాయింపు పాలసీ తెచ్చింది. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ అధికారంలోకి వచ్చాక, ఈ పాలసీనే నిర్వీర్యం చేసేశారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో వేలాది కోట్ల రూపాయల విలువచేసే 69.15 ఎకరాల ప్రభుత్వ భూములను దర్జాగా అమ్ముకుందామని 2020లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట ఓ సంసను ఏర్పాటుచేసింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ భూములను అమ్మేందుకు అనుమతి ఇస్తూ 2020జూన్ 12న జీవో 172ను తెచ్చారు. అది చెల్లదని, ఎవరైనా కోర్టుకు వెళితే ఈ జీవో రద్దయిపోతుందని చెప్పినా ఆయన లక్ష్యపెట్టలేదు.
ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లోనే వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే, అనుకున్నంత సులువుగా భూముల అమ్మకం సాధ్యపడటం లేదని ఆచరణలో తెలుసుకున్నారు. ఇందుకు ల్యాండ్ పాలసీలోని సెక్షన్ 3 (ఏ)లోని క్లాజే ప్రధాన కారణమని నాటి రెవెన్యూ అధికారులు జగన్‌కు చెప్పారు. అంతే....ఆ క్లాజ్‌ను పాలసీ నుంచే తొలగిస్తూ మరో చీకటి జీవో 243ను 2021 సెప్టెంబరు 13న జారీ చేయించారు. 2019 నవంబరు 11నుంచే ఈ సవరణ అమల్లోకి వచ్చినట్లుగా మరో అంశాన్ని జోడించడం ఇందులో పెద్ద ట్విస్టు. ఇది పాలనా పద్ధతులకు పూర్తి విరుద్ధమని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.
అంతా ఏకపక్షమే..
ల్యాండ్ పాలసీ సవరణ గురించి జగన్ ఆనాడు మంత్రివర్గంలో చర్చించలేదు. అసెంబ్లీలో అజెండాగా చేర్చి సభ ఆమోదం కూడా తీసుకోలేదు. ఏకపక్షంగా ఒక్క కలంపోటుతో ఓ జూనియర్ అధికారితో పాలసీలో కీలకమైన అంశాలను తొలగింపచేసిన ఘనుడుగా నిలిచారు. ఈ ఉత్తర్వు బయటకొస్తే జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తూర్పారబడతారని భయపడి వెలుగులోకి రాకుండా గోప్యంగా చీకట్లో కలిపేశారు. అప్పటికే ప్రభుత్వ జీవోలను ప్రజలకు అందుబాటులోకి రాకుండా జగన్ చేస్తున్నారు. దీంతో ఏ జీవో ఇచ్చారు...దేన్ని రద్దుచేశారో ప్రజలకు తెలియకుండా పోయింది. జగన్ సర్కారును ప్రజలు ఇంటికి పంపించిన తర్వాత ఆ నాటి చీకటి జీవోలు, ఉల్లంఘనలు బయటకొస్తున్నాయి. ఇందులోభాగంగానే జీవోలు 243, 172 వెలుగులోకి వచ్చాయి.
అప్పట్లోనే బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’
జీవో 243 చీకటి జీవోను జగన్ ప్రభుత్వం జారీ చేసినప్పుడే, ‘ఆంధ్రజ్యోతి’ ఆ విషయం బయటపెట్టింది. అయితే, ‘ఆంధ్ర జ్యోతి’ తప్పుడు వార్తలు రాస్తోందని, అబద్ధాలను ప్రచారం చేస్తోందంటూ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆగ్రహించింది. పత్రికపై కేసులు నమోదుచేయాలని కూడా జగన్ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆచరణలో ఆ పనిచేయలేదు. ఎందుకంటే ఆయన చేసిన చీకటి పనులు నిజమే అన్న విషయం ఆయనకే బాగా తెలుసు కాబట్టి.! ఏదో బెదిరించాలి కాబట్టి చేశారంతే. ఆ నాటి చీకటి జీఓ 243 ఇప్పుడు బయటకొచ్చింది. ఈ జీవోలో రెండు కీలకమైన అంశాలున్నాయి... ఒకటి ల్యాండ్ పాలసీ మార్చడం. రెండోది...సవరించిన పాలసీని 2019 నవంబరు 11 నుంచే అమల్లోకి తేవడం. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలవుతోంది. ఈ జీవోలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకమని రెవెన్యూనిపుణులు చెబుతున్నారు. ఆ జీవోల వల్ల విలువైన ప్రభుత్వ భూములకు ముప్పు ఉందని రిటైర్డ్ అధికారి, రెవెన్యూ నిపుణుడు రామయ్య ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ’ఆ రెండు జీవోలు అమల్లో ఉన్నంతవరకు ప్రభుత్వ భూములకు రక్షణ లేనట్లే. కూటమి ప్రభుత్వం ఇకనైనా ఆ చీకటి జీవోలపై సమీక్ష చేసి తగిన నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలు, భావితరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను కాపాడేలా ల్యాండ్ పాలసీని తిరిగి పునరుద్ధరించాలి’’ అని ఆయన సూచించారు. జగన్ జమానాలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై కూటమి సర్కారు విచారిస్తోంది. విధ్వంసమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతోంది. దీంట్లో భాగంగా ఈ చీకటి జీవో 243ను కూడా సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.
ఆ క్లాజ్ ఏం చెబుతుందంటే..
’విలువైన ప్రభుత్వ భూములను అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు, వనరుల సమీకరణకోసం ఉపయోగించుకోకూడదని భూ కేటాయింపుల పాలసీలోని సెక్షన్ 3(ఏ) చెబుతోంది. అంటే, ప్రభుత్వ భూముల అమ్మకాలపై నిషేధం ఉందన్నమాట!
Updated Date - Dec 22 , 2024 | 07:57 AM